close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/04/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శిక్షణ మీకే... పర్యవేక్షణా మీదే!

ఇంటి నుంచే మెరుగైన అభ్యాసానికి నిపుణుల సూచనలు

రివిజన్‌ పూర్తిచేయాలి.. మాక్‌ టెస్టులు రాయాలి.. సబ్జెక్టు పాఠాలు నేర్చుకోవాలి... ప్రీ రిక్విజిట్‌ టెస్టులు ప్రాక్టీస్‌ చేయాలి.. ఆన్‌లైన్‌ అయినా- ఆఫ్‌ లైన్‌ అయినా.. విద్యార్థుల తపన ఇదే!

వీరందరి కార్యస్థలం ఇప్పుడు ఇల్లే! సొంతింటి నుంచి సాగించే అభ్యాసంలో కొన్ని చిక్కులు లేకపోలేదు. వీటిని అధిగమించి ప్రిపరేషన్‌ ఫలవంతం అయ్యేందుకు ఏయే మెలకువలు పాటించాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

నుకోకుండా వచ్చి విద్యాసంవత్సరాన్ని అస్తవ్యస్తం చేశాయ్‌ సెలవులు! ఇప్పటివరకూ అధ్యాపకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగిన అధ్యయనం ఇకపై సొంత బాధ్యతతో సాగాలంటే.. విద్యార్థులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందే. సరదా కాలక్షేపాలను కుదించుకుని, ఈ కాలాన్ని గరిష్ఠంగా నేర్చుకోవటానికి కేటాయించుకోవాలంటే స్వీయ నియంత్రణ తప్పనిసరి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో సబ్జెక్టులను నేర్చుకోవటానికీ, అసైన్‌మెంట్లను చేయటానికీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో వివిధ వనరులను అందుబాటులోకి తెచ్చాయి. ప్రవేశపరీక్షలు రాయాల్సినవారు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ మెటీరియల్‌ పునశ్చరణ, మాక్‌ టెస్టులు రాయటం నిష్ఠగా కొనసాగించాలి.

‘ఇంట్లో హాయిగా ఆన్‌లైన్‌ పాఠాలు నేర్చుకోవటంలో, చదువుకోవటంలో కష్టమేముంటుంది?’ అనుకుంటున్నారా? నిత్యం విద్యాలయాలకు వెళ్లి తరగతులకు హాజరయ్యే అలవాటున్నవారికి ఇల్లు కదలకుండా క్రమం తప్పకుండా నేర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండటం వల్ల నేర్చుకోవటానికి అవసరమైన ఏకాగ్రత కుదరకపోవచ్ఛు

దృష్టి మళ్లే అవకాశం

కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే ఉండి చదవటం, నేర్చుకోవటం సౌకర్యవంతమే! అలవాటైన వాతావరణం కాబట్టి ఒత్తిడేమీ ఉండదు. మరో కోణంలో చూస్తే.. ఇల్లు ఈ విషయంలో ఎంత అనుకూలమో, అంత అననుకూలంగానూ పరిణమించవచ్ఛు ఏదో చిన్న పని... టీవీ బ్రేకింగ్‌ న్యూస్‌.. ఇంటి సభ్యులమధ్య ఆసక్తికర సంభాషణ.. విద్యార్థుల దృష్టిని మళ్లించే అవకాశముంది. ఆన్‌లైన్‌లోనో, ఆఫ్‌లైన్లో నేర్చుకునే/చదివే అంశంపై పూర్తిగా దృష్టిపెట్టేలోగానే ఏదో ఒక అవాంతరం ఎదురుకావొచ్ఛు ఆ విఘ్నం దాటుకుని, పఠనంలోకి మళ్లీ ప్రవేశించి కుదురుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఏదో ఒక స్వల్పకారణంతో పఠనాన్ని/అభ్యాసాన్ని ‘వాయిదా’ వేసే ప్రమాదం పొంచివుంటుంది!

‘జస్ట్‌..ఓ పావుగంట కునుకేద్దాం’, ‘టీవీ కాసేపు ఏదో అలా చూస్తే రిలాక్స్‌ అవ్వొచ్చు’, ‘సోషల్‌మీడియాలో మనకు లైక్స్‌ ఏమొచ్చాయో చూసొద్దాం’.. ఇలాంటివి పెట్టుకుంటే.. అవి చాలా సందర్భాల్లో అనుకున్న వ్యవధిని దాటిపోతాయి. విలువైన సమయాన్ని ఇట్టే కరిగించేస్తాయి. అందుకే స్వీయ క్రమశిక్షణతో కాస్తంత ప్రణాళిక, నిర్వహణ అమలు చేయగలిగితే ఇంటి నుంచి అభ్యాసం సమర్థంగా, సౌలభ్యంగా కొనసాగించవచ్చు!

యాక్టివ్‌ స్టడీయింగ్‌

ఎప్పుడైనా సరే, పఠనం మొక్కుబడిగా, అనాసక్తికరంగా సాగితే ఫలితం దక్కదు. చదివే ప్రతి అంశమూ స్పష్టంగా మెదడుకెక్కాలి. ఇంటి దగ్గర్నుంచి సాగించే అభ్యాసం ఫలవంతం కావాలంటే యాక్టివ్‌ స్టడీయింగే పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. చదవటానికి ముందూ, మధ్యలో, చదివాకా కొన్ని ప్రశ్నలతో తరచి చూసుకోవడమే యాక్టివ్‌ స్టడీయింగ్‌.

* చదివే ముందు: ఏం నేర్చుకోబోతున్నాను? ఈ సబ్జెక్టు గురించి ఇప్పటికే నాకేం తెలుసు?

* మధ్యలో: ఈ సమాచారం సబ్జెక్టుకు సంబంధించిన స్థూల చిత్రంలో ఎలా అమరిపోతుంది? ఇప్పుడు చదివింది నాకెంత అర్థమయింది? నా సొంత మాటల్లో దీన్ని చెప్పగలనా? ఏమైనా కీలక పదాలు, ముఖ్య భావనలు రాసుకోవాల్సినవి ఉన్నాయా?

* పఠనం పూర్తి చేశాక: ఇప్పటివరకూ ఏం నేర్చుకున్నాను?


సప్త సూత్రాలు

అనుకూల స్థలం

1. ఇంట్లో ప్రశాంతంగా చదువు సాగించటానికి అనుకూలమైన స్థలం ఎంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వీలైనంతవరకూ విశ్రాంతికి ఉపయోగించే బెడ్‌రూమ్‌ను దీనికి ఎంచుకోకపోవటం మేలు. చదువుకునే ప్రదేశం పరిశుభ్రంగా, గాలీ వెలుతురూ వచ్చేదిగా చేసుకోవాలి. అవసరమైన లాప్‌టాప్‌, హెడ్‌ఫోన్స్‌, ఛార్జర్‌, పుస్తకాలూ, పెన్‌, పేపర్లు మొదలైనవి అక్కడే అందుబాటులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు తరచూ అవసరమయ్యే వస్తువులు అక్కడేమీ లేకుండా చూసుకోవాలి.


మూడూ ముఖ్యమే!

2. పఠనం, వ్యాయామం, విశ్రాంతి... ఇవన్నీ ముఖ్యమే. వీటిలో దేనికెంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. అర్థరాత్రి దాకా మెలకువ ఉండటం వల్ల నిద్ర చాలకపోవటం చాలామందిలో కనిపిస్తుంది. రోