close

తాజా వార్తలు

Published : 24/01/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నమ్మిన చోటే... కుతంత్రం

వృద్ధురాలిని మోసగించిన ఘనుడు

ఫ్లాట్లు కొనిస్తానంటూ రూ.96.50 లక్షలు పక్కదారి

నిందితుడితో సహా మహిళ అరెస్టు

రూ.60.77 లక్షల నగదు, సొత్తు స్వాధీనం

వృద్ధురాలి కుటుంబ ఆశలనే తన మోసానికి దారిగా చేసుకున్నాడు... ఏ మాత్రం అనుమానం రాకుండా మాటలతో మాయ చేశాడు అవిగో ఫ్లాట్లు... అంతా సిద్ధమైపోతున్నాయని ఎప్పటికప్పుడు రోజులు గడిపేశాడు. పక్కదారి పట్టించిన సొమ్ములతో భారీగా బంగారం కొనుగోలు చేశాడు. కళ్లు తిరిగేలా ఆభరణాలు చేయించాడు... ఖరీదైన ఫోను... ద్విచక్రవాహనం కొని తనతో సన్నిహితంగా ఉన్న మహిళకు అప్పగించాడు. చివరికి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. శనివారం గాజువాక పోలీసు స్టేషన్‌లో సౌత్‌ ఏసీపీ రామాంజనేయులురెడ్డి, గాజువాక సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక శ్రీనగర్‌కు చెందిన సాలాపు లీలావతి(61) భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో ఉంటున్నారు. కె.కోటపాడు మండలం ఎ. కోడూరుకు చెందిన ఇ.నాగభూషణరావు (32) గాజువాకలో కొన్నాళ్ల పాటు ఓ బిల్లు కలెక్టరు వద్ద సహాయకుడిగా పని చేసి మానేశాడు. తరువాత ఖాళీగా ఉన్నాడు. గత ఏడాది ఆగస్టులో ఇంటి పన్ను చెల్లించడానికి వచ్చిన లీలావతితో పరిచయమేర్పడింది. ఆమెతో చనువుగా ఉంటూ చిన్నచిన్న పనులకు సాయపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో కుమారుడిగా సాయపడుతున్నావంటూ ఆమె అతన్ని నమ్మింది. తమ కుమార్తెలకు మంచి ఫ్లాట్లు కావాలని, డబ్బులు సిద్ధంగా ఉన్నాయని చెప్పటంతో నాగభూషణరావులో దుర్బుద్ధి కలిగింది. దీంతో సొమ్ములు కొల్లగొట్టే పథకం రచించాడు.

* దువ్వాడ, కూర్మన్నపాలెంలో ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయంటూ నకిలీ పత్రాలు, ఫొటోలు చూపించారు. దీంతో దఫదఫాలుగా రూ.96.50 లక్షలను లీలావతి చెల్లించింది. తరువాత ఎప్పటికప్పుడు ఫ్లాట్లు సిద్ధమవుతున్నాయని నమ్మకంగా చెబుతుండటంతో నిజమేననుకుంది.


బాధితురాలు లీలావతి

* లీలావతి నుంచి తీసుకున్న డబ్బుతో తనతో సన్నిహితంగా ఉంటున్న రమణమ్మ (36)కు రూ.25 లక్షలతో 560 గ్రాముల బంగారు గొలుసులు, గాజులు, నక్లెస్‌లు, ఇతర ఆభరణాలు కొని ఇచ్చాడు. 6.4 కిలలో వెండి వస్తువులు, రూ.90 వేలతో స్కూటీ, రూ.76 వేల ఖరీదైన ఐఫోన్‌, రూ.5 లక్షల బాండు పేపర్లు ఇచ్చాడు. వీరిద్దరి ఇళ్లల్లోనూ రూ.24.94 లక్షల నగదును దాచారు.

* గత కొన్ని రోజులుగా నాగభూషణరావు కనిపించకపోవడంతో లీలావతికి అనుమానం వచ్చింది. ఆమె కుమార్తెలూ అతని గురించి ఆరా తీశారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన చిరునామా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రామాంజనేయులు రెడ్డి, చిత్రంలో సీఐ మల్లేశ్వరరావు తదితరులు

* రమణమ్మను స్టేషనుకు రప్పించిన పోలీసులు బంగారు, వెండి, డబ్బుల వివరాలన్నీ ఆరా తీశారు. ఆపై రికవరీ చేశారు. ఇలా మొత్తం రూ. 66.77 లక్షల వరకూ రాబట్టగలిగారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగిలిన మొత్తం ఎక్కడుందో తెలియాల్సి ఉందని, పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామని సౌత్‌ ఏసీపీ రామాంజనేయులు రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన ఎస్‌ఐ బీబీఎస్‌ గణేష్‌, కానిస్టేబుళ్లు ఎం.రామారావు, వి.సంతోష్‌, సీహెచ్‌ బంగారు రాజులకు రివార్డులు అందజేస్తామన్నారు. గాజువాక సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* ‘కాజేసిన డబ్బుతో బంగారం కొని.. ధర పెరిగితే అమ్మేసి అసలు సొమ్ములు ఇచ్చేద్దామనుకున్నా’ అని నిందితుడు చెబుతుండటం గమనార్హం.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని