బిడ్డలు వద్దనుకొని... అమ్మ కావాలని
close

తాజా వార్తలు

Published : 14/06/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిడ్డలు వద్దనుకొని... అమ్మ కావాలని

ఇల్లాలైన ఏ ఇంతైనా.. వీలైనంత త్వరగా తల్లి అవ్వాలని కోరుకుంటుంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని గుళ్లు తిరుగుతుంది, ముడుపులు కడుతుంది. దిల్లీకి చెందిన కవిత బిడ్డలు వద్దనుకుంది. మనసున్న అమ్మ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టితల్లికి దేవుడిచ్చిన తల్లయింది...

మూడేళ్ల కిందటి ముచ్చట... దిల్లీ నుంచి బయల్దేరారు కవిత, హిమాన్షు దంపతులు. భోపాల్‌ వెళ్తున్నారు. ఓ పసిపాపను దత్తత తీసుకోవడానికే ఈ ప్రయాణం. వీరికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పలేదు. అయినా.. దత్తత తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. రైలు కన్నా వేగంగా వెళ్లిపోతోంది కవిత మనసు.

దిల్లీలో ఉంటారు కవిత, హిమాన్షు. విద్యాధికులు. ఆయనేమో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కవిత ప్రీస్కూల్‌ టీచర్‌గా పనిచేసేది. కొన్నేళ్లు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. మంచి సంపాదన, అన్యోన్య దాంపత్యం. కవిత కడుపున ఓ కాయ కాస్తే.. చాలనుకున్నారు ఇంట్లో పెద్దలు. కానీ, కవిత, హిమాన్షు పిల్లలు వద్దనుకున్నారు. అదే సమయంలో ఓ అందమైన బిడ్డ కావాలనుకున్నారు. అదీ మానసికంగా ఎదుగుదల లేని చిన్నారి అయితే బాగుంటుందని భావించారు. కడుపున పుట్టే పిల్లలను వద్దనుకున్న ఈ దంపతులు.. డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడే చిన్నారిని దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ ఆలోచనే ఇంట్లో కలకలం రేపింది. అయినా పట్టువీడలేదు. వారి నిర్ణయం మార్చుకోలేదు.

అమెరికాలో ఉన్నప్పుడే దత్తత ప్రయత్నాలు మొదలుపెట్టారు కవిత దంపతులు. సీఏఆర్‌ఏ (సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ)ని సంప్రదించారు. అమెరికాలో ఉన్నందున.. భారత్‌లో దత్తత తీసుకునే వీల్లేదన్నారు అధికారులు. కోరుకున్న బిడ్డ కోసం.. డాలర్లు విడిచిపెట్టారు. అమెరికా వదిలి ఇండియాకు వచ్చేశారు. మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలారోజుల అన్వేషణ తర్వాత 2017 మే నెలలో తమ జీవితంలో వసంతాన్ని వెతుక్కుంటూ దిల్లీ నుంచి భోపాల్‌కు ప్రయాణమయ్యారు.

భోపాల్‌లో కిల్‌కారీ చైల్డ్‌ హోమ్‌లోకి అడుగుపెట్టారు కవిత, హిమాన్షు. జాలి చూపులు చూస్తూ ఓ పదహారు నెలల బుజ్జాయి. మేని ఛాయ బంగారం. కవిత కళ్లలో నుంచి టపటపా నీళ్లు రాలాయి. జన్మనివ్వక పోయినా.. ఆ చిట్టితల్లిని చూడగానే పేగు కదిలినట్టు అనిపించింది ఆమెకు. అమాంతం ఒళ్లోకి తీసుకొని లాలనగా ముద్దిచ్చింది. ఏ జన్మ బంధం గుర్తొచ్చిందో.. చిన్నగా నవ్విందా చిన్నారి. హిమాన్షు ఎత్తుకున్నాడు. తదేకంగా తండ్రి కాని తండ్రిని చూస్తూ ఉండిపోయిందా బుజ్జాయి. గారంగా ఆవలిస్తూ.. గాఢ నిద్రలోకి జారుకుంది. ఇద్దరికీ నమ్మకం కుదిరింది. ‘తను మన దగ్గర జాగ్రత్తగా ఉంటానని నమ్ముతోంద’ని భావించారు. దత్తత కార్యక్రమం పూర్తిచేసుకొని కూతురుతో దిల్లీకి చేరుకున్నారు.

గారాలపట్టికి వేద అని పేరు పెట్టుకున్నారు. పేరుకే దత్తపుత్రిక.. సొంతకూతురు కన్నా ఎక్కువే. మూడేళ్లయింది వారిల్లు వేద నిలయంగా మారి. కన్నబిడ్డలు వద్దనుకున్న నిర్ణయానికే ఇంకా కట్టుబడి ఉన్నారిద్దరు. ఆ అల్లరిపిడుగు చేష్టలన్నీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది కవిత. అనాథలను దత్తత తీసుకోవాలని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అక్కున చేర్చుకుంటే మరీ మంచిదని చెబుతుంటుంది. తల్లిదండ్రుల ఆలనాపాలనతో వేద జీవితం హాయిగా సాగిపోతోంది. ముద్దుల కూతురు తమ దగ్గరికి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. ఆ ముచ్చటను సామాజిక మాధ్యమాలతో పంచుకున్నారు. కవిత, హిమాన్షు గొప్ప మనసును ఎందరో మెచ్చుకుంటున్నారు. ‘మీరు ఎందరికో ఆదర్శమ’ని కితాబిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని