close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/04/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంట్లోంచి సేవ.. ఉద్యోగానికి తోవ...

వర్చువల్‌ వాలంటీరింగ్‌

ఛాటింగ్‌లు.. టిక్‌టాక్‌లు.. సినిమాలు... లాక్‌డౌన్‌ వేళ సమయమంతా వీటికేనా?

ట్రెండ్‌ మార్చండి. వర్చువల్‌ వాలంటీరింగ్‌కి సిద్ధంకండి అంటోంది ‘వీ డిడ్‌ ఇట్‌’...

ఇంట్లో ఉంటూనే సాయం చేయడమే టాస్క్‌... బాగా చేసినవాళ్లకు సర్టిఫికెట్లూ ఇస్తున్నారు...

విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, ఉద్యోగ సాధనకు ఇదో మార్గమంటోంది ఆ స్వచ్ఛంద సంస్థ..

లాక్‌డౌన్‌ వేళ చాలామంది సాయానికి ముందుంటున్నారు. తమకు తోచిన రీతిలో ఆపన్నులు, అన్నార్థులను ఆదుకుంటున్నారు. కానీ బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటూనే సేవలందించే మార్గం మేం చూపిస్తాం అంటోంది ‘వీ డిడ్‌ ఇట్‌’ స్వచ్ఛంద సంస్థ. ఆన్‌లైనే అందుకు వేదిక.

ఏం చేయాలి?

ఆసక్తి ఉన్న వారెవరైనా wedidit.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత వీ డిడ్‌ ఇట్‌ ప్రతినిధులు చిన్నపాటి ఇంటర్వ్యూ చేసి మూడు రకాల టాస్క్‌లు ఇస్తారు. మొదటిది మీ ఇంటి చుట్టుపక్కలుండే పక్షులు, పిల్లులు, కుక్కలు, గేదెల్లాంటి మూగ జీవాలకు ఆహారం అందించాలి. నీళ్లు పెట్టాలి. తిండిగింజలు చల్లాలి. రెండోది మనింట్లో ఉండే డెబ్భై ఏళ్లు దాటిన పెద్దవాళ్లను ఇంటర్వ్యూ చేయాలి. వాళ్లు జీవితంలో నేర్చుకున్న పాఠాలు, అనుభవాల్ని రికార్డు చేయాలి. యువత పెద్దవాళ్లతో మాట్లాడటం వల్ల వాళ్లకు గౌరవం ఇచ్చిన భావన కలుగుతుంది. వయోవృద్ధుల విలువైన అనుభవాలను తెలుసుకునే అవకాశం యువతకి దక్కుతుంది. ఈ ఫొటోలు తీసి వీ డిడ్‌ ఇట్‌ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌ పేజీలో ట్యాగ్‌ చేయాలి. తర్వాత ఈ రెండు పనుల వల్ల నేర్చుకున్న అనుభవాల్ని ఒక పేరాగ్రాఫ్‌ రాసి అందరితో పంచుకోవాలి. వీటిని పరిశీలించిన నిర్వాహకులు సర్టిఫికెట్‌ అందజేస్తారు. విదేశాల్లోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు దక్కించుకోవడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి అంటారు బృంద సభ్యుల్లో ఒకరైన రాజమౌనిక. కేవలం సాయం చేయడమే కాదు.. యువతలో నాయకత్వ లక్షణాలు పెంచే ఉద్దేశంతో ఈ రకమైన టాస్క్‌ల రూపకల్పన చేశామంటున్నారు వీ డిడ్‌ ఇట్‌ ప్రతినిధులు. ‘ప్రపంచానికి ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల అవసరం ఎంతో.. అంతకన్నా ఎక్కువగా మానవత్వం ఉన్న మనుషుల అవసరం ఉంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక మనిషి మరొకరికి సాయం చేస్తే అతడు తప్పకుండా నిజమైన నాయకుడిగా ఎదుగుతాడు. ఇలాంటివారినే కంపెనీలు కోరుకుంటాయి. అదే ఉద్దేశంతో మా టాస్క్‌లు రూపొందిస్తున్నాం’ అంటోంది వీ డిడ్‌ ఇట్‌ కార్యకర్త ప్రిమష.

నాయకులు తయారవ్వాలి

‘చాలామందిలో సేవ చేయాలనే కోరిక ఉంటుంది. అందుకు సరైన వేదికే దొరకదు. సాయం చేయడానికి మీరెక్కడికీ వెళ్లాల్సిన పన్లేదు. మీరున్న చోటి నుంచే చేతనైన పని చేయండి అంటే సంతోషంగా ముందుకొస్తారు. దానికి తగ్గట్టే మేం టాస్క్‌లు రూపొందిస్తున్నాం. మనం సాయం చేస్తే లబ్ది పొందేవారు కొందరే ఉంటారు. సాయం చేస్తూ.. తామూ చేయాలనే ఆలోచన వేరొకరిలో రేకెత్తిస్తే, ఒకర్నుంచి మరొకరు స్ఫూర్తి పొందేలా ప్రయత్నిస్తే.. మొత్తం సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో వీ డిడ్‌ ఇట్‌ ప్రారంభించాం. పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నా, ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం వర్చువల్‌ వాలంటీరింగ్‌కే పరిమితమయ్యాం. ఇది ముగియగానే కార్యక్షేత్రంలోకి దిగుతాం. మా అమ్మ స్ఫూర్తితో చిన్నప్పట్నుంచే సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేది. చదువు, ఉద్యోగ తీరికలేమితో ఇన్నాళ్లు ఆచరణలో పెట్టలేకపోయా. స్థిరపడ్డ తర్వాత మిత్రులు అనుపమ, శ్రీనిత, శ్రీకృష్ణ, భర్త శ్రీహర్షలతో కలిసి ఈ సంస్థ ప్రారంభించా’.

- అనూష యార్లగడ్డ, వ్యవస్థాపకురాలు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.