close

తాజా వార్తలు

Published : 24/01/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తోకచుక్క  (భారతీయాంగ్ల కథ)

మూలం: శాస్త్రవేత్త జయంత్‌ వి.నర్లీకర్‌    

అనువాదం:  డా. యు. విష్ణుప్రియ

ఓ తోకచుక్క భూమిని ఢీ కొడుతుందని కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఆ ఉత్పాతాన్ని తప్పించేందుకు ఏం చేశారు? దత్తదా కనిపెట్టిన కొత్త తోకచుక్క త్వరలో భూమిని ఢీకొట్టబోతోందని తెలిసింది. శాస్త్రవేత్తల్లో ఆందోళన! ఆ ఉత్పాతం ఎలా తప్పింది?
డిసెంబర్‌లోని ఓ చీకటి రాత్రి. కిటికీలోంచి వచ్చిన చలిగాలి తాకిడికి వెచ్చగా నిద్రపోతున్న ఇంద్రాణీ దేవికి మెలకువ వచ్చేసింది. సమాధానం తెలిసినా అరనిద్రలోనే మనసులో ప్రశ్నించుకుంటూ తన పక్కని, దిండును తడిమింది. భర్త దత్తదా ఆమె పక్కన లేరు.
‘‘అయితే ఈయన ఆ పాడు దివ్యతో గడపడానికి వెళ్లుంటారు. అయినా వెళ్లేటప్పుడు తలుపు దగ్గరికెయ్యాలన్న ఆలోచనే లేదు’’ భర్త గురించి అనుకుంటూ పెదాల మీద మాత్రం చిరునవ్వుని అణచలేకపోయింది. ఇహ లోకపు సమస్యల గురించి, ఇంటి గురించీ ఆయనెంతగా మరచిపోతారో ఆమెకి బాగా తెలుసు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయనకి డాక్టరు బాగానే చెప్పారు. అంతెందుకు! ఆయన పడక పక్కనే ఉన్న కుర్చీలోనే స్వెటర్‌ ఉంటుంది. అయినా వేసుకోవాలని ఆయనకి గుర్తుండాలి కదా! అంతేమరి - ఆ దివ్య అతనికి ఏం మంత్రం వేసిందో గానీ అతనికి ఎవరి మాటా గుర్తుండదు!
క్షణం ఆలస్యం చేయకుండా దివ్యతో ఏకాంతాన్ని భంగం చేయడానికి ఆమె ఓ శాలువా కప్పుకుని, కుర్చీపైనున్న తెల్ల స్వెటర్‌ తీసుకుని మేడపైకి దారి తీసింది. అక్కడ దివ్య, ఆయన ఒకరినొకరు హత్తుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు. దివ్య సంగతేమోగానీ ఆయన మాత్రం తన కళ్లలోకే చూస్తున్నారు.
దత్తదా మొదటిసారి టెలిస్కోపు (దుర్భిణి) తెచ్చుకున్నప్పుడు ఎంతో ఉద్వేగపడిపోతూ దానికి ‘దివ్య చక్షు’ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఇంద్రాణీ దేవి దృష్టిలో అది తన భర్తని లోబరచుకోవడానికి కల్పించిన ఓ మాయ లేడి. అందువల్ల ఆవిడ దాన్ని ఎప్పుడూ ‘దివ్య’ అనే సంబోధిస్తుంటుంది. చివరికి అదే పేరు ఖరారైంది కూడా! ఎవరేమనుకుంటేనేం దత్తదాకి మాత్రం ఆ టెలిస్కోపు కొనడం తన చిరకాల వాంఛని నెరవేర్చుకోవడమే. ఓ ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తగా చక్కటి టెలీస్కోపు కొనడానికి డబ్బు, సమయం చూసుకుని మరీ ఎంచుకున్నదది. ఆయన పదవీ విరమణ సమయానికి రెండూ సమకూరడంతో ఆయన కోరిక నెరవేరినట్టయింది. దాన్ని తెచ్చుకున్నాక ఇంటిమేడ మీద దాన్ని నిలబెట్టి ఎన్నో సుదీర్ఘ రాత్రులు నక్షత్రాలను అన్వేషిస్తూ కాలం గడుపుతున్నాడు.
‘‘ఇదిగోండి! ఇప్పటికైనా స్వెటర్‌ వేసుకుంటారా లేక డాక్టర్‌ నవీన్‌ బాబు చేత విశ్రాంతి తీసుకొమ్మని చెప్పించుకుంటారా?’’ అంది ఇంద్రాణి. ఎంతోమంది ఔత్సాహిక ఖగోళ పరిశీలకుల్లానే దత్తదాకి కూడా ఏదో రోజు తానో కొత్త తోకచుక్కని కనిపెట్టాలని రహస్యంగా మనసులో ఓ కోరిక ఉంది. ఈ తోకచుక్కలు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. గ్రహాలలాగే తోకచుక్కలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. కానీ వాటి కక్ష్యలు చాలా అసాధారణంగా ఉంటాయి. అందువల్ల అవి ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే సూర్యుడికి దగ్గరగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వాటికున్న పెద్ద తోకలు సూర్యుడి వెలుతురుకి అలా మెరిసి ఇలా మాయమవుతుంటాయి. మళ్లీ వాటి దర్శనం ఎన్నేళ్లకో లేదా ఎన్ని శతాబ్దాలకో!
మరి ఈ ఎనిమిదంగుళాల ‘దివ్య’తో అతనికి తన లక్ష్యం సాధించడానికి అవకాశం ఉందా? పెద్ద పెద్ద టెలిస్కోపులు ఉన్న గొప్ప శాస్త్రవేత్తలు  ఎందరు లేరు!
అయితే దత్తదా గొప్ప ఆశావాది. పెద్ద శాస్త్రవేత్తలందరూ ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలతో ఎప్పుడూ అవే అస్పష్ట నక్షత్రాలు, నక్షత్ర మండలాలూ గమనిస్తూ కూర్చుంటారని అతనికి బాగా తెలుసు.
వాళ్ల దృష్టి నుంచి ఇలాంటి అప్రధానమైన తోకచుక్కలు తప్పించుకు పోయే అవకాశం ఎక్కువ. నిజం చెప్పాలంటే ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలే ఇలాంటి విషయాల్లో ఎంతో నయం- అంతటి అనుభవజ్ఞుల కళ్ల నుంచి తప్పించుకుని మరీ వచ్చి వీళ్ల కళ్లబడుతుంటాయి.
ఎందుకనో దత్తదా దృష్టిలో ఈ రాత్రి ఎంతో విశిష్టమైందిగా అనిపించసాగింది. ఆ రాత్రి ప్రతిరాత్రీ కనిపించే నక్షత్రాల నడుమ ఎంతో అస్పష్టంగా ఓ కొత్త దృశ్యం! తన దగ్గరున్న చిత్ర పటాల్ని మరీ మరీ పరీక్షించి చూశారు, ‘దివ్య’కున్న కటకాలకు చారికలు, దుమ్ములాంటివేమైనా ఏర్పడ్డాయేమోనని పరిశీలించి చూశారు. తర్వాత టార్చిలైట్‌ సాయంతో జేబులోని చిన్న కాలిక్యులేటర్‌లో ఏవో లెక్కలు వేసి గణించి చూశారు. లౌకిక విషయాల్లో ఎంత మందబుద్ధి ప్రదర్శిస్తారో ఈ గగన పరిశీలనలో మాత్రం ఆయనంత కచ్చితంగా ఉంటారు!
అవును, నిజమే! అతను ఇంతసేపు గమనిస్తున్నది ఇదివరకు ఎక్కడా లేనిదే- ఓ కొత్త తోకచుక్క! రెండు రోజుల తర్వాత ‘ఆనంద్‌ బజార్‌’ పత్రికలో వార్త ఇలా ప్రచురితమైంది.
కొత్త తోకచుక్కను కనిపెట్టిన కోల్‌కతావాసి.
‘‘(ప్రత్యేక ప్రతినిధి ద్వారా) కోల్‌కతా నగరానికి ఉత్తర భాగాన నివసిస్తున్న మనోజ్‌ దత్తా అనే శాస్త్రవేత్త ఓ కొత్త తోకచుక్కని తానే కనుగొన్నానని చెబుతున్నారు. గత రెండు రాత్రులుగా ఆయన ఈ తోకచుక్కని గమనించాక ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ), బెంగుళూరు’కి దాని వివరాలు తెలియబరిచానంటున్నారు. ఆసియాలో అతి పెద్ద టెలిస్కోప్‌ ఉన్న ఐఐఏ ఈ విషయం ధ్రువీకరిస్తే ఓ ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకుడికి జీవితంలోనే ఓ పెద్ద శిఖరం అధిరోహించినట్టవుతుంది. స్నేహితులు, సన్నిహితులూ ‘దత్తదా’ అని పిలుచుకునే ఈ ఔత్సాహికుడు ఈ తోకచుక్కని మరికొద్ది నెలల్లోనే టెలిస్కోప్‌ సహాయం లేకుండానే ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చని వివరిస్తున్నారు. తన విజయం ‘దివ్య’గా పిలుచుకునే తమ టెలిస్కోప్‌ వల్లే సాధ్యమైందని ఆయన వెల్లడిస్తున్నారు’’
ఓ వారంలోపే ఆ విషయాన్ని ఐఐఏ ధ్రువీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా దానికి ‘దత్తా తోకచుక్క’ అని పేరు పెట్టడం, అందరూ ఆమోదించడం జరిగిపోయాయి. అంతరిక్షంలో ఓ విషయాన్ని కొత్తగా ఎవరు కనుగొంటారో వారి పేరు మీదే అది చెల్లుబాటవడం ఆనవాయితీ. దాంతో స్వతహాగా అంతర్ముఖుడైన దత్తదాకి అనూహ్యమైన ప్రాచుర్యం లభించింది. లెక్కలేనన్ని సమావేశాలు, సన్మానాలూ! అలా ఓ సమావేశం నుంచి తిరిగొస్తూ విసుగ్గా తనలో తానే గొణుక్కోసాగారు. ‘‘హు! ఈ తోకచుక్కని నేను కనిపెట్టకుంటే బాగుండేదేమో’’
దానికి ఇంద్రాణీదేవి ‘‘ఔను! నేను కూడా అదే అనుకుంటున్నాను’’ అంది.
ఆశ్చర్యపోయిన దత్తదా ‘‘అలా ఎందుకు అనుకుంటున్నావు?’’ అన్నారు.
‘‘తోక చుక్కలు ఉత్పాతాలు సృష్టిస్తాయట కదా! అందులోనూ మీలాంటి మంచి వాళ్లు ఇలాంటి వాటిని ఎందుకు కనిపెట్టాలసలు!’’ ఆందోళన కలిసిన స్వరంతో అందామె.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని