
తాజా వార్తలు
దేశాలు దాటొచ్చి.. స్వీయ పరీక్షకు నిలిచి..

విమానాశ్రయంలో స్వీయ ధ్రువీకరణ ఇచ్చేందుకు వేచి ఉన్న ప్రయాణికులు
ఈనాడు, హైదరాబాద్: వ్యయప్రయాసలుకోర్చి దేశాలు దాటి వచ్చారు. తీరా ఇక్కడి విమానాశ్రయంలోకి అడుగుపెట్టాక అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వీయ ధ్రువపత్రం నింపాలనే పేరుతో గంటపాటు నిలిపేస్తున్నారని వాపోతున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. స్వదేశానికి రావాలనుకుంటే ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని ఉండాలి. ఆ ఫలితంతోపాటు స్వీయ ధ్రువపత్రం ఎయిర్ సువిధ లేదా దిల్లీ ఎయిర్పోర్టు పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే ప్రయాణానికి ఎయిర్లైన్స్లు అనుమతిస్తున్నాయి. రోజూ హైదరాబాద్కు 16-20 అంతర్జాతీయ విమానాలు వస్తుంటాయి. సుమారు 2 వేల మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరి నుంచి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మళ్లీ స్వీయ ధ్రువీకరణ తీసుకుంటున్నారు. స్వీయ ధ్రువపత్రం అప్లోడ్ చేశామని చెబుతున్నా పట్టించుకోవడంలేదు. ఏపీహెచ్వో, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ప్రొటోకాల్ విభాగం ఇలా చేస్తోంది.
ఎయిర్ సువిధలోని వివరాలు తీసుకుంటే సరి
వాస్తవానికి ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా ప్రయాణికుల వివరాలు తీసుకునే వీలుంది. అయినా మరోసారి పత్రాలు నింపాలని చెబుతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారిలో ఎక్కువగా కార్మికులు, మహిళలే ఉంటున్నారు. వీరు స్వీయధ్రువీకరణ నింపేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే వేర్వేరు దేశాల నుంచి చిన్నపిల్లలతో వచ్చే మహిళలకు అవస్థలు తప్పడంలేదు.