close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/02/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీమా కోసం అమ్మను చంపేశారు

ఆధారాల్లేకుండా దరఖాస్తు చేశారు..

ఇది చంద్రన్నబీమా సిబ్బంది నిర్వాకం

 

ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు ఆదిలక్షుమ్మ.. ఆమె చేతిలో ఉన్న ఫొటోలో ఉన్నది ఆమె భర్త వెంకటరత్నం. ఆయన గతేడాది నవంబరు 14న మృతి చెందగా చంద్రన్న బీమా నగదు కోసం ఈమె కూడా చనిపోయినట్లు వీరి కుమార్తె సృష్టించగా.. పురపాలిక బీమా సిబ్బంది బీమా కోసం ప్రక్రియ మొదలు పెట్టేశారు.

రాజంపేట, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని బతికుండగానే బీమా కోసం చంపేశారు. చంద్రన్న బీమా సొత్తు కోసం తండ్రి కంటే ముందే తల్లి చనిపోయిందని కుమార్తె చెప్పడం.. దానికి ఆధారాల్లేకుండానే బీమా సిబ్బంది దరఖాస్తు చేయడం అంతా జరిగిపోయింది. పింఛను నమోదు కోసం పురపాలిక కార్యాలయానికి వచ్చిన ఆ తల్లి విషయం తెలుసుకుని కుంగిపోయింది. ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. ఈ సంఘటన రాజంపేట పట్టణంలో చోటు చేసుకుంది.

ఇదీ సంగతి..! : రాజంపేట పట్టణంలోని బలిజపల్లికి చెందిన ఆదిలక్షుమ్మ, వెంకటరత్నం దంపతులు. వీరిలో వెంకటరత్నం గతేడాది నవంబరు 14న తిరుపతిలోని వీరి కుమార్తె శాంతకుమారి ఇంట్లో మృతి చెందాడు. ఈయన పేరు చంద్రన్న బీమాలో సభ్యుడు కావటంతో.. ఈ బీమాకి నామినీగా ఉన్న ఆదిలక్షుమ్మ తన తండ్రి కంటే ముందుగానే మృతి చెందిందని పేర్కొంది. నామినీగా తన పేరు నమోదు చేయాలని పురపాలిక చంద్రన్న బీమా సిబ్బందిని కోరినట్లు సమాచారం. దాంతో పురపాలిక బీమా సిబ్బంది వెనుకాముందు ఆలోచించకుండా శాంతకుమారి పేరును ఎక్కించేశారు. బీమా కోసం దరఖాస్తు చేశారు. ఇంతవరకు బాగనే ఉంది. కానీ ఇటీవల బియ్యంపత్రం, పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడానికి పురపాలిక కార్యాలయానికి వచ్చిన ఆదిలక్షుమ్మ తన భర్త చనిపోయాడు. బీమా ఇవ్వాలని కోరింది. వారు భర్త ఆధార్‌ నంబరు నమోదు చేయగానే అసలు విషయం బయటపడింది. చనిపోయిందనుకున్న మహిళ కళ్లముందే ప్రత్యక్షం కావడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది. తాను బతికుండంగానే చనిపోయినట్లు ఎలా నమోదు చేశారు అని ఆమె అడిగే సరికి బీమా సిబ్బందికి చెమటలు పట్టాయి.

జరగాల్సిన ప్రక్రియ ఇదీ..! : సాధారణంగా బీమా కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే చనిపోయిన వ్యక్తుల మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర ఆధారాలు తీసుకోవాలి. ఇది వాస్తవమా కాదా అనే విషయాన్ని స్థానికంగా విచారణ చేసి కనుక్కోవాలి. అప్పుడే బీమా ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ ఇక్కడ చంద్రన్నబీమా కోసం దరఖాస్తు చేసుకున్న శాంతకుమారి తన తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందినట్లు చెప్పడంతో తండ్రి మరణ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. తల్లి మరణించినట్లు ఆధారాలు ఏమీ ఇవ్వలేదు. అలాంటప్పుడు బీమా ప్రక్రియను ఎలా మొదలు పెట్టారో అర్థం కాని పరిస్థితి. చనిపోయిందనుకున్న మహిళ ప్రత్యక్షం కావడంతో బీమా సొమ్ము రాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఎస్పీకి ఫిర్యాదు : తాను బతికుండగానే చనిపోయినట్లు సృష్టించి బీమా కోసం దరఖాస్తు చేయడంపై ఇటీవల స్పందనలో ఎస్పీని కలిసి విన్నవించినట్లు బాధిత మహిళ ఆదిలక్షుమ్మ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తన భర్త వెంకటరత్నం మొదటి ఆధార్‌కార్డులో తక్కువ వయస్సు ఉందని, తరువాత దాన్ని మార్పించుకుని 60 సంవత్సరాలు ఉన్నట్లు మరో ఆధార్‌కార్డును తయారు చేయించుకున్నట్లు తెలిపారు. సాధారణ మరణం చెందిన వ్యక్తి వయస్సు 50-60 సంవత్సరాలు మధ్య ఉంటే చంద్రన్న బీమా కింద రూ.30 వేలు ఇస్తారు. అదే 49 సంవత్సరాల్లోపు ఉంటే రూ.2 లక్షలు ఇస్తారు. తొలుత కొత్త ఆధారుకార్డును బీమా కోసం ఇచ్చి, ఎక్కువ బీమా కోసం తక్కువ వయస్సు ఉన్న పాత ఆధారు కార్డును బీమా కోసం ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

బీమా కోసం చేసుకున్న దరఖాస్తులో నామినీ స్థానంలో భార్య పేరు ఉండాల్సి ఉండగా

ఆమె చనిపోయినట్లు చెప్పి ఆ స్థానంలో కుమార్తె శాంతకుమారి పేరు ఉన్న దృశ్యం

విచారించి చర్యలు తీసుకుంటాం : చంద్రన్నబీమా విషయంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకుంటాం. వెంకటరత్నం మృతి చెందగా నామినీ అయిన ఆయన భార్య ఆదిలక్షుమ్మకు బీమా రావాల్సి ఉండగా ఈ విషయంలో జరిగిన అక్రమాలు చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై పరిశీలిస్తాం.

- రాజశేఖర్‌, పురపాలిక కమిషనర్‌, రాజంపేట


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.