close

తాజా వార్తలు

Published : 15/06/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ఇంటర్వ్యూకి వెళ్లా!

చిన్న పూరిల్లు. అందులో చీరతో కట్టిన ఊయలలో ఓ చిన్నారి. బిడ్డను మురిపెంగా చూస్తున్న భర్తతో.. ‘పేరు ఏం పెడదామయ్యా?’ అంది భార్య. కాసేపు ఆలోచించి.. ‘శ్రీ ధన్య’ అన్నాడు. ఆ చిన్నారి పెద్దదైంది. అనుకున్నది సాధించింది. ఊహించని లక్ష్యాన్ని అందుకుంది. ఐఏఎస్‌ అయి అందరితో శభాష్‌ అనిపించుకుంటున్న ఆమెను వసుంధర పలకరించింది....

కేరళలోని వాయనాడు సమీపంలో ఉంటుంది పొళుతన గ్రామం. అక్కడే ఉంటారు నిరుపేద దంపతులు కమల, సురేష్‌. వీరి ముగ్గురు సంతానంలో ధన్య ఒకరు. రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ.. ముద్ద నోటికందని పరిస్థితి. దంపతులిద్దరు వెదురుతో బొమ్మ విల్లంబులు తయారుచేసి విక్రయించేవాళ్లు. కూలి పనులకు వెళ్తుండేవాళ్లు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
ఉపకార వేతనంతో చదువు...
ఒక్కో తరగతి పూర్తయ్యేసరికి ధన్య.. చదువుల్లో మేటిగా తయారైంది. పదోతరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అక్కడితో చదువు అపేయమన్నారు ఇంట్లో. ‘ఆ రోజు నాకింకా గుర్తు. ‘ఇంక స్తోమత లేదు చదివింది చాలు’ అంది అమ్మ. నేను బాగా చదువుకుంటాను. మంచి ఉద్యోగం సంపాదించి మీ కష్టాన్ని పంచుకుంటాను అన్నాను. నాకొచ్చే ఉపకార వేతనం ఖర్చులకు సరిపోతుందని చెప్పడంతో ఒప్పుకొన్నారు’ అని గుర్తు చేసుకుంది ధన్య. ఇంటర్‌ తర్వాత డిగ్రీ చేసింది. తర్వాత కాలికట్‌ విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. ‘ఆనాడు ఇంట్లో చెప్పినట్టే ప్రభుత్వోద్యోగం సంపాదించాను. ప్రభుత్వ సంక్షేమ శాఖలో క్లర్క్‌గా జాయిన్‌ అయ్యాను. అయితే వేరే ఊరులో ఉద్యోగం. ఏడాది తర్వాత మా ఊళ్లోని ఆదివాసీ హాస్టల్‌లో వార్డెన్‌గా ఉద్యోగం వచ్చింది. నా సంపాదనంతా నాన్నకే ఇచ్చేదాన్ని’ అంటోంది ధన్య.
ముఖ్యమంత్రి అభినందనలు..
ఇల్లు, హాస్టల్‌.. ఇలా సాగిపోతోంది ధన్య జీవితం. అనుకోకుండా వాళ్ల ఊరికి ఓ కలెక్టర్‌ వచ్చారు. ఆయన్ను చూశాక ఎలాగైనా కలెక్టర్‌ కావాలనుకుందామె. కానీ, సివిల్స్‌ శిక్షణకు తగ్గ ఆర్థిక వనరులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదామెకు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ సాంబశివరావు.. ముందుకొచ్చారు. ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చారు. ధన్యను తిరువనంతపురంలోని శిక్షణ సంస్థలో చేర్పించారు. ఆయన ప్రోత్సాహంతో సివిల్స్‌ రాసింది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా పట్టు వదల్లేదు. రెండోసారి జాతీయస్థాయిలో 410 ర్యాంకు సాధించింది. ‘నా జీవితంలో మరచిపోలేని క్షణాలవి. మా కురిచియా తెగలో ఐఏఎస్‌ సాధించిన తొలి మహిళను నేనే అని తెలిసి గర్వంగా అనిపించింది. ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ నన్ను పిలిపించి అభినందించారు. ప్రస్తుతం కోజికోడ్‌ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. మరో విషయం మా గురువు సాంబశివరావు సారే ఇక్కడ కలెక్టర్‌. ఆయన దగ్గరే అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటోంది ధన్య. విధుల్లోనూ తన ముద్ర వేస్తోందామె. కుటుంబ బాధ్యతలను ఆనందంగా పంచుకుంటోంది.


సివిల్స్‌ పరీక్షల ఫలితాలు వచ్చాక.. ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. స్నేహితులంతా డబ్బులు పోగేసి నలభైవేల రూపాయలు చేతిలో పెట్టారు. వాళ్లే ముందుకు రాకపోయుంటే ఏమయ్యేదో! ఈ ప్రయాణంలో నాకు బాసటగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ప్రతి విజయం పదిమందికీ స్ఫూర్తినిస్తుందంటారు. అలా నా గెలుపు.. నలుగురిని ముందుకు నడిపించినా నా జన్మ ధన్యమైనట్టే.


 


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని