వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: గంభీర్‌
close

తాజా వార్తలు

Updated : 26/02/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: గంభీర్‌

దిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ సొంత పార్టీ నేత కపిల్ మిశ్రాను ఉద్దేశించి అన్నారు. ‘‘ఇక్కడ వ్యక్తులు ఎవరనేది ముఖ్యం కాదు. కపిల్ మిశ్రా లేదా ఇతర పార్టీల వ్యక్తులు ఎవరైనా కావచ్చు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులే సురక్షితంగా లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక్క సారి ఊహించుకోండి’’ అని అన్నారు. ఆదివారం దిల్లీలోని జాఫ్రాబాద్‌లో సమావేశమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మద్దతుదారులను ఉద్దేశించి భాజపా నేత కపిల్ మిశ్రా ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏఏకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దిల్లీ పోలీసులు మూడు రోజుల్లోగా నిరసకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అల్టిమేటం విధించారు.

దీంతో ఆయన వ్యాఖ్యలపై ఆ ప్రాంతంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దానికి కొనసాగింపుగా సోమవారం సీఏఏ వ్యతిరేక, మద్దతు దారుల మధ్య వాగ్వాదం కాస్తా చోటుచేసుకొంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారి ఘర్షణలకు దారి తీసింది. అయితే కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే హింస చెలరేగిందని పలు సంఘాలు ఆరోపించిన నేపథ్యంలో గంభీర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఘర్షణల్లో పోలీస్‌ కానిస్టేబుల్‌తో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సహా ఇతర పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరో పక్క దిల్లీ ప్రజలు సంయమనం పాటించాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని