close

తాజా వార్తలు

ఏడడుగులే ఎందుకు?

‘సఖ్యం సాప్తపదీనాం’ అన్నారు పెద్దలు. నవవధూవరుల అనుబంధం ఏడు అడుగులతో ప్రారంభమవుతుందని దీని అర్థం. అనుబంధం అంటే సాంగత్యం, సాన్నిహిత్యం. భార్యభర్తలు కలిసి చేసే అతి సుదీర్ఘ ప్రయాణం ఏడడుగులేనని ఒక ఆధునిక వికటకవి టకాటకా చెప్పేశాడు. అందులో హాస్యమే కాదు సత్యమూ ఉంది. ఏడడుగుల అర్థం, పరమార్థం ఏంటి? ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? మన పెద్దలు ఏం చెబుతున్నారు?
ఏడడుగులలో మొదటిది అభివృద్ధికి, రెండోది బాలవృద్ధికి, మూడోది ధనవృద్ధికి, నాలుగోది సుఖవృద్ధికి, ఐదోది ప్రజాపాలనకి, ఆరోది  దాంపత్యానికి, ఏడోది సంతానవృద్ధికి వేస్తున్నట్టు విజ్ఞులు చెబుతున్నారు. ఆరడుగుల అందగాడయినా, మూడడుగుల వామనుడైనా పెళ్లిలో ఏడడుగులు వేయక తప్పదు. ఇవన్నీ సంపూర్ణ ఆనందకరమైన జీవితానికి అవసరమయినవే కదా! తెల్లవాడికి ఏ సమస్య వచ్చినా ఏదైనా ‘స్టెప్‌’ తీసుకుంటానంటాడు. స్టెప్‌ అంటే అడుగే కదా!
వైవాహిక జీవితంలో ముందడుగు ఏడడుగులు వేయడంతోనే ప్రారంభమవుతుంది. ‘మందగించక ముందుకడుగెయ్‌, వెనకబడితే వెనకేనోయ్‌’ అని మహాకవి గురజాడ అప్పారావు ఉద్భోధించారు. ఏడడుగుల ప్రయాణం మొదలయిన తర్వాత భార్యాభర్తల్లో ఎవరూ వెనకడుగు వేయకూడదు. వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేకుండా సాగాలి. కల్యాణ మంటపంలో బంధుమిత్రుల ఆకాంక్షలు, అభినందనలు, పెద్దల ఆశీస్సులతో ఈ యాత్ర విజయవంతం కావాలి. నవవధూవరుల అన్ని అడుగులకూ స్ఫూర్తి ‘సుసంతాన ప్రాప్తిరస్తు’ అన్న పెద్దల ఆశీర్వచనం ఫలించడమే.
అంకెల్లో దేని ప్రాధాన్యం దానికి ఉన్నా, ఏడు సంఖ్యకు విశేష ప్రాధాన్యముంది. వెంకటేశ్వరస్వామి వెలసిన కొండలు ఎన్ని? ఏడు.. అందుకే ఆయనకి ఏడుకొండలవాడన్న పేరు. భూగోళంలో ఎన్ని ద్వీపాలున్నాయి? ఏడు. సప్తర్షుల అడుగుజాడల్లో నడవడం వల్ల ఆదర్శప్రాయమైన జీవితం అలవాటవుతుంది. సప్త వ్యసనాల సంగతి ఏమిటంటారు? అని అడగవచ్చు. జూదం, మాంసాహారం, మద్యపానం, వేశ్యా సంగమం, వేట, చౌర్యం, పరస్త్రీ వ్యామోహం అనేవి ఆ వ్యసనాలు. వీటిని ఉక్కు ‘పాదాలతో’ అణచివేయాలన్నది పెద్దల సందేశం కూడా కావచ్చు. సకల జగత్తుకు ప్రకాశకారకుడు ఎవరు సూర్యుడు? అతడి రథానికి గుర్రాలు ఎన్ని? ఏడే కదా! ‘సప్తాశ్వరథమారూఢం’ అనే మాట కూడా ఉంది కదా! ఇంద్రధనుస్సులో రంగులు కూడా ఏడే! అంటే జీవితాల్ని ఇంధ్రధనుస్సులా పండించుకోమనే! తరచిచూస్తే కళ, కాలం కూడా ఏడుతో ముడిపడి ఉన్నాయి. సంగీతమంటే సప్తస్వరాలేగా! వారానికి ఏడు రోజులేగా! ప్రపంచంలో ఉన్నవి ఏడుఖండాలేగా! అంతెందుకు ఆడవాళ్లు ఏడువారాల నగలేకదా కోరుకుంటారు. ఇన్ని విశేషాలున్న ఏడుతో అడుగులకు సంబంధం ఉండటం కూడా విశేషమేగా!
సంసార రథానికి భార్యాభర్తలు చక్రాల్లాంటివారు. రెండు చక్రాలూ సమాన వేగంతో పయనించాలి. అదే ఆదర్శ సంసారం. అప్పుడే సంసారంలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మనుషులు తమ జీవితాలను సాఫీగా సాగించుకోవడానికి చక్కటి ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం బాగుండటం అంటే శరీరం ఎటువంటి సమస్యలూ లేకుండా పని చేయడం. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నారు. ధర్మ సాధనకు అన్నింటికన్నా ముందు అవసరమైంది శరీరం కదా అన్నది ఈ మాటలకు అర్థం. శరీరం బాగుండటానికి వ్యాయామం ముఖ్యం. వ్యాయామంలో నడక ప్రధానం. ఏడడుగులు కూడా ఆ వ్యాయామంలో భాగమే కదా! అని కూడా అంటారు. అందువల్ల మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇందుకు దంపతులు ఏడడుగులతో నాంది పలికినట్టవుతుంది. ఆరోగ్య సూత్రాలను అమలుపరుచుకోవడానికి నడుం బిగించినట్టవుతుంది. ఇప్పటివరకు ఎవరి ఏడుపువాళ్లు ఏడ్చారు. ఇకనుంచి కలిసి ‘ఏడ’వండి అన్నదే అందులోని అంతరార్థమని పళ్లికిలించే వాళ్లూ ఉన్నారు.
మన పూర్వీకులు కల్యాణం పేరుతో మంత్రాలు చెప్పినా, ఇంకా ఏవైనా సూత్రాలు వల్లించినా, సూక్తులు చెప్పినా చివరకు వధూవరులను ‘నడిపించినా’ అది సమాజాన్ని ముందుకు నడిపించడం కోసమే. ‘నడవండి.. నడిపించండి’ అన్నదే పెద్దల సందేశం కావచ్చు. శుభం భూయాత్‌!

- శంకర నారాయణ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.