కడపలో కరోనా బాంబు 
close

తాజా వార్తలు

Published : 02/04/2020 08:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కడపలో కరోనా బాంబు 

ఊరూరికీ మహమ్మారి

  జిల్లాలో ఒకేరోజు 15 పాజిటివ్‌ కేసులు నమోదు 

● అందులో దిల్లీకి వెళ్లి వచ్చిన వారే 14 మంది

● ఆందోళనలో ప్రజలు.. చర్యలు చేపట్టిన అధికారులు

ఈనాడు డిజిటల్‌, కడప : జిల్లాలో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. ఒక్కరోజులోనే కడప జిల్లావ్యాప్తంగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర కరోనా నోడల్‌ అధికారి బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో ఈ వివరాలను వెల్లడించారు. మార్చి 31 రాత్రి 9 నుంచి ఏప్రిల్‌ 1 ఉదయం 9 గంటల వరకు పరీక్షించిన నమూనాల్లో ఈ కరోనా కేసులు నమోదైనట్లు ఇందులో స్పష్టం చేశారు. జిల్లాలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో 1 నగరపాలిక, 3 పురపాలికలు, 1 గ్రామపంచాయతీలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో కడప నగరపాలికలో 4, ప్రొద్దుటూరు 7, బద్వేలు, పులివెందులలో ఒక్కో వ్యక్తికి, వేంపల్లెలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వీరిలో 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు నలుగురు, 80 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఎక్కువ వయస్కులకు కడపలోని సర్వజన ఆసుపత్రిలో ముందస్తుగా వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితులను బట్టి తిరుపతికి పంపిస్తామన్నారు. మిగతా వారందరికీ కొవిడ్‌-19 జిల్లా ఆసుపత్రిగా ప్రకటించిన కడప ఫాతిమా వైద్య కళాశాలలో వైద్యం అందిస్తామన్నారు.

*బాధిత వ్యక్తుల కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు.

*&జిల్లాలో ప్రొద్దుటూరులోనే అత్యధికంగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో పెన్నా, కేహెచ్‌ఎం వీధుల్లో ఇద్దరు చొప్పున, శ్రీనివాస, మట్టి మసీదు వీధులు, ఆంధ్ర కేసరి రోడ్డుకు సంబంధించి ఒక్కో వ్యక్తికి వైరస్‌ సోకింది.

161 మందిపై దృష్టి 

జిల్లాలో నమోదైన 15 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 14 మంది దిల్లీకి వెళ్లి వచ్చిన వారే ఉన్నారు. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వారి సన్నిహితుల్లో ఒకరికి సోకింది. ప్రాథమిక సమాచారం మేరకు జిల్లాలో మొత్తం 161 మందిపై దృష్టి సారించారు. ఇందులో విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారు 18 మంది, వారి సన్నిహితులు ఐదుగురు, దిల్లీ నుంచి జిల్లాకు వచ్చినవారు 55, వారి సన్నిహితులు 58, ఇతరులు 25 మంది ఉన్నారు. వీరి కదలికలు, ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

పసిడిపురిలో గోలగోల

ప్రొద్దుటూరు పురపాలిక : ప్రొద్దుటూరు పట్టణంలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలంతా ఆందోళనలో పడ్డారు. జాతీయస్థాయిలో రాకపోకలు ఉన్న పసిడిపురిలో రానున్నరోజుల్లో మరెన్ని కేసుల సమాచారం వినాల్సివస్తుందోనని ఆందోళన మొదలైంది. బాధితులు నివసించిన ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించి, వైరస్‌ విస్తృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. స్థానిక పురపాలక సంస్థ కౌన్సిల్‌ సభాభవనంలో జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కరోనా వైరస్‌ నివారణకు టాస్క్‌ఫోర్సు అధికారులు సమావేశమయ్యారు. ఊరంతా సోడియం హైపో క్లోరైడ్‌ను 20 ట్రాక్టర్ల సాయంతో పిచికారి చేయనున్నామని చెప్పారు.

బద్వేలులో కలకలం

బద్వేలు : బద్వేలు పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. ఇటీవల మతపరమైన సమావేశానికి దిల్లీ వెళ్లిన బాధితుడు ఈ నెల 17వ తేదీన బద్వేలుకు వచ్చారు. ఇతను పోరుమామిళ్ల మండలం గానుగపెంట వెళ్లి అక్కడ మూడు రోజులు ప్రార్థనలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఏడుగురిని రిమ్స్‌కు, ఐదుగురిని బద్వేలు క్వారంటైన్‌ సెంటరుకు ప్రత్యేక వాహనాల్లో తరలించినట్లు పట్టణ సీఐ రమేష్‌ బాబు న్యూస్‌టుడేకు తెలిపారు. ఆ కాలనీ నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు చెప్పారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని నిషేధాజ్ఞలు జారీ చేసి కంచె వేశారు. నిత్యావసర సరకులు, కూరగాయలు ఇంటికే చేరవేస్తామని తెలియజేశారు. వీధుల్లో బ్లీచింగ్‌ రసాయనిక ద్రావణాన్ని పిచికారి చేశారు.

ఆ ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ 

జిల్లాలో బుధవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ఆ వ్యక్తులు ఉన్న ప్రాంతాలకు 3 కిలోమీటర్ల పరిధిలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తాం. ఎవరైనా దిల్లీ నుంచి తిరిగి వచ్చి ఉంటే స్వచ్ఛందంగా కరోనా నిర్ధ్ధరణ పరీక్షలు చేసుకోవాలి. బుధవారం మధ్యాహ్నం వరకు దిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన 41 మంది నమూనాలు పరీక్షించగా చాలా వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. - హరికిరణ్‌, జిల్లా పాలనాధికారి, కడప

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని