close

తాజా వార్తలు

Updated : 24/05/2020 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. తితిదే ఆస్తుల వేలం

అత్యంత ధనవంతుడైన తిరుమల వెంకన్న ఆస్తులను తితిదే అమ్మకానికి పెట్టింది. స్వామివారిపై భక్తి ప్రపత్తులతో దాతలు విరాళాలుగా సమర్పించుకున్న ఆస్తులు ఇప్పుడు ‘నిరర్థకం’ అయిపోయాయంటూ వాటిని అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆస్తుల పర్యవేక్షణ భారంగా మారిందని, వాటిని కాపాడలేక అమ్ముతున్నామన్నది తితిదే వాదన. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులతో పాటు.. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరికొన్నింటినీ అమ్మేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని పలు జిల్లాల్లో 23 చోట్ల ఉన్న ఆస్తుల వేలానికి అధికారులు సిద్ధమయ్యారు. తీరా వీటన్నింటినీ వేలం వేసినా వచ్చే సొమ్ము రూ. 1.54 కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌లో జమచేయాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వెళ్లొస్తాం.. మళ్లొస్తాం

ఒకదాని వెంట ఒకటి... 41 రైళ్లు... ఒక్కో రైలులో గరిష్ఠంగా 1700 మంది దాకా..11 రాష్ట్రాలకు..మొత్తంగా 50-60 వేల మందికి పైగా వలస కార్మికులు తెలంగాణ నుంచి తమ ఊర్లకు సంతోషంగా బయలుదేరారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మళ్లీ వస్తామంటూ వీడ్కోలు తెలిపారు. దీంతో రెండు నెలల వారి నిరీక్షణ... సొంతూరి కల నెరవేరింది.. ‘మీ రైలు టికెట్‌ ఖరారైంది. ఈ రోజే ప్రయాణం’ అంటూ ఫోన్‌కు సందేశం అందగానే ఆనందంతో మూటముల్లె సర్దుకుని అధికారులు ఏర్పాటుచేసిన బస్సులు, ఇతర వాహనాల్లో శనివారం స్టేషన్లకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన, శివారు స్టేషన్లతో పాటు మహబూబ్‌నగర్‌, కాజీపేట నుంచి కూడా ఏర్పాట్లుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వృత్తులు చిత్తు

డొక్కాడాలంటే రెక్కాడాలి. రెక్కాడాలంటే పని దొరకాలి. కరోనా, లాక్‌డౌన్‌ల పుణ్యమాని రెండూ లేకపోవడం బడుగులు, చిరుద్యోగుల వెన్ను విరిచింది. జీవితాలను ఛిద్రం చేసింది. రేపు గడిచేదెలా? అనే ఆలోచించడం అటుంచి ఈ రోజు నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేదెలా? అని దిగులుపడే స్థితికి సగటు మనిషిని దిగజార్చింది. వందలాది మంది సినిమా కార్మికులు, హోటళ్లలో పనిచేసే సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఫంక్షన్‌ హాళ్ల ఉద్యోగులు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. కాదు కాదు..కళ్లముందే ‘చితి’కిపోయిన ఆశలకు..భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి మధ్య నలిగిపోతూ రోజురోజుకూ కుంగిపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దక్షిణాది వైరస్‌లో సింగపూర్‌ మూలాలు

కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొనడంలో సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) పురోగతి సాధించింది. భారత్‌లో సోకిన వైరస్‌ ప్రత్యేకమైనదని గుర్తించిన ఆ సంస్థ.. దక్షిణాదిలో ఎక్కువగా సింగపూర్‌, ఆసియా దేశాల్లోని వైరస్‌ మూలాలు ఉన్నాయని వెల్లడించింది. కొవిడ్‌-19కు సంబంధించి 72 జన్యుక్రమాలను అంతర్జాతీయ డేటాబేస్‌లో తాజాగా పొందుపరిచింది. ఈ సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రాతో ‘ఈనాడు’ ముఖాముఖి జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలపై కేసులా

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసినవారిపై ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్లు ప్రయోగించడం, కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమేనని కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌, ప్రముఖ న్యాయశాస్త్ర ఆచార్యులు డాక్టర్‌ మాడభూషి శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. కులమతాల ప్రాతిపదికన ప్రజల్లో ద్వేషభావాలు రెచ్చగొట్టినా, విభేదాలు, విద్వేషాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టినా, ప్రచారం చేసినా చట్టప్రకారం శిక్షార్హమన్నారు. ఆ పోస్టుల వల్ల విద్వేషాలు చెలరేగి తక్షణం హింసాకాండకు దారితీసే పరిస్థితులు ఉన్నప్పుడే వారిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల ప్రచారం చేసినా ఐపీసీ, ఐటీ సెక్షన్ల ప్రకారం చర్యలు చేపట్టవచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనా టీకా ‘తొలిదశ’ విజయవంతం

కొవిడ్‌-19 కట్టడి కోసం రూపొందుతున్న టీకాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు చైనా అభివృద్ధి చేసిన టీకాను మానవులపై ప్రయోగించినప్పుడు సత్ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’ ప్రచురించింది. ‘ఏడీ5-ఎన్‌కోవ్‌’ అనే ఈ టీకాలో సరికొత్త అడినోవైరస్‌ టైప్‌-5 అనే సూక్ష్మజీవిని వాహకంగా ఉపయోగించారు. దీని ద్వారా కరోనా వైరస్‌లోని కీలకమైన కొమ్ము ప్రొటీన్‌ను మానవ కణాల్లోకి చేరవేశారు. ఫలితంగా ఈ కణాలు స్పైక్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అవి శరీరంలోని లింఫ్‌నోడ్‌ల వద్దకు వెళ్లినప్పుడు అక్కడి రోగనిరోధక వ్యవస్థ..వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీలను వెలువరిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో రెండున్నర నెలలు కీలకం

కరోనా దెబ్బకు కుంగుతున్న సమాజంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రయత్నం జరుగుతోంది. దేశంలో లాక్‌డౌన్‌లను సడలిస్తూ ప్రజా రవాణాను అనుమతిస్తున్నారు. అంటే వైరస్‌ వ్యాప్తికి మరింత అవకాశం ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కేసుల నమోదు తీవ్రత ఎలా ఉంటుంది? వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటి? మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుంది? అనే సందేహాలను దేశంలోని సీనియర్‌ వైరాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్‌ టి.జాకబ్‌ జాన్‌ నివృత్తి చేశారు. రాబోయే రెండున్నర నెలలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. ఈ మేరకు ‘ఈటీవీ-భారత్‌’తో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జియోమార్ట్‌ వచ్చేసింది

రిలయన్స్‌ జియో తన ఇ-కామర్స్‌ పోర్టల్‌ జియోమార్ట్‌ను తీసుకొచ్చింది. నెలల తరబడి పరీక్షించిన అనంతరం వెబ్‌సైట్‌ను వినియోగదార్లకు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఆర్డర్లను తీసుకొంటోంది కూడా. ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్ఠ చిల్లర ధర(ఎమ్‌ఆర్‌పీ)లో కనీసం 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు ఆ పోర్టల్‌ చెబుతోంది. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వ్యవసాయ ఉత్పత్తులను తమతో భాగస్వామ్యం కుదుర్చుకున్న రైతుల నుంచే నేరుగా సేకరిస్తున్నట్లు తెలిపింది. జియోమార్ట్‌ కోసం వాట్సప్‌తో ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసినట్లు జియో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరుస్తాం

దేశవ్యాప్తంగా అన్ని  థియేటర్లు ఒకేసారి తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని తెలుగు సినీపరిశ్రమ నిర్మాతలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు డి.సురేష్‌బాబు, వివేక్‌ కూచిభొట్ల, జెమిని కిరణ్‌, త్రిపురనేని వరప్రసాద్‌, దాము కానూరి, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌మరార్‌, ప్రశాంత్‌, రవి, బాపినీడు, దర్శకుడు తేజ తదితరులతో శనివారం కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా తీవ్రతను బట్టే భవిష్యత్తులో ఉద్దీపనలు

కరోనా వ్యాప్తి, తీవ్రతను బట్టే భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపననిచ్చే ద్రవ్యపరమైన చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్‌బీఐ అధికారిక అంచనాలు వెలువరచిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికే రూ.20.97 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుత సమయంలో కరోనా తీవ్రతపై ఉన్న అస్పష్టత కారణంగా ఆర్థిక వృద్ధిపై ‘వాస్తవ మదింపు’ క్లిష్టమేనని ఆమె అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.