close

తాజా వార్తలు

Published : 30/09/2020 08:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ చోరీ కంజర్‌భట్ల పనే!

కంటైనర్‌లో సెల్‌ఫోన్ల చోరీ కేసు కొలిక్కి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సరకు స్వాధీనం

13 రోజుల్లోనే నిగ్గు తేల్చిన అర్బన్‌ పోలీసులు

ఈనాడు-గుంటూరు

ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, అర్బన్‌ ఎస్పీ

శ్రీసిటీ సెజ్‌ నుంచి కోల్‌కతాకు కంటైనర్‌లో తరలుతున్న సెల్‌ఫోన్లను మార్గమధ్యలో కంటైనర్‌ తలుపులు తెరిచి అపహరించుకుపోయిన మధ్యప్రదేశ్‌ ముఠా సభ్యులు కొందరిని ఎట్టకేలకు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. ముఠా సభ్యులతో పాటు 93 శాతం సరకును నల్లబజార్‌కు తరలకుండానే ఓ గోదాము నుంచి స్వాధీనం చేసుకున్నారు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని చేగుంట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన 2200 సెల్‌ఫోన్ల సరకును గుంటూరు అర్బన్‌ పోలీసులే స్వాధీనం చేసుకున్నారు. ఆ సరకు చోరీ అయినట్లు ఈ నెల 17న సిద్ధిపేట జిల్లా చేగుంట స్టేషన్‌లో కేసు నమోదైంది. గుంటూరు అర్బన్‌లో చోరీ జరిగిన ప్రదేశానికి అదే రోజు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి చేరుకుని ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా పని అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా కేసు దర్యాప్తునకు ఆదేశించడం, ఆయన అనుమానించినట్లే ఆ ముఠానే ఈ ఫోన్లను దొంగిలించుకుపోయినట్లు తేలడంతో కేసు చిక్కుముడి వీడినట్లు అయింది. రూ.81లక్షలు విలువైన 40 బాక్సులు అపహరణకు గురైనట్లు ఈ నెల 16న కంటైనర్‌ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన నల్లపాడు పోలీసులు కేవలం 13 రోజుల వ్యవధిలోనే చోరీని ఓ కొలిక్కి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాలు గత రెండేళ్లుగా రాష్ట్రంలోకి వచ్చి విలువైన సరకు లారీలపై కన్నేసి అపహరణకు పాల్పడుతున్నాయి. ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ముఠాల నడవడిక.. వారి వ్యవహారశైలి ఎలా ఉంటుందో వీడియోలు తెప్పించి దర్యాప్తు బృందాలకు చూపించారు. వారికి మధ్యప్రదేశ్‌ పోలీసుల నుంచి సహకారం అందేలా సమన్వయపరిచారు. దీంతో నల్లపాడు ఇన్‌స్పెక్టర్‌ వీరాస్వామి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసులతో కూడిన రెండు బృందాలు ఈనెల 18న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లాయి. ఒక్కో బృందంలో ఐదుగురు చొప్పున మొత్తం పది మంది పోలీసులు చోరీకి పాల్పడిన ముఠా ఆచూకీని కనుగొనడంలో పాలుపంచుకున్నారు. ఇండోర్‌కు 60-70 కిలోమీటర్ల దూరంలో దేవాస్‌ ప్రాంతంలో చోరీలకు పాల్పడే ముఠాలైన కంజర్‌భట్లు ఉంటున్నారని తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆంధ్రా పోలీసులు వచ్చిన సమాచారం వారికి ముందుగానే తెలియడంతో కొందరు తప్పించుకుపోగా కీలకమైన ఇద్దరు కంజర్‌భట్లు, మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు చిక్కారు. వారి నుంచి సమాచారం సేకరించి ఇండోర్‌లోని ఓ గోదాములో దాచిన సరకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కంజర్‌భట్లకు చెందిన ముఠా సభ్యులను తొలుత మధ్యప్రదేశ్‌ పోలీసుల ముంగిట హాజరుపరిచి వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం రాత్రి అక్కడి నుంచి గుంటూరుకు తీసుకురావాలనే యోచనలో అర్బన్‌ ఎస్పీ ఉన్నారని తెలిసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ పోలీసులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న సరకు, లారీని వారితో పాటే తీసుకురానున్నారు.

15 కి.మీ పరిధిలో ఫుటేజీల సేకరణ...

ఇన్‌స్పెక్టర్‌ వీరాస్వామి బృందం ఉదయం 7 గంటలకు బయలుదేరి రాత్రి ఒంటి గంట దాకా ఇండోర్‌లోని ప్రతి వీధిలో ఆంధ్రా వైపు నుంచి వచ్చే సరకు లారీలు ఎక్కడ ఆగుతున్నాయి? వాటిల్లో కంటైనర్‌ నుంచి సరకు తరలించిన లారీ ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. సుమారు 15 కి.మీ పొడవునా కాలినడకనే ప్రయాణించి సీసీ ఫుటేజీలు సేకరించారు. ఇండోర్‌లోని ఓ గోదాములో ఈ సరకు లారీ నుంచి ఆటోల్లోకి ఎక్కించినట్లు ఫుటేజీ లభ్యమైంది. ఆ ఆటో నంబర్లు పట్టుకుని వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకోగా కంజరభట్ల వివరాలు తెలిశాయి. గుజరాత్‌కు చెందిన లారీని అద్దెకు తీసుకుని సరకును కంజర్‌భట్ల ముఠాలు ఇండోర్‌కు తరలించినట్లు సమాచారం. కంజర్‌భట్లకు, సరకు తరలించిన లారీని సమకూర్చిన వ్యక్తికి మధ్య ఓ ఇన్నోవాకారు యజమాని దళారిగా వ్యవహరించినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు ఇన్నోవా వాహనం ఏపీలో ప్రయాణించిన ఫుటేజీలు పోలీసులు సేకరించారు. దీనిపై ఎస్పీ అమ్మిరెడ్డిని సంప్రదించగా రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.