close

తాజా వార్తలు

Published : 07/07/2020 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌...అమ్మకాల జోరు

దుస్తులు, గాడ్జెట్లకు పెరిగిన గిరాకీ

ఖైరతాబాద్‌లో ఓ 22 నివాస గృహాలు ఉన్న అపార్టుమెంటుకు వారానికి తక్కువలో తక్కువ 400 పార్శిళ్లు వస్తున్నాయి. ఎక్కువగా దుస్తులే ఉంటున్నాయి. ‘మా అపార్టుమెంట్లో ఉండే వాళ్లు దుస్తులు, ఇతర వస్తువులన్నీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారానే కొంటున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలు మొదలు కావడంతో దుస్తులు ఆర్డర్‌ చేస్తున్నారు’ అని తెలిపారు శ్వేతారెడ్డి అనే మహిళ.

హైదరాబాద్‌ నగరంలో ఏ గల్లీలో చూసినా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ పార్శిళ్లు అందించే కుర్రోళ్ల రాకపోకలే. గతంలో చిన్నచిన్న ప్యాక్‌లే కనిపించేవి. ఇప్పుడు పెద్దపెద్ద మూటలు వస్తున్నాయి. అవసరమైతే వ్యాన్‌లో తెచ్చి డెలివరీలు ఇస్తున్నారు. కరోనాతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. లాక్‌డౌన్‌తో వేసవి ఇంట్లోనే గడిచిపోయింది. మామూలుగా అయితే ఇప్పుడు పాఠశాలలు తెరిచే సమయం. ఏటా మే నెల చివర్లో లేదా జూన్‌ నెలలో పిల్లలకు కావాల్సిన దుస్తులు, స్టేషనరీ వగైరా కొనేవారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ఎటూ తేలడం లేదు. మరోవైపు ఆన్‌లైన్‌ పాఠాల జోరు పెరిగింది. దీంతో తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సిన దుస్తులు, ఇతర సామగ్రిని ఆన్‌లైన్‌లో కొంటున్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు నేను రోజుకు కనీసం 35 వరకు వివిధ రకాల పార్శిళ్లు సరఫరా చేసేవాడిని. ఇప్పుడు యాభై వరకు చేరవేస్తున్నాను. ఈ నెలలో ఆర్డర్లు పెరిగాయి. వీటిలో ఎక్కువగా దుస్తులకు సంబంధించినవి ఉంటున్నాయి. పంజాగుట్ట వేదికగా పనిచేసే మా సబ్‌ బ్రాంచ్‌ పరిధిలో ఒకప్పుడు 28 మంది పనిచేసేవాళ్లం. ఇప్పుడు 50 మంది అయ్యాం’’ అంటూ ఓ సంస్థకు చెందిన కుర్రోడు ‘ఈనాడు’కు తెలిపారు.

హెడ్‌ఫోన్స్‌, ట్యాబులు, మొబైల్‌ పవర్‌ బ్యాంకులకు ఆర్డర్లు ఎక్కువ

ఆన్‌లైన్‌ ద్వారా వస్తున్న పార్శిళ్లలో ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలు, ఉపాధ్యాయుల విద్యా బోధన, ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో గాడ్జెట్లకు గిరాకీ పెరిగింది. హెడ్‌ఫోన్స్‌, ట్యాబులు, మొబైల్‌ పవర్‌ బ్యాంకులకు ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయని మియాపూర్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్న ఓ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ రోహిణి పేర్కొన్నారు. ట్యాబ్‌ల కోసం పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారని రూ.10 వేల లోపు ఉన్న వాటిని చాలా మంది ఆర్డర్‌ చేస్తున్నారని ఆమె తెలిపారు.

శానిటైజ్‌ చేసుకున్నాకే ఇంట్లోకి పార్శిళ్లు

ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది. పార్శిళ్లను తాకేందుకు ఎవరూ ఇష్టపడడం లేదని వాటిని అందజేస్తున్న బాయ్స్‌ చెబుతున్నారు. పార్శిల్‌ను ఫలానా చోట పెట్టమంటున్నారని.. శానిటైజ్‌ చేసుకున్నాకే ఇంట్లోకి తీసుకెళ్తున్నారని వివరించారు. పై అంతస్తుల్లో ఉండేవాళ్లయితే తాడుకట్టి బుట్ట కిందికి వదులుతున్నారని, కిందికి దిగి రావడం లేదని  పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని