close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 27/05/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తరలి రమ్మంటోంది.. తారాలోకం!

ఇంటర్‌ తర్వాత ఫిల్మ్‌ స్టడీస్‌

సృజనాత్మకతకు నిలువెత్తు వాణిజ్య రూపం సినిమా. ఇప్పుడు టీవీలు, వెబ్‌ సిరీస్‌లు వంటి వేదికలు అదనంగా చేరాయి. అవకాశాలను పెంచాయి. ఆ రంగుల ప్రపంచంలోకి  అడుగుపెట్టాలని.. అందరి అభిమానాన్ని పొందాలని.. ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఎందరో ఎదురుచూస్తుంటారు.  ‘ఒకే ఒక్క చాన్స్‌’ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. ఆ చాన్స్‌ అందాలంటే సహజమైన ఆసక్తితోపాటు నైపుణ్యాలనూ పెంచుకోవాలి. అందుకు కొన్ని కోర్సులు చేయాలి. అవి ఇంటర్మీడియట్‌ అర్హతతో అందుబాటులోఉన్నాయి.
మనదేశంలో కళలకు ఆదరణ ఎక్కువ. అందులోనూ సినిమాలంటే జనాలకు విపరీతమైన అభిమానం. తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేమికుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నైపుణ్యం ఉన్న కళాకారులు ఇక్కడ సులువుగా నిలదొక్కుకోవచ్చు. ఒకప్పుడు సినిమాల్లోనే అవకాశాలు లభించేవి. ఇప్పుడు నటనతోపాటు ఇతర విభాగాల్లో సత్తా చాటుకోడానికి వేదికలు విస్తరించాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెళ్లు పెరిగాయి. సీరియల్స్‌తోపాటు వివిధ వినోద కార్యక్రమాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వెండితెర, బుల్లితెరలకు పోటీగా వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిల్మ్‌స్‌  జనాదరణను పొందుతున్నాయి. దమ్మున్న కంటెంట్‌తో ప్రేక్షకులను మైమరపించే ప్రొడక్షన్‌ సంస్థలు పెరుగుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇలా ఎన్నో సంస్థలు కొత్తవారికీ ఊతమిస్తున్నాయి. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ)కీ ప్రాధాన్యం పెరుగుతోంది.రాణించడానికి పరిచయాలే ఉండాలని లేదు. ప్రతిభ ఉంటే చాలు. టిక్‌ టాక్‌లో మెరిసినా అవకాశాలు రావచ్చు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌...ఇవన్నీ నేటితరం నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేసే ఉచిత వేదికలుగా నిలుస్తున్నాయి. కంటెంట్‌ వైరల్‌ అయ్యిందంటే నిర్మాణ సంస్థలు ఆహ్వానిస్తాయి. సీరియళ్లకు ఆదరణ పెరగడం, వెబ్‌సిరీస్‌లు విస్తరించడం, తక్కువ ధరలో ఇంటర్నెట్‌ సేవలు లభించడం,   అరచేతిలో వీక్షించే సౌలభ్యం...ఇవన్నీ ఫిల్మ్‌ స్టడీస్‌కు సానుకూలాంశాలుగా చెప్పుకోవచ్చు.

నటనే కాదు... మరెన్నో
సినీ ప్రపంచమంటే ఎన్నో విభాగాల సమ్మిళితం. నటులు ఇందులో ఒక భాగం మాత్రమే. డైరెక్షన్‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, ప్రొడ్యూసింగ్‌, సౌండ్‌ రికార్టింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రీ ప్రొడక్షన్‌, పోస్టు ప్రొడక్షన్‌, లైటింగ్‌, మ్యూజిక్‌, వాయిస్‌ డబ్బింగ్‌...ఇలా ఎన్నో విభాగాల సమన్వయంతో రూపొందిన చిత్రాలు ..థియేటర్లు, టీవీలు, మొబైళ్లలో కనువిందు చేస్తున్నాయి. అన్ని విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఉంది. ఇందులో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు ఆసక్తి ప్రకారం నచ్చిన విభాగానికి చెందిన కోర్సులో చేరి తమ ప్రతిభకు మెరుగులద్దుకోవచ్చు.
సర్టిఫికెట్‌.. డిప్లొమా.. డిగ్రీ
ఇంటర్‌ విద్యార్హతతో ఫిల్మ్‌ స్టడీస్‌లో ప్రవేశించవచ్చు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో యూజీ స్థాయిలో కోర్సులు దాదాపు లేవనే చెప్పాలి. ఎక్కువగా ప్రైవేటు సంస్థలు యూజీ చదువులను అందిస్తున్నాయి. సినీ నేపథ్యం ఉన్నవారి ఆధ్వర్యంలోనే ఎక్కువ సంస్థలు నడుస్తున్నాయి. ఫిల్మ్‌ కోర్సులకు దేశంలో ముంబై ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాతి స్థానం హైదరాబాద్‌దే. ఫుల్‌ టైం కోర్సుల్లో చేరినవారికి సినిమాకు చెందిన అన్ని విభాగాలపైనా అవగాహన కల్పిస్తారు. కోర్సు చివరలో లేదా సమాంతరంగా స్పెషలైజేషన్‌పై దృష్టి సారిస్తారు. ఇంటర్‌ విద్యార్హతతో సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. పరీక్ష లేదా నైపుణ్యాన్ని తెలిపే వీడియో పంపడం, ముఖాముఖి మొదలైన వాటి ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. కొన్ని సంస్థలు కోర్సు చివరి దశలో సినిమా, టీవీల్లో అవకాశాలను ఇస్తున్నాయి. వివిధ ప్రొడక్షన్‌ హౌజ్‌లు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కొత్తవారికీ పని కల్పిస్తున్నాయి.

ఎవరికి ఏది?
* నటన: విభిన్న భావాలను ముఖకవళికలూ, శరీర కదలికల ద్వారా ప్రకటించగలిగే నేర్పరితనం ఉన్నవారు యాక్టింగ్‌ కోర్సులపై దృష్టి సారించవచ్చు.నృత్యం, మంచి రూపం అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. బాడీ లాంగ్వేజ్‌, కంఠస్వరం బాగుండాలి.  
* దర్శకత్వం:  సినిమా ఎలా తీయాలో వీరు బ్లూ ప్రింట్‌ రూపొందిస్తారు. షూటింగ్‌ నిరాటంకంగా కొనసాగించి సినిమా/ సీరియల్‌/ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్‌ మార్గదర్శనమే కీలకం.              నిర్వహణ నైపుణ్యం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, నిజమైన నాయకత్వ లక్షణాలు ఉంటేే డైరక్షన్‌పై దృష్టి సారించవచ్చు. సహాయ దర్శకుడుగా చేరి దశలవారీగా ముందుకు సాగవచ్చు.

 

* సౌండ్‌ రికార్డింగ్‌: సన్నివేశాలకు తగిన ధ్వనులను మేళవించినప్పుడే సినిమా నిలబడుతుంది.వీక్షకులు ఆనందించేలా ఇంపుగా శబ్దాలను ఉపయోగించాలి. సందర్భానుసారం హెచ్చుతగ్గులు ప్రయోగించాలి. సాంకేతికతపై పట్టు, శబ్ద ప్రయోగంపై ఆసక్తి ఉన్నవారు సౌండ్‌ రికార్డింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు.
*స్క్రీన్‌ప్లే: సినిమాకు సంబంధించిన అవుట్‌లైన్‌ అంతా ఇందులో ఉంటుంది. దీని ఆధారంగానే వివిధ సన్నివేశాలు అభివృద్ధి చేస్తారు. రచనలో సృజనాత్మకత ఉన్నవారు, కొత్తగా ఆలోచించగలిగేవారు ఈ విభాగాన్ని ఎంచుకోవచ్చు.కథాకథన నైపుణ్యం ఉంటే స్క్రీన్‌ప్లేలోనూ రాణించవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత అసిస్టెంట్‌ రైటర్‌, రైటర్‌గా సేవలు అందించవచ్చు.

*సినిమాటోగ్రఫీ: ఫొటోగ్రఫీ, వీడియోలపై పట్టున్నవారికి ఈ విభాగం సరైనది. కొత్త టెక్నాలజీపై గురి ఉండాలి. సందర్భానికి తగ్గ దృశ్యాలతో ప్రేక్షకులను కట్టి పడేయాలి. చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతానికి తగ్గట్టుగా, సన్నివేశానికి సరిపోయేలా లైటింగ్‌,  విజువల్‌ ఎఫెక్ట్స్‌ తీసుకొచ్చి దృశ్యానికి ప్రాణంపోసేది వీళ్లే. నిరంతర శ్రమతో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌, సినిమాటోగ్రాఫర్‌ హోదాలను అందుకోవచ్చు.

* ఎడిటింగ్‌: షూట్‌ నిడివి నాలుగైదు గంటలు ఉంటుంది. దాన్ని రెండు నుంచి రెండుం బావు, రెండున్నర గంటలకు కుదించాలి. అవసరమైన సన్నివేశాలకు అన్యాయం జరగకుండా, ఉపయోగం లేనివాటిని తెలివిగా తొలగించాలి. ఆరంభం నుంచి శుభం కార్డు వరకు సన్నివేశాల క్రమం దెబ్బతినకుండా, కథనం ఆసక్తిగా రక్తి కట్టించేలా, మంచి ట్విస్టులతో ఒక ప్రవాహంలో వెళ్లే విధంగా చూసుకోవాలి.  జడ్జిమెంట్‌ నైపుణ్యం ఉన్నవారు ఎడిటింగ్‌ ఎంచుకోవచ్చు. సినీ ప్రపంచంలో దశలవారీగా ఎడిటర్‌ స్థాయికి చేరుకోవచ్చు.

ఇవీ సంస్థలు
టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌), విజిలింగ్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ (డబ్ల్యుడబ్ల్యుఐ): ఇవి సంయుక్తంగా ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇంటర్‌ అర్హతతో బీఎస్సీ/బీఏ ఫిల్మ్‌ మేకింగ్‌ (సినిమాటోగ్రఫీ/ డైరెక్షన్‌/ ఎడిటింగ్‌/ ప్రొడ్యూసింగ్‌/ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌/ విఎఫ్‌ఎక్స్‌) స్పెషలైజేషన్లతో కోర్సులు అందిస్తున్నాయిు. ఈ స్పెషలైజేషన్లలో రెండేళ్ల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. బీఏ (స్క్రీన్‌ రైటింగ్‌/ యాక్టింగ్‌) కోర్సుల్లో చేరవచ్చు. యాక్టింగ్‌లో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, స్క్రీన్‌ రైటింగ్‌లో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా చేయవచ్చు. ఆరు నెలల వ్యవధితో వెబ్‌ అండ్‌ టీవీ సిరీస్‌ స్క్రీన్‌ రైటింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు నడుపుతున్నారు. డిప్లొమాల వ్యవధి ఏడాది. ఈ సంస్థలో ప్రవేశాలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్టు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో లభిస్తాయి.
ఏషియన్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, నోయిడా: మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ (సినిమా) కోర్సుతో కలిపి నచ్చిన విభాగంలో డిప్లొమా అందిస్తోంది. యాక్టింగ్‌, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌, పోస్టు ప్రొడక్షన్‌, సౌండ్‌ ఎడిటింగ్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. బీఏ థియేటర్‌ అండ్‌ డ్రామా కోర్సునూ చేయవచ్చు. ఇక్కడ ఏడాది వ్యవధితో డిప్లొమా, మూడు నెలల వ్యవధితో షార్ట్‌ టర్మ్‌ కోర్సులూ ఉన్నాయి.
ముంబై డిజిటల్‌ ఫిల్మ్‌ అకాడమీ: డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, డిజిటల్‌ సినిమాటోగ్రఫీ, యాక్టింగ్‌, డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ అండ్‌ వీడియో ఎడిటింగ్‌, సౌండ్‌ డిజైనింగ్‌ అండ్‌ ఎడిటింగ్‌, ఫొటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే రైటింగ్‌, వాయిస్‌ డబ్బింగ్‌ అండ్‌ యాంకరింగ్‌లో ఏడాది డిప్లొమా, ఆరు నెలల సర్టిఫికెట్‌, మూడు నెలల షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఉన్నాయి.
బుక్‌ మై ఫేస్‌, స్కైవాక్‌ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఫిల్మ్‌ అండ్‌ క్రియేటివ్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌, రోషన్‌ తనేజా స్కూల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌, బెర్రీజాన్‌ యాక్టింగ్‌ స్టూడియో, అనుపమ్‌ ఖేర్‌ యాక్టర్‌ ప్రిపేర్స్‌, ఆర్‌కే ఫిల్మ్‌స్‌ అండ్‌ మీడియా అకాడమీ, ఆర్‌కే బెస్ట్‌ యాక్టింగ్‌ స్కూల్‌, యాక్టర్‌ స్టూడియో ఇండియా తదితరాలు దేశంలో పేరున్న సంస్థలు. వీటిలో సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా; ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణెలను మినిస్ట్రీ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఆధ్వర్యంలో అటానమస్‌ సంస్థలుగా ఏర్పాటు చేశారు. వీటిలో చాలా కోర్సులను పీజీ డిప్లొమా స్థాయిల్లో అందిస్తున్నారు. గ్రాడ్యుయేట్లకు అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రా యూనివర్సిటీ 3 నెలల వ్యవధితో యాక్టింగ్‌లో  సర్టిఫికెట్‌ కోర్సు అందిస్తోంది. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా బ్యాచిలర్స్‌ డిగ్రీలో మీడియా ప్రొడక్షన్‌ కోర్సులు నిర్వహిస్తోంది. రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌ డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్‌ కోర్సులు అందిస్తోంది.  వీటితోపాటు మరికొన్ని సంస్థలు ఫిల్మ్‌ కోర్సుల్లో మెలకువలు నేర్పుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంతోపాటు కొన్ని సంస్థల్లో పీజీ స్థాయి కోర్సులు ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.