పదే పదే... మళ్ళీ అదే!
close

తాజా వార్తలు

Published : 29/03/2020 06:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదే పదే... మళ్ళీ అదే!

- పసుపులేటి తాతారావు

ఎప్పటిలాగే ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళాడు దశరథరామయ్య. గుమ్మం ముందు నిలబడి కాలింగ్‌బెల్‌ కొట్టాడు. వెంటనే తెరుచుకోలేదు. అసహనంగా అనిపించింది. ‘‘ఎవరు లోపల..? తలుపు తీయండి. ఎవరూ పలకరేం?’’ అని
గట్టిగా అరిచాడు.
కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కనిపించిన స్త్రీమూర్తిని చూసి ముఖం ముటముటలాడించాడు.
‘‘అన్నయ్యగారా... రండి లోపలికి’’ అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది.
ఆ చిరునవ్వు అతనికి ఎంతమాత్రం నచ్చలేదు. ఎందుకంటే తిరిగి అదే విధమైన చిరునవ్వుతో తానామెని పలకరించాలి కదా... అది అతనికి బొత్తిగా ఇష్టం లేదు.
లోపలికి రెండడుగులు వేశాడు. ‘‘ఏంటమ్మా ఇది? అప్పు తీర్చడానికి ఆలస్యమైంది అంటే ఏదో అనుకోవచ్చు. తలుపు తీయడానికి కూడా ఆలస్యమేనా... ఎందుకింత నిర్లక్ష్యం?’’ సాధ్యమైనంత విసుగ్గా మొహం పెట్టి అడగాలనుకున్నా అది లాలించి అడుగుతున్నట్టే వినిపిస్తోంది. ఆమె నొచ్చుకోవాలన్న అతని ప్రయత్నం సఫలం కావడం లేదు. ఇంకా అలాగే నవ్వుతూ చూస్తోందామె అతని వైపే.
‘‘ఏంటమ్మా అలా చూస్తావు,
ఆ నవ్వేమిటి? నేనేం నీతో కులాసా కబుర్లు చెప్పడానికి రాలేదు. నాకు రావాల్సిన బాకీ డబ్బు ఇచ్చేస్తే తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను. ఆ తర్వాత నా ముఖం చూపించమన్నా చూపించను’’ అన్నాడు కోపంగా. ఇచ్చిన అప్పు తిరిగి వసూలు చేసుకోవాలంటే
ఆ మాత్రం కఠినత్వం తప్పదని అతని ఉద్దేశం. కానీ ఉద్దేశం సరిగ్గా నెరవేరినట్టు అతనికే అనిపించడం లేదు.
‘‘కూర్చోండి అన్నయ్యా’’ అని సోఫా వైపు చూపించింది. ఎంతో ఆప్యాయంగా ఉన్న ఆమె పిలుపు అతని చెవులకి వీనుల విందుగా వినిపించింది. దాంతో అతని మనసు కొద్దిగా కరగబోయింది. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి తనని తాను సంభాళించుకున్నాడు. మనసుని దృఢంగా కటువుగా మార్చేసుకున్నాడు. కళ్ళల్లో కాఠిన్యం తెచ్చిపెట్టుకున్నాడు.
‘‘ఏమిటీ... కూర్చోవాలా? కూర్చుంటాలే. కూర్చోకేం చేస్తాను? వచ్చిన ప్రతిసారీ నేను కూర్చోవడం... నువ్వూ మీ ఆయనా ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పడం... నేను విని వెళ్లి పోవడం... ఇదేగా జరిగేది. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. రమ్మను వాణ్ణి... ఇంతకీ ఇంట్లో ఉన్నాడా, వీధిలో ఏవైనా రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళాడా? అయినా వాడికి రాచకార్యాలు ఏముంటాయిలే? ఇంట్లోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు. రమ్మను బయటికి’’ అన్నాడు ధుమధుమలాడుతూ.
ఉన్నట్టుండి ఆమె ముఖం మ్లానమవడం గమనించి ఉలిక్కిపడ్డాడు. అది అతను ఊహించని పరిణామం.
‘‘అయ్యయ్యో, అదేంటి తల్లీ... ఆ కన్నీళ్లు ఏంటి? ఏడుస్తున్నావా? ఇప్పుడు నిన్నేమన్నానని? నాకు రావాల్సిన బాకీ డబ్బులు ఇమ్మని అడిగాను అంతేగా? అయినా నిన్నడగడం నాదే తప్పు. నిన్నెందుకు అడగాలి? రానీయ్‌, వాణ్ణి అడుగుతాను. ఇందులో నీ ప్రమేయమేముంది పాపం?’’
తన నోటినుండి గబుక్కున ఆ మాటలు జారి బయటికి వచ్చేశాక నాలుక కరుచుకున్నాడు. ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే జరిగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెత్తబడకూడదని వచ్చేముందు అతను తీసుకున్న నిర్ణయం ఇట్టే గాలికెగిరిపోయింది.
ఆ పొరపాటుని కొంచెమైనా సరిదిద్దుకోవాలని తిరిగి కఠినత్వం గొంతులోకి తెచ్చుకుని అన్నాడు. ‘‘అయినా... ఇచ్చిన డబ్బు తీర్చమంటేనే నీకంత దుఃఖం వస్తే... మరి... ఒకటా రెండా... పది లక్షలు! మీ చేతుల్లో పెట్టి చెప్పులరిగిపోయేలా తిరుగుతున్నానే, నాకెంత ఏడుపు రావాలమ్మా?’’ ఆమెలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. ఇంకా మ్లానమైన ముఖంతోనే అలాగే చూస్తుండిపోయింది.
’’స్నేహితుడు కదాని సమయానికి సాయంచేస్తే నాకే ఎసరు పెడతాడా... రానీయ్‌ కడిగేస్తాను. నెల రోజుల్లో నా కూతురి పెళ్లి. కుదరక కుదరక ఇన్నాళ్ళకు కుదిరింది. నిశ్చితార్థం కూడా పెట్టేసుకున్నామురా అంటే విన్నాడా? నాలుగు రోజుల్లో ‘నీ డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాలేరా’ అని నమ్మకంగా చెప్పి తీసుకున్నాడు. ఏది? డబ్బులు పువ్వులో పెట్టి ఇవ్వడం మాట అటుంచి, చెవిలో పూలు మాత్రం పెట్టాడు’’ అన్నాడు ఆమెకి చురుకు తగలాలని.
అతని ప్రయత్నం ఈసారి ఫలించినట్టుంది. ఆమె కళ్ళు మరింత ధారాపాతాలయ్యాయి. అది చూసి అతని గుండె మళ్ళీ కరిగిపోయింది. కానీ అది అతనికి నచ్చడం లేదు. ‘వద్దు... కరగొద్దు... కూతురి పెళ్ళి ఆగిపోయేలా ఉంది... ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడం ఇప్పుడు నీకు అత్యంత అవసరం... కఠినత్వం తెచ్చుకో’ అంటూ బలంగా మనసులోనే అనుకున్నాడు.
ఇక్కడింత జరుగుతున్నా రావలసిన వ్యక్తి ఎంతకీ రానందుకు అతనికి ఒళ్ళు మండిపోతోంది. ‘‘నేను ఇంతలా మాట్లాడుతుంటే వాడింకా రాడేం?
ఏం చేస్తున్నాడు లోపల?’’ అని అడిగాడు రాని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ.
ఆమె ఏం మాట్లాడకుండా లోపలికి వెళుతూండటం గమనించాడు. ‘‘వెళ్ళు, వెళ్ళి వాడిని పంపించు. నిన్ను ఎన్నంటే ఏం లాభంలే పాపం’’ అన్నాడు. కోపమంతా స్నేహితుడి మీద చూపించొచ్చులే అని కొద్దిగా శాంతించాడు. ఒక విధంగా అదే న్యాయం అనిపించిందతనికి.
‘‘చూడమ్మాయ్‌... చూసి చూసి వాడే పోతాడని అనుకుంటాడేమో. వాడు నా ముందుకు వచ్చి అణా పైసల్తో సహా డబ్బు మొత్తం కట్టే వరకు ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలనని చెప్పు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఎంతసేపైనా ఇక్కడే కూర్చుంటాను. నాకు మరో పనేంలేదని కూడా చెప్పు వాడికి’’ అంటూ అరిచి చెప్పాడు లోపలికి వెళుతున్న ఆమె వైపు చూస్తూ. ఆమె లోపలి గదిలోకి వెళ్ళిపోయింది.
దశరథరామయ్య ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి. ‘ఛిఛీ... ఏం లోకమో ఏమో. మంచికి రోజులు లేవు కదా. మానవత్వానికి విలువ అంతకన్నా లేదు. సాయం చేసిన వాళ్ళ నెత్తినే టోపీ పెట్టేద్దామనుకునే పాడు రోజులు వచ్చేశాయి. స్నేహితులూ అంతే, బంధువులూ అంతే. కలికాలం..! ఎవరినీ నమ్మలేకపోతున్నాం’ అలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. అతని దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టింది అతని ప్రాణ స్నేహితుడే మరి!
కాసేపటికి ఆమె వస్తున్న అలికిడి అవడంతో ముఖమంతా గంభీరత్వాన్ని పులుముకున్నాడు. స్నేహితుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. తలతిప్పి చూసిన అతని కనుబొమలు ముడిపడ్డాయి.
ఆమె ఒక్కతే వస్తోంది. మళ్ళీ అదే ఘాతుకం. స్నేహితుడు బయటికి రావడం లేదు. ‘ఏమిటి వీడి ఉద్దేశం?’ అనుకున్నాడు మనసు మండిపోతుండగా.
‘‘ఏంటమ్మా ఇది? లోపలికెళ్ళి పావుగంటకి తిరిగొచ్చావు. తీరాచూస్తే వాడిని తీసుకు రాలేదు’’ అనబోతూ ఆమె చేతివైపు చూశాడు. టీ కప్పు కనిపించింది.
‘‘టీ తీసుకోండి అన్నయ్యా’’ అంది ముక్కు ఎగబీలుస్తూ. టీ కప్పు వైపూ ఆమె ముఖం వైపూ మార్చి మార్చి చూశాడు.
‘‘ఈ మర్యాదలకేం తక్కువ లేదు. అయినా నేను నిన్ను టీ అడిగానా? వాడిని బయటికి తీసుకొచ్చి అప్పు తీర్పించమన్నాను కానీ’’ అన్నాడు కోపంగా.
ఆమె చెంగు నోటికడ్డంగా పెట్టుకుని కుమిలి కుమిలి ఏడవడం ప్రారంభించింది. అది చూసి అతనికి మళ్ళీ గుండె కరిగిపోవడం మొదలైంది.
‘‘ఎందుకమ్మా అలా గుడ్ల నీరు కుక్కుకుంటావు? సరే ఇటివ్వు, తీసుకుంటాలే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో... టీ ఇచ్చినా, టిఫిన్‌ పెట్టినా నేను మాత్రం మెత్తబడేది లేదు. నా అప్పు తీర్చకుండా ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని ఖరాఖండిగా చెప్పేశాడు. మెత్తబడడం మొదలెడితే మొదటికే మోసం వస్తుందన్న భయం అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

‘‘ఇంతకీ వాడు రాడేం... నిద్రపోతున్నాడా, నీరసం నటిస్తున్నాడా? నేనొచ్చానని చెప్పావా లేదా?’’ అన్నాడు కరుకుగా. దివిటీ పెట్టి వెదికినా తనలో మంచితనమనేది వీసమెత్తయినా కనిపించకూడదని ఆమె అనుకోవాలి- అది అతని తాపత్రయం. అందుకే గదమాయించినట్టు చెప్పాడు ఆ మాటని.
టీ తాగడం పూర్తి అయింది.
‘‘ఇదిగోమ్మా టీ కప్పు... తీసుకో. తీసుకెళ్ళి వాడిని పిలుచుకురా. పో, ముందా కళ్ళు తుడుచుకోమ్మా. పోయి తొందరగా పిలుచుకురా వాణ్ణి’’ అని తొందరపెట్టాడు. మంచితనమన్నా, హృదయం కరిగిపోవడమన్నా ఎక్కడలేని భయం అతనికి. ఈ రోజుల్లో ఉండకూడనివీ, ఉంటే నిలువునా ముంచేసేవి అవేగా మరి! ఖాళీ కప్పు తీసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
ఆడవాళ్ళ మనస్తత్వం మీద అతనికో ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. ‘మాట్లాడితే చాలు... కుళాయి విప్పేస్తారు. కఠినంగా అడుగుదామనుకున్న నోటికి టక్కున తాళం పడిపోతుంది. బహుశా తన స్నేహితుడు ఆడుతున్న నాటకం కూడా అదేనేమో- అన్న అనుమానం వచ్చింది. అందుకే వాడు లోపల దాక్కుని భార్యని మాత్రమే బయటికి పంపిస్తున్నాడేమో... ఏమో ఎవరికి తెలుసు?’ అనుకున్నాడు.
