
తాజా వార్తలు
తగిన శాస్తి
కోకిల, చిలుక ఒక చెట్టుపై గూళ్లు కట్టుకుని ఉండేవి. సరదాగా మాట్లాడుకుంటూ కాలం గడిపేవి. కోకిల బయటికి చిలుకతో స్నేహంగానే ఉన్నా అది అందంగా ఉందని లోలోపల మాత్రం అసూయ పడేది.
ఓ రోజు కోకిలకు వేటగాడు కనిపించాడు. చిలుకను వదిలించుకోవడానికి ఇదే అదును అనుకుని వేటగాడి దగ్గరకు వెళ్లి... ‘అదిగో ఆ జామ చెట్టు దగ్గరకు వస్తే నీ వలలో ఓ చిలుక పడేలా చేస్తా. అయితే దానితో పాటు నేనూ చిక్కుకుంటే నన్ను మాత్రం వదిలేయాలి’ అంది.
వేటగాడు సరే అన్నాడు.
వెంటనే కోకిల చిలుక దగ్గరకు వెళ్లింది. ‘మిత్రమా! అక్కడో జామ చెట్టు ఉంది. దాని పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. నీకూ వాటి రుచి చూపిద్దామనుకుంటున్నా.’ అంది కోకిల.
చిలుకకు నోరూరింది. ‘పద పద..’ అంటూ కోకిలతో పాటు వెళ్లింది. కొద్దిసేపటికే వేటగాడు వేసిన వలలో రెండూ చిక్కుకున్నాయి.
చిలుక బాధపడుతూ వేట గాడితో ఇలా అంది. ‘నా మిత్రురాలు కోకిల నాకు సాయం చేయబోయి వలలో చిక్కుకుంది. దయచేసి దాన్ని విడిచిపెట్టు’ అంటూ ప్రాధేయపడింది.
ఎలాగూ కాసేపట్లో అదే చేస్తాడు అనుకుంటూ కోకిల లోలోపల నవ్వుకుంది.
వేటగాడు చిలుక మంచితనం చూసి ఆశ్చర్యపోయాడు. తన ప్రాణాల కన్నా మిత్రురాలి ప్రాణాలు కాపాడమని కోరుతున్న చిలుక గొప్ప మనసుకు కరిగిపోయాడు. చిలుకను విడిచిపెట్టేశాడు. స్నేహితురాలిని చంపాలనుకున్న కోకిలను మాత్రం తీసుకుని వెళ్లిపోయాడు.