close

తాజా వార్తలు

Updated : 01/06/2020 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ - 9 AM

1. తొలి కూత తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌దే

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలలకు పైగా ఆగిన రెగ్యులర్‌ రైళ్ల ప్రయాణం మళ్లీ మొదలయ్యాయి. ‘రాజధాని’యేతర ప్రత్యేక రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కుతున్నాయి. తొలిరోజు దేశవ్యాప్తంగా 200 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 1.45 లక్షల మంది ప్రయాణిస్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎనిమిది రైళ్లు బయలుదేరనుండగా, తొలి కూత హైదరాబాద్‌-న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌దే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

2. మిడతలపై ఆందోళన వద్దు

‘తెలంగాణ రాష్ట్రంలో పంట కోతలు దాదాపు పూర్తయ్యాయి. పండ్లు, కూరగాయల పంటలు అక్కడక్కడ ఉన్నాయి. మన రాష్ట్రంలోకి మిడతలు వస్తాయనుకోవడం లేదు. గాలి పయనం మనవైపు లేదు. వాతావరణంలో భారీ మార్పులొస్తే తప్ప అవి మన రాష్ట్రంలోకి రాకపోవచ్చు. ఆందోళన అవసరం లేదు. శాస్త్రవేత్తల సాయంతో వాటి నియంత్రణకు సన్నద్ధంగా ఉన్నాం. పిచికారీకి రసాయనాలు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి’ అని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీ సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయి

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో రావాలనుకునే ప్రయాణికులు స్పందన పోర్టల్‌ ద్వారా కచ్చితంగా ఈ పాస్‌ తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అంతర్‌రాష్ట్ర వాహనాల రాకపోకలపై ఏపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఇంటర్‌లో కీలక మార్పులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇందులో అనేక సంస్కరణలను ఏపీ ఇంటర్‌ విద్యామండలి తీసుకొస్తోంది. వచ్చే ఏడాది ప్రశ్నపత్రాల విధానాన్ని మార్చి.. సీబీఎస్‌ఈ తరహాలో తీసుకురావాలని భావిస్తోంది. ప్రశ్నల సంఖ్యను పెంచి, మార్కులను తగ్గిస్తారు. కళాశాలల పనివేళలు మార్చారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 వరకు తరగతులు, మరో గంటపాటు క్రీడలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఉపాధి వేతనం అంతంతే

లాక్‌డౌన్‌ వేళ ఉపాధి హామీ పథకం వరంగా పరిణమిస్తున్నా కనీస వేతనం దక్కక కూలీలు ఆవేదన చెందుతున్నారు. పైగా సొమ్ముల పంపిణీలో జాప్యం వారిని ఇబ్బంది పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద నమోదైన తాజా గణాంకాల ప్రకారం ఈ పథకం కింద 23.74 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రోజుకు గరిష్ఠ వేతనం రూ.237గా నిర్దేశించగా రాష్ట్రంలో కూలీలకు అందుతున్న సగటువేతనం రూ.163 మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఏడాదిలో విద్యుత్తు బిల్లు లక్ష చెల్లించారా?

మీరు గత ఆర్థిక సంవత్సరం (2019-20) మొత్తంమీద రూ.లక్ష, అంతకంటే ఎక్కువ విద్యుత్తు బిల్లులు చెల్లించారా.. మీ బ్యాంకు కరెంటు ఖాతాలో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్లు చేశారా.. అయితే కచ్చితంగా ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్‌)లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త ఐటీఆర్‌ పత్రాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆన్‌లైన్‌ రమ్మీ కమ్మేస్తోంది

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడండి..గంటలో వేలు..రోజులో లక్షలు గెలుచుకోండి అంటూ ఆకర్షణీయ ప్రకటనలతో ఊరిస్తారు. సరదాకో, కాలక్షేపానికో ఆట మొదలెడితే కొత్తలో వందలు, వేలు గెలిచేందుకు అవకాశాలు కల్పించి నెమ్మదిగా ఉచ్చులోకి లాగుతారు. అందులో చిక్కుకుపోయారో జీవితాలు తలకిందులవడం ఖాయం. వీటి బారిన పడి ఏటా వేలమంది సర్వం కోల్పోతున్నారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమవ్వడంతో కొందరు కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌ జూద వేదికలను ఆశ్రయించి కోట్లలో నష్టపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మీడియాకు చెప్పేస్తానని అక్క బెదిరించింది

తాను స్వలింగ సంపర్కురాలినని మీడియాకు వెల్లడించడానికి ముందు ఆ విషయం బయటపెడతానంటూ డబ్బుల కోసం తన అక్క బెదిరించేదని భారత అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ వెల్లడించింది. ఆదివారం ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడిన ద్యుతి.. ‘‘2018 ఆసియా క్రీడల్లో నేను రెండు రజతాలు గెలిచానని ప్రభుత్వం రూ.3 కోట్ల నగదు బహుమతి ఇవ్వడంతో మా అక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. డబ్బులడగడం మొదలెట్టింది. తను చూపించే నరకాన్ని తట్టుకోలేక నేను స్వలింగ సంపర్కురాలినని ప్రకటించా’’అని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కొవిడ్‌ వారియర్లకు ‘టాటా’ ప్రత్యేక ఆఫర్లు

కరోనా విపత్కర వేళ నగరంలో సేవలందిస్తున్న కొవిడ్‌ వారియర్లు.. డాక్టర్లు, పోలీసులు, ఇతర అత్యవసర సేవల్లో ఉన్నవారికి టాటా మోటర్స్‌ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈమేరకు తమ వద్ద కొనుగోలు చేసే అన్ని ఎస్‌యూవీ వాహనాలు, ఇతర కార్లపై రూ.45 వేలదాకా ప్రత్యేక ఆఫర్లు అందించనున్నట్లు ఆ సంస్థ సౌత్‌ జోనల్‌ మేనేజర్‌ సూరజ్‌ సుబ్బారావు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. దీంతోపాటు ఇతర కొనుగోలుదారులకూ నెలకు రూ.5 వేల ఈఎంఐ నుంచే కీలకమైన టియాగో వాహనాలు పొందొచ్చన్నారు.

10. స్పేస్‌ ‘ఎక్స్‌’లెంట్‌!

మానవసహిత అంతరిక్ష యాత్రల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓ ప్రైవేటు కంపెనీ నిర్మించిన వ్యోమనౌక తొలిసారిగా మానవులను విజయవంతంగా రోదసిలోకి తీసుకెళ్లింది. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి అనుసంధానమై, చరిత్ర సృష్టించింది. దీంతో వాణిజ్య అంతరిక్ష యాత్రలకు లాంఛనంగా తెరలేచినట్లయింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత అమెరికా భూభాగం నుంచి మానవసహిత రోదసి యాత్రలు తిరిగి ప్రారంభమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.