close

తాజా వార్తలు

అడుగడుగునా ఆంక్షలు

  ‘అసెంబ్లీ ముట్టడి’ పిలుపుతో ముందస్తు అరెస్టులు
  ప్రకాశం బ్యారేజీపై రాకపోకల బంద్‌
  144 సెక్షన్‌ విధించిన పోలీసులు
ఈనాడు డిజిటల్‌, అమరావతి

అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ, పలు రాజకీయ పార్టీలు తలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని అడ్డుకునేందుకు పోలీస్‌శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. బెజవాడలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నగరంలో సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకోవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో సూచించారు. నిరసన కార్యక్రమాలు చేసుకునే వారు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజాస్వేచ్ఛకు భంగం కలగకుండా చేసుకోవచ్చని, దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ముఖ్య నేతలకు  సెక్షన్‌ 149 కింద  నోటీసులు జారీ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా నేతలు ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా వారికి ముందుగానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరికొందరు తెదేపా నేతల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కమిషనరేట్‌ పరిధిలో 450 మంది నేతలకు నోటీసులు అందజేయగా.. సోమవారం 40 మందిని ముందస్తుగా గృహ నిర్భంధం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు.. అసెంబ్లీకి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చే ప్రజలతో పాటు.. హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఇతర కార్యాలయాల సిబ్బంది, రహదారులపై వెళ్లే వాహనదారులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రకాశం బ్యారేజీపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు. బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం, వన్‌టౌన్‌ ప్రాంతాల వైపు నుంచి తాడేపల్లి, సీతానగరం నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు సాగించే అన్ని రకాల వాహనాలను మళ్లించనున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీపై పాదచారుల రాకపోకలను నిషేధించారు. వీటిని గమనించి ప్రయాణికులు రాకపోకలు సాగించాలని పోలీసులు కోరారు.

ట్రాఫిక్‌ మళ్లింపులిలా.!
* గొల్లపూడి, కుమ్మరిపాలెం, వన్‌టౌన్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను గొల్లపూడి వద్ద నుంచి సితార సెంటర్‌, సి.వి.ఆర్‌.ఫ్లైఓవర్‌, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్‌ మీదుగా పంజా సెంటర్‌, రైల్వే వెస్ట్‌ బుకింగ్‌, ఆర్టీసీ టెర్మినల్‌, లోబ్రిడ్జి, ప్రకాశంబొమ్మ, పోలీస్‌ కంట్రోల్‌ రూం, బందరు లాకుల మీదుగా 9వ జాతీయ రహదారికి కలుపుతారు. అక్కడ నుంచి వారధి మీదుగా ప్రయాణించాలి. అలాగే భవానీపురం, ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డు, భవతీకాటా, సితార, సి.వి.ఆర్‌.ఫ్లైఓవర్‌ మీదుగా ప్రయాణించాలి.
* ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు బందరు లాకుల మీదుగా 9వ నంబరు జాతీయ రహదారికి చేరుకొని కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణించాలి.
* గుంటూరు, తాడేపల్లి, సీతానగరం వైపు నుంచి వచ్చే వాహనాలు, పాదచారులను ప్రకాశం బ్యారేజీపై నుంచి అనుమతించరు.
* హైదరాబాద్‌ నుంచి వచ్చే లారీలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా ప్రయాణించాలి. అదే విధంగా 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎటువంటి భారీ వాహనాలకు ఇబ్రహీంపట్నం వైపు నుంచి విజయవాడ నగరంలోకి అనుమతి రద్దు చేశారు.
* పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి భవానీపురం వెళ్లే వారు సీతమ్మవారి పాదాలు, వినాయకగుడి, కాళేశ్వరరావు మార్కెట్టు, పంజాసెంటర్‌, వి.జి.చౌక్‌, చిట్టినగర్‌, సితార మీదుగా వెళ్లాలి.
* హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఎటువంటి భారీ వాహనాలకు విజయవాడ నగరంలోకి అనుమతి లేదు.
* మచిలీపట్నం నుంచి చెన్నై వెళ్లే వారు పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు మీదుగా వెళ్లాలి.
* చెన్నై నుంచి మచిలీపట్నం వెళ్లే వారు ఒంగోలు, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా ప్రయాణించాలి.
* గుంటూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే ప్రయాణికులు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిరియాలగూడ, నార్కట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించాలి.
* హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, మిరియాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా ప్రయాణించాలి.
* మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు మచిలీపట్నం, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, విస్సన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా వెళ్లాలి.
* హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం, వైరా, కల్లూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌, పామర్రు మీదుగా ప్రయాణించాలి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.