‘అయినా తన దగ్గరా వీడి నాటకాలు? లోపలికి వెళ్ళిందిగా... ఈసారి పిలుచుకొస్తుందేమోలే’ అని సమాధానపడ్డాడు.
ఈ రోజు ఎలాగైనా వాడిని నిలదీయాలి. అమీ తుమీ తేల్చేసుకోవాలి, చెడమడా కడిగేయాలి- అది అతని దృఢ సంకల్పం.
‘అయినా నా పిచ్చి కానీ, ఏం చేయాలన్నా ముందు వాడు బయటికి రావాలి కదా?’ అనుకున్నాడు నిరాశగా.
ఏదో చప్పుడైతే చివుక్కున తల తిప్పి చూశాడు. ఈసారి కూడా ఆమె ఒక్కత్తే రావడం గమనించాడు. స్నేహితుడు వెనకాల వస్తున్నాడేమో అని చూశాడు. ఊహు. ఎవరూ రావడం లేదు. అయితే ఈసారి ఆమె చేతిలో ఒక పెద్ద ఫొటో ఫ్రేమ్‌ ఉంది.
అది చూసి అయోమయంలో పడిపోయాడు. ‘‘అదేంటి తల్లీ, వాణ్ణి పిలుచుకు రమ్మంటే వాడి ఫొటో తెస్తున్నావేమిటి? అదేంటి, ఆ ఫొటోకి దండేమిటి?’’ అని అడిగాడు. అంతే! అతనా మాట అన్నాడో లేదో ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షించడం మొదలెట్టాయి.
కంగారుపడిపోయాడు దశరథరామయ్య.
‘‘అరెరే, అలా కుమిలిపోతున్నావేమిటమ్మా? అంటే... వాడు..?’’ అన్నాడు నోటమాట రానట్టు. అతనికి విషయం స్పష్టంగా అర్థమైంది. హతాశుడై చూశాడు. ‘‘అయ్యో, నాకు తెలీదే... ఎప్పుడు జరిగిందమ్మా? అయినా నాకు తెలీకుండా ఎలా జరిగిందిది?’’ మాటలు తడబడుతున్నాయి అతనికి.
ఈసారి ఎంత వద్దనుకున్నా అతని గుండె చెరువైపోతోంది. కఠినంగా ఉండాలనీ కరిగిపోకుండా ఉండాలనీ వచ్చే ముందు పెట్టుకున్న నియమాలన్నీ పటాపంచలైపోతున్నాయి.
‘‘అయ్యో భగవంతుడా... ఎంత ఘోరం జరిగిపోయింది? నా ప్రాణ స్నేహితుడు ఇక లేడా? ఇన్నాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. కష్టంలో సుఖంలో చేదోడు వాదోడుగా తిరిగేవాడు. వాడీ భూమ్మీదే లేడా... ఇదేం అన్యాయం? నమ్మశక్యంగా లేదే’’ అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చేశాడు.
ఉన్నట్టుండి అతనికేదో గుర్తొచ్చింది. ఎక్కడో పిడుగు పడిన భావన. ఇక్కడ అతని గుండె అదిరింది. కళ్ళల్లో అంతులేని భయం తొంగిచూసింది. ఒకే ప్రశ్న... అతని చెవుల్లో మారుమోగుతోంది. ‘అతను చనిపోతే... తన అప్పెవరు తీరుస్తారు? తన కూతురు పెళ్ళెలా జరుగుతుంది?’ కాళ్ళకింద భూమి గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. కూర్చున్నచోట నేల రెండుగా విడిపోయి అగాధంలోకి జారిపోతున్నట్టుంది.
‘దేవుడా! ఇప్పుడు తనేం చేయాలి? ఎవరు తనకిప్పుడు దిక్కు?’
అంతలోకే ఒక ఘోరమైన అనుమానం అతనిలో తలెత్తింది. రాకూడని అనుమానమే, అయినా వచ్చింది. తప్పు అతనిది కాదు... పరిస్థితి అలాంటిది.
