close

తాజా వార్తలు

చంద్రబాబు అవలీలగా అబద్ధాలు చెప్పారు:జగన్‌

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎంత గౌరవమిచ్చినా ఆయన దుర్వినియోగం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. తన ప్రసంగాన్ని ప్రజలు చూడకుండా ఉండేందుకు దుర్బుద్ధితోనే చంద్రబాబు సభా సమయాన్ని వృథా చేశారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. ఏపీ అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ కేంద్రీకృతం కాకూడదని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందన్నారు. ఈ సందర్భంగా గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో చెప్పిన వీడియోలను సభలో ప్రదర్శించారు. చంద్రబాబు తన ప్రసంగంలో అబద్ధాలు అవలీలగా మాట్లాడారని.. శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పినట్లే చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ఏకపక్షంగా చేయాలనుకున్నది చంద్రబాబు చేశారని ఆరోపించారు. శివరామకృష్ణన్‌ కమిటీ తమ నివేదికలోనే కొత్త రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించిందన్నారు. 

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చేందుకు యత్నించారు

‘‘నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ అని మళ్లించి పచ్చటి పొలాలకు సరిహద్దులు నిర్ణయించి రాబోయే రాజధాని ఇక్కడే అని పేర్కొని రాష్ట్రాన్ని తన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చేందుకు చేయకూడని అన్ని పనులూ చంద్రబాబు చేశారు. రాజధాని ఆయనతో పాటు బినామీలు, మనుషులు కొన్న భూముల కోసమా? ల్యాండ్‌పూలింగ్‌ కోసం రైతులు భూములు ఇవ్వలేకపోతే ఆయా రైతులు గ్రామాల్లో ఉండలేని పరిస్థితి కల్పించారు. 144 సెక్షన్‌పై ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారు. మచిలీపట్నంలో గత నాలుగేళ్లుగా 144 సెక్షన్‌ ఉండటం గుర్తులేదా? 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో భూములున్నీ ఎడాపెడా కొనేశారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కూ కేటాయించారు. ప్రస్తుతం రాజధాని వరద ముప్పు ఉన్న ప్రాంతం. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఎదురెదురుగా ఒక వాహనం ప్రయాణించేందుకు కూడా అవకాశం లేని కరకట్ట మీదుగా రాజధానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఐదేళ్లలో చంద్రబాబు రూ.5వేలకోట్లు మాత్రమే రాజధానికి ఖర్చు చేశారు. రాజధానికి రూ.4 నుంచి రూ.5లక్షల కోట్లు ఖర్చు అవుతుందని గతంలో ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం ఖర్చు లేకుండా అయిపోతుందంటున్నారు’’ అని జగన్‌ విమర్శించారు.

ఈ పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం సాధ్యమేనా?

‘‘రాష్ట్రంలోని పాఠశాలలు, ఆస్పత్రులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పాఠశాలలు, ఆస్పత్రుల మరమ్మతులకు రూ.26వేలకోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వాటర్‌ గ్రిడ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.45వేలకోట్లు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు చెప్పారు. ముందుగా 6 జిల్లాల్లో దాన్ని ప్రారంభించేందుకు రూ.12వేల కోట్లు మంజూరు చేశాం. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.15వేల కోట్లు అవసరం అవుతోంది. పేదల ఇళ్ల స్థలాలు, నిర్మాణాల కోసం రూ.40వేలకోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో పాటు పింఛన్లు, రైతుభరోసా, అమ్మఒడి, పేదలకు నాణ్యమైన బియ్యం తదితర ఎన్నో పథకాలకు నిధులు అవసరం. ఈ పరిస్థితుల్లో రాజధాని పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా? అమరావతి నిర్మాణం చేయాలని ఉంది..కానీ ఈ పరిస్థితుల్లో చేయలగలమా? అని ఆలోచించుకోవాలి’’ వ్యాఖ్యానించారు.

కృష్ణా జిల్లాతో మాకూ అనుబంధముంది

‘‘చంద్రబాబుకు పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ది నిమ్మకూరు.. మా మేనత్తగారిది కూడా ఇదే కృష్ణా జిల్లా మైలవరం. మా కుటుంబానికి కృష్ణా జిల్లాతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు తమ పట్ల అపారమైన ప్రేమ చూపించారు. ఈ రెండు జిల్లాల్లో 33 నియోజకవర్గాలు ఉంటే 29 మంది ఎమ్మెల్యేలు వైకాపా జెండాపై గెలిచారని గర్వంగా చెప్పగలను. రాజకీయాల్లో చిత్తశుద్ధి, నిజాయతీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఏదైనా మంచి చేయలగలం. సంక్షేమ పథకాలు నిలిపివేసి రాజధాని నిర్మాణంపైనే దృష్టిసారించడం సాధ్యమేనా అన్నది ఆలోచించాలి. అమరావతి కచ్చితంగా మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. నాకు ఈ ప్రాంతంపై ద్వేషం ఉంటే అసెంబ్లీని ఇక్కడే ఎందుకు కొనసాగిస్తాం?’’ అని జగన్‌ అన్నారు.

అన్ని ప్రాంతాలకు న్యాయం

‘‘అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్లో గతంలో జరిగిన తప్పులు సరి దిద్దుకునేలా న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం. ఈ నిర్ణయం వల్ల అమరావతికి ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో రూ.830కోట్లను ఆదా చేశాం. 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. జలవనరుల శాఖలో రూ.1123 కోట్లు, పంచాయితీ శాఖలో రూ.196 కోట్లు, అన్ని శాఖలలో కలిపి మొత్తం రూ.1892 కోట్లని ఆదా చేశామని’’ జగన్‌ పేర్కొన్నారు. అనంతరం దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, చారిత్రక నేపథ్యంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సభలో సీఎం జగన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదనకు శాసనసభ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు కూడా ఆమోదం పొందింది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.