close

తాజా వార్తలు

Published : 21/09/2020 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊరెళ్లిపోతా.. నే చదువుకుంటా..

శ్రీకాకుళం వెళ్లేందుకు బాలిక ప్రయత్నం

తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: చదువంటే ఆ అమ్మాయికి ఎంతో ఇష్టం.. ఈ ఏడాది 9వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చింది. ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇంతలో తల్లి వచ్చి పని చేసుకుందాం చదువు ఇక వద్దని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చింది. చదువుపై తనకున్న మమకారం పోలేదు. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. సొంత ఊరికి వెళ్దామని దారి తెలియక 20 కిలో మీటర్లు నడిచింది. రాత్రంతా రోడ్డు పక్కనే పడుకుంది. ఉదయం పోలీసుల ద్వారా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి నేరేడ్‌మెట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట మండలం కనకవరస గ్రామానికి చెందిన కరెపాటి చిరంజీవి, ఎంగమ్మ దంపతులు నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని వినాయక్‌నగర్‌లో ఉంటున్నారు. వీరిద్దరు మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి సీత(16), గీత(16) కవల పిల్లలు. ఈ ఇద్దరు పిల్లలు శ్రీకాకుళంలో ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ ఏడాది 9వ తరగతి పాసై 10వ తరగతికి వచ్చారు. నెల క్రితం 10వ తరగతి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కావడంతో బంధువుల ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా వారికి జీవనోపాధి కష్టం కావడంతో తండ్రి ఇద్దరు కూతుళ్లను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌ తీసుకురమ్మని భార్యను పంపాడు. ఆమె పది రోజలు క్రితం కూతుళ్లను వినాయక్‌నగర్‌కు తీసుకొచ్చింది. వాళ్లను కూలీ పనికి పంపాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.

చదువు మాని పనికెళ్లడం ఇష్టంలేక..

చదువంటే ఎంతో ఇష్టమున్న సీతకు పనికెళ్లడం నచ్చలేదు. పదో తరగతి చదువుతానని చెప్పినా తండ్రి పని చేయాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో సీత శనివారం ఉదయం 11 గంటలకు ఎవరికి చెప్పకుండా శ్రీకాకుళం వెళ్దామని బయలు దేరింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నేరేడ్‌మెట్‌ నుంచి మల్కాజిగిరి వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. మల్కాజిగిరి వరకు వెళ్లిన సీత తరువాత ఎక్కడకు వెళ్లిందో తెలియలేదు. బాలిక రోడ్డు మార్గంలో నేరేడ్‌మెట్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు సుమారు 20 కి.మీ. ఒంటరిగా నడిచి వెళ్లింది. ఊరికి ఎలా వెళ్లాలో తెలియలేదు. రాత్రి అయింది. ఎల్బీనగర్‌లోని బస్‌స్టాపులో రాత్రి పడుకుంది. ఓ ఆటో డ్రైవర్‌ గమనించి బాలికను స్థానిక ఎల్బీనగర్‌ పోలీసులకు అప్పగించాడు. వారు నేరేడ్‌మెట్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ నర్సింహస్వామి, ఎస్‌ఐ మహేందర్‌ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మాయిని చదివించాలని, పనికి పంపొద్దని హెచ్చరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.