close

తాజా వార్తలు

వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!

పెళ్లి అయిన మర్నాడో లేదా కొద్దిరోజుల్లోనో వధూవరులతో సత్యనారాయణ వ్రతం చేయించడం మన ఆనవాయితీ. ధనికులయినా, పేదలయినా ఆర్థికస్తోమతతో నిమిత్తం లేకుండా ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు. నిజానికి సత్యనారాయణస్వామి వ్రతమే కాదు.. ఏ వ్రతమైనా, ఏ పూజయినా ఏ ఆచారమైనా ఒక సదుద్దేశంతో ప్రారంభించినవే. వాటి ద్వారా మానవాళికి కొన్ని విలువలు నేర్పాలనుకున్నవే. తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేయాలన్న తపన మన పూర్వీకుల ఆలోచనలలో కనబడుతుంది. ఉదాహరణకు- సత్యనారాయణ వ్రతం విషయంలో ఏ తేడా వచ్చినా తమకు ఏదో అరిష్టం జరుగుతుందనే భయం మనవాళ్లలో కల్పించారు. భగవానుడికి ఆగ్రహం వస్తే జీవితం అల్లకల్లోలం అవుతుందన్న భయమే మనిషిని రుజుమార్గంలో నడిపిస్తుందని నమ్మారు, నమ్మించారు. సత్యనారాయణవ్రత కథల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. కథ అనగానే అందులో నీతి ఏమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. భక్తితో పాటు సత్యదేవుని వ్రతకథ వెనక ఉన్న నీతిని కూడా నవవధూవరులు గ్రహించి దానిని తమ వ్యక్తిగత, భక్తి గతజీవితాల్లోనూ మనసా వాచా కర్మణా పాటించగలిగితే పరస్పరం విశ్వాసం పునాదిగా జరిగే కల్యాణానికి సార్ధకత.
సత్యదేవుడి వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే వ్రతమాచరించిన వారికి కష్టనష్టాలు విచారాలు పోతాయని, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని స్తీలకు సౌభాగ్యం కలుగుతుందని, అన్నిపనుల్లో విజయం సమకూరుతుందని మన నమ్మిక.  వ్రతం తర్వాత పూజా విధానం నిర్వహించిన పురోహితులకు దక్షిణ తాంబూలాలిస్తారు. బంధువులు అందరికీ ప్రసాదవితరణ ఉంటుంది. ఆనక భోజనాల వడ్డింపు. ఇందువల్ల వ్రతం చేసిన వారికి, చూసిన వారికి ఆనందానికి ఆనందం, పుణ్యానికి పుణ్యం కలుగుతాయన్నది విశ్వాసం. ఇక మనకేం ఫర్వాలేదని అన్నింటికీ దేవుడే ఉన్నాడని భరోసా కలుగుతుంది.
అబద్ధాలు ఆడటం, దేవుణ్నే మోసం చేయడం, ఇచ్చిన మాట తప్పడం, మొక్కిన మొక్కును విస్మరించడం వంటి పనులు చేయరాదని బోధిస్తుంది సత్యనారాయణ  వ్రతం!. సత్యం వద, ధర్మం చర అనేవి ఎవరైనా ఆచరించాల్సిన ఆదర్శ జీవన సూత్రాలని నూతన దంపతులకు ఎరుకపరుస్తుంది. ఈ కథల్లో సాధువు, లీలావతి, కళావతి, సాధువు అల్లుడు, చంద్రకేతు మహారాజు వంటి పాత్రల ద్వారా మనుషులు ఎలా తప్పులు చేయకుండా ఉండాలో తెలుస్తుంది. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చెబుతుంది. పశ్చాత్తాపపడడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రేరణకలిగించే ఈ కథలు నిరూపమానం. వ్యక్తిత్వవికాస గ్రంథాలకు మించిన పాత్ర వీటిదనడంలో సందేహంలేదు. అంతేనా? అన్ని వ్రతాల్లాగే సత్యనారాయణస్వామి వ్రతం కూడా శుచినీ, శుభ్రాన్ని అలవరచుకునేట్టు చేస్తుంది. ఈ వ్రతం చేసేవారు రాజయినా, పేదయినా ఒకటే అన్న సర్వమానవ సమానత్వాన్ని రూపుకడుతుంది. ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదని శాసిస్తుంది. సర్వార్థ సిద్ధికి ఆడిన మాట తప్పరాదని, మోసాలకు దూరంగా ఉండాలని, భగవంతుడి ముందు పేదా ధనికా భేదం ఉండదనీ తెలియ చెబుతుంది. తద్వారా సామాజిక కల్యాణానికీ దోహదపడుతుంది. అంచేత ఇవన్నీ ఛాందస సంప్రదాయాలుగా ఎవరూ భావింపనక్కరలేదని పెద్దలు చెబుతున్నారు. మనసుపెట్టి చూస్తే వీటిలోని సకారాత్మక భావనలను అర్థంచేసుకోవచ్చని వారంటున్నారు. అంచేత పావన నవజీవన విధానానికి మార్గదర్శక సూత్రం ఈ వ్రతం అనడంలో సందేహం లేదు.

- శంకరనారాయణ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.