close

తాజా వార్తలు

Published : 09/05/2020 00:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హలో! ఫికర్‌ మత్‌ కరోనా!


వేలల్లో ఫోన్లు..వేళకాని వేళల్లో ఫోన్లు..వేవేల సందేహాలు..వందల్లో అనుమానాలు..అవతల నుంచి ఫోన్‌ చేసిందెవరైనా.. వాటిని రిసీవ్‌ చేసుకుంటున్నది ఆడకూతుళ్లు. అన్నిటికీ సమాధానం ఉంది వారి దగ్గర. అందరి సందేహాలు తీర్చే ఓర్పు, నేర్పు అదనపు బలం వారికి. అసోంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ఆరోగ్య సంస్థ, పిరామల్‌ స్వస్త్య గ్రూప్‌ సంయుక్తంగా హెల్ప్‌లైన్‌ సెంటర్‌ని నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో మనసులో గూడుకట్టుకున్న అనుమానాలను, భయాలను పటాపంచలు చేస్తున్నారు హెల్ప్‌లైన్‌ సిబ్బంది....
కొవిడ్‌ వార్తలు చూస్తూ చూస్తూ.. గువాహటిలో ఉన్న ఓ పెద్దాయన విసుగెత్తిపోయాడు. తనకు ఏమవుతుందోని కంగారుపడ్డాడు. 104 నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో మధ్యాహ్న భోజనానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న రితుపర్ణ హజారికా.. ఆ కాల్‌ ఎత్తింది. ‘హలో మీకు ఏవిధంగా సాయపడగలను?’ అంది. అవతలి పెద్దాయన తన సమస్యలను ఏకరవు పెట్టాడు. అవన్నీ రితుపర్ణ ప్రశాంతంగా వింది. ఆయకు చెప్పాల్సింది నెమ్మదిగా చెప్పింది. కన్నబిడ్డలా ఓదార్చింది. ‘థ్యాంక్యూ తల్లి! ఇప్పుడు మనసు తేలికైంది’ అని ఫోన్‌ పెట్టేశాడా పెద్దాయన. ఆయన స్థిమితపడ్డాక గానీ ఈమె ఎంగిలిపడలేదు. ఇలాంటి ఫోన్లు వస్తూనే ఉన్నాయా హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు. వేలల్లో వస్తున్న కాల్స్‌కు సమాధానం చెప్పడానికి 90 మంది పారామెడికల్‌, ఏఎన్‌ఎమ్‌లు సదా సిద్ధంగా ఉంటున్నారు. అందరూ మహిళలే! షిఫ్ట్‌ల వారీగా 24 గంటలు పనిచేస్తూ.. మాటలతో ధైర్యాన్నిస్తున్నారు.

ఇంటికే మందులు..
అసోంలో మార్చి 31న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆ మరుసటి రోజు కాల్‌సెంటర్‌కు 9000 కాల్స్‌ వచ్చాయి. నెల రోజుల్లో దాదాపు రెండున్నర లక్షల మంది హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. వారి భయాలు, అనుమానాలు చెప్పుకొంటున్నారు. అందరినీ సమాధాన పరుస్తున్నారు వీళ్లు. కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి.. క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అనుకోని సంఘటనలు జరిగినా.. అక్కడి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కిడ్నీ, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఫోన్‌ చేస్తే.. వారికి అవసరమైన మందులను ఇంటికే పంపించేలా ఏర్పాటు చేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారికి ఫోన్‌ చేసి క్షేమసమాచారాలు వాకబు చేస్తున్నారు. పని ఒత్తిడి పెరగడంతో.. వందకుపైగా వలంటీర్లను విధుల్లోకి తీసుకున్నారు. అహర్నిశలు పనిచేస్తున్న ఈ మహిళలకు.. ఆకతాయిల ఫోన్లు కూడా వచ్చిపడుతున్నాయి. ‘కొందరు ఫోన్‌ చేసి.. డీటీహెచ్‌ రీఛార్జీ చేయాలని అడుగుతారు. ఇంకొందరు ఒక్క పాట పాడండని అడుగుతారు. కొందరు వాదనకు దిగుతారు. ఆ క్షణంలో చికాకు పుట్టినా.. ఇలాంటి కాల్స్‌ మనసును తేలికపరుస్తాయ’ని చెబుతారు ఏఎన్‌ఎమ్‌ భార్గవ్‌జ్యోతి. ఈ హెల్ప్‌లైన్‌కి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఎందుకు ఫోన్‌ చేసినా.. వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు ఇక్కడి ఉద్యోగులు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.