
తాజా వార్తలు
‘ఈ’ బండి.. మాటల్లోనే నడుస్తోందండి!
వనరుల్లేక నగరంలో రోడ్డెక్కని విద్యుత్తు వాహనాలు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
చమురు ధరలు కొండెక్కుతున్నాయి.. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో కాలుష్య భూతం అంతకంతకూ విజృంభిస్తోంది. వీటికి పరిష్కారంగా.. నగర భవితకు రక్షణగా, పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు వాహనాలను వినియోగించాలని ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. అయితే ‘ఈ’ బండ్లు రోడ్డెక్కేందుకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. సరైన వనరులు లేకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా నగర దారులపై వీటి జాడ కనిపించట్లేదు. నిర్వహణ భారంతో వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదని పలువురు అంకుర సంస్థల నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో మరోసారి ఈవీ చర్చ తెర పైకి వస్తోంది.
* ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘కార్వాలే’ ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది వాహనదారులపై సర్వే చేసింది. ఇందులో ఈవీ కొనేందుకు మక్కువ చూపుతున్న వారు ఎక్కువ మందే ఉన్నా వనరులు లేక వెనకడుగు వేస్తున్నారని స్పష్టమైంది.
ఇవి ఉండాలి..!
ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీ) కోసం ఎక్కడికక్కడ కమర్షియల్ ఛార్జింగ్ కేంద్రాలు ఉండాలి. విద్యుత్తు ఉత్పాదకత, నిర్వహణ కేంద్రాలు, గ్రిడ్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇంట్లోనూ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పరుచుకునే వీలు కల్పించాలి.. బ్యాటరీ ఉత్పత్తి, వాటి రీసైక్లింగ్‌కు, ఈవీ మరమ్మతులకు కేంద్రాలు ఉండాలి. వీటన్నింటికీ మించి ఈ రంగంలో నైపుణ్యమున్న సిబ్బంది, సరైన యంత్రాంగం అవసరం.
హైదరాబాద్‌లోనే మొదలు.. కానీ..
దేశంలో ఇతర మెట్రో నగరాల్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లోనే మొదటగా విద్యుత్తు వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాల్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్‌తో ఒప్పందం చేసుకుని దాదాపు 40 కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే వీటిపై నగరవాసుల్లో అవగాహన లేకపోవడంతో అసలున్నాయో లేదో కూడా తెలియక కొనేందుకు ముందుకు రావట్లేదు. అక్కడక్కడా కమర్షియల్ ఛార్జింగ్ కేంద్రాలున్నా వాటి గురించి చాలామందికి తెలియదు.
చమురు భారం.. దూరం! ప్రస్తుతం నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.94.54, డీజిల్ ధర రూ.88.86 ఉన్నాయి. సగటున ఓ ద్విచక్ర వాహనం లీటరుకు 40 నుంచి 50 కి.మీ., కార్లు అయితే 7 నుంచి 18 కి.మీ. మైలేజీ ఇస్తున్నాయి. అంటే కి.మీ.కు బైకులకు కనీసం రూ.2.50 నుంచి రూ.3 దాకా, కార్లకు రూ.8 నుంచి రూ.10 దాకా ఖర్చవుతోంది. అయితే ఈ విద్యుత్తు వాహనాలతో రూ.20 ఖర్చుతో కనీసం 60 కి.మీ. దాకా మైలేజీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అంటున్నారు.
ప్రయోజనాలపై ప్రచారం కల్పించాలి
- అషార్ అహ్మద్, స్కిల్షార్క్ ఎడ్యుటెక్
ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఈవీ ఎకో సిస్టమ్ మరింత పెరగాలి. సరైన మౌలిక వనరులు, నైపుణ్యమున్న యంత్రాంగం అందుబాటులోకి రావాలి. అప్పుడే వినియోగదారులు ముందుకొస్తారు. దీంతోపాటు ఈవీ లాభాలపై విస్తృత ప్రచారం కల్పించాలి.