‘‘అవును తల్లీ, వాడు చనిపోతే నాకెందుకు తెలియనివ్వలేదు? అసలు వాడు నిజంగానే చనిపోయాడా లేక అప్పు తీర్చాల్సొస్తుందని ఇలా ఫొటో పంపించి లోపలుండి నాటకాలాడుతున్నాడా...
నిజం చెప్పు’’ అని గద్దించాడు.
అతని అనుమానం నివృత్తి అవ్వాలంటే ఆమె నోరు విప్పాలి. కానీ ఆమె నోరు విప్పడం లేదు. పైగా ఎవరికో ఫోన్‌ చేస్తోంది. అతనిలో అసహనం పెరిగిపోయింది.
‘‘అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎవరికి ఫోన్‌ చేస్తున్నావ్‌?’’ అని అడిగాడు. ‘ఒకవేళ నాటకం బయట పడిపోయిందని భర్తకి ఫోన్‌ చేసి చెబుతోందా’ అన్న అనుమానం కలిగిందతనికి.
‘‘ఓహో... వాడు బయట ఉన్నాడా... ఫోన్‌ చెయ్యమ్మా, చేసి నాకు ఇవ్వు... నేను మాట్లాడుతాను. వెధవ ఆఖరికి ఇలాంటి సిగ్గుమాలిన నాటకాలకి కూడా సిద్ధపడిపోయాడన్నమాట’’ స్వగతంలో అనుకున్నాననుకున్నాడు కానీ అతనికి తెలీదు ఆ మాట బయటికే వచ్చేసిందని.
అవతలి నంబరు కలవగానే ఆమె ఫోన్‌ అతని చేతికి అందించింది. అందుకుని ‘హలో... ఏమిట్రా నీ నాటకాలు’ అని అడగబోయి టక్కున ఆగిపోయాడు. అవతలి వైపు కంఠంలో ఏదో తేడా గమనించాడు. అతని కనుబొమలు ముడుచుకున్నాయి.
‘‘ఎవరూ? హలో... హలో హలో... ఎవరు? సత్యవతీ నువ్వా?’’ అంటూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టేశాడు. సత్యవతి అంటే అతని భార్యే. ఆమె లైన్లోకి ఎందుకు వచ్చిందో అతనికి అర్థంకాలేదు.
‘‘సత్యవతీ, నేను వాడికి ఫోన్‌ చేయమంటే ఈవిడ నీకు ఫోన్‌ చేసినట్టుంది...’’

‘‘ఏమిటి, ఇంటికి వచ్చేయమంటావా? వచ్చేస్తాలే. నేను వీడింటికి మన అప్పు రాబట్టుకోవడానికి వచ్చాను. పైసలు చేతిలో పడగానే వచ్చేస్తాలే. నువ్వేం కంగారుపడకు’’ అని ధైర్యం చెప్పాడు ఫోన్‌లో ఉన్న భార్యకి. ‘‘ఏమిటీ? తర్వాత తీరుస్తాడు, ముందు నన్ను వచ్చేయమంటావా? భలే దానివే. ఆఖరికి నువ్వు కూడా వాడికే వంత పాడుతున్నావన్నమాట. వాడిక్కడ ఎలాంటి నాటకాలాడుతున్నాడో నీకు తెలీదు. తెలిస్తే నువ్విలా మాట్లాడవు. అయినా నాకు తెలీకడుగుతాను... కూతురు పెళ్ళి బాధ్యత నా ఒక్కడిదేనా, నీకు లేదా? నెల రోజుల్లో పెళ్లి... డబ్బు సర్దుబాటు కాకపోతే పెళ్ళెలా చేద్దామనుకుంటున్నావ్‌? నువ్వు ఎన్నైనా చెప్పు. నేను వీడొచ్చే వరకూ ఇక్కడే ఉంటాను. డబ్బు తీసుకునే ఇంటికి వస్తాను. నన్ను మాత్రం తొందర పెట్టొద్దు’’ అని చెప్పేశాడు. కృత నిశ్చయం ఎంతైనా అవసరం ఇప్పుడు. ఇచ్చిన అప్పు రాబట్టుకోవాలంటే... కూతురు పెళ్ళి సజావుగా సాగాలంటే... ఆ మాత్రం కృత నిశ్చయం ఉండాల్సిందే..!
‘‘... ...’’
ఫోన్‌లో భార్య చెప్పిన మాట విని అతని మొహంలో నీలిరంగులు అలుముకున్నాయి. అతని మెదడు మొద్దుబారిపోయినట్టు శిలాప్రతిమలా అయిపోయాడు.
అతనికింకా నమ్మకం కలగడం లేదు.
‘‘ఏమిటీ, ఏమిటి నువ్వనేది? ఛ ఛ, నోర్మూసుకో. ఏమిటా పాడు మాటలు... నీకేమైనా మతి పోయిందా? మనమ్మాయి చనిపోవడం ఏంటి? ఏమిటి, రెండు నెలల కిందటే చనిపోయిందా, పెళ్ళి తప్పిపోయిందని ఉరేసుకుందా? రామ రామ...
ఏం మాటలే అవి’’ పైకి గంభీరంగా అడిగాననుకున్నాడు కానీ అతని గుండెల్లో కూడా ఏవో రైళ్ళు పరిగెడుతున్నట్టు అతని ముఖ కవళికలే చెప్తున్నాయి.
‘‘అవునా... నిజమా? మరి నాకెందుకు చెప్పలేదు? నేనేమైనా చచ్చాననుకున్నారా ఇన్నాళ్ళు? ఇంత ఘోరం జరిగితే నాకెందుకు చెప్పలేదు?’’ గొంతు పూడుకుపోతుండగా ముద్దముద్దగా అడిగాడు.
‘‘నీ మొహం. చెప్తే నేనెందుకు మర్చిపోతానే? నాకేమైనా మతిమరుపు జబ్బనుకున్నావా?’’ అని అడిగాడు.
అప్పటికీ విషయం అర్థం కాలేదతనికి.
‘‘ఏమిటి..? నిజమేనా..? అయ్యో భగవంతుడా... ఆఖరికి ఇలా అయిపోయిందా నా బతుకు?’’ అని కుప్పకూలిపోబోయి బలవంతాన నిలదొక్కుకున్నాడు.
‘‘... ...’’
అవతల ఫోన్లో అతని భార్య ఇంకా ఏదో చెప్తూనే ఉంది. ‘‘సరేలే, అలాగేలే. వచ్చేస్తాలే. ఇంకా ఇక్కడ నాకేం పని? తిరిగొచ్చేస్తాలే’’ అని చెప్పి నీరసంగా పైకి లేచాడు.
ఎదురుగా నిలుచుని ఉన్న స్నేహితుని భార్య ముఖంలోకి జాలిగా చూశాడు. ఆమె చేతుల్లో స్నేహితుని ఫొటోకి వేయబడిన దండని చూశాడు. ఆమెని ఎలా ఓదార్చాలో తెలీలేదతనికి. తానే అంతకన్నా పెద్ద బాధలో ఉన్నాడు. ఇక ఆమెనేం ఓదార్చగలడు?
అందుకే ఏమి మాట్లాడకుండా ఫోన్‌ ఆమెకి ఇచ్చేసి నిశ్శబ్దంగా ఊరుకుండిపోయాడు. అయినా అతని మనసులో ఏదో సంశయం ఇంకా తొలుస్తూనే ఉంది. అందుకే... కేవలం సందేహ నివృత్తి కోసమే అడిగాడు.
‘‘అమ్మా, ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు... మా ఆవిడ చెప్పేది నిజమేనా? నేను ప్రతిరోజూ వస్తున్నానా ఇక్కడికి? నిన్న కూడా వచ్చి ఇలాగే అడిగానా? నిజం చెప్పవామ్మా?!’’
ఎంతో జాలిగొలిపేలా అడిగేసరికి ఆమెకి ఏడుపు ఆగలేదు. మళ్ళీ వెక్కివెక్కి ఏడ్చేసింది. ఇంకా అలా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ అతని మనసు చెదిరిపోయింది.
‘‘వద్దులేమ్మా, వద్దులే... ఏడవకు.
ఇంకోసారి రానులే’’ అని చెప్పి బయటికి నడిచాడు.
అభయం ఇచ్చాడే కానీ, అతనికి గుర్తుంటుందా రాకుండా ఉండడానికి? పదే పదే... మళ్ళీ అదే... అన్నట్టు... ఏ రోజుకా రోజు కొత్తగా వస్తూనే ఉంటాడు. నిజం తెలుసుకుంటూనే ఉంటాడు. తిరిగి వెళుతూనే ఉంటాడు.
అతనికి ఇది ఎప్పటికీ తెలియని నిజం. తెలిసినా గుర్తుండని వాస్తవం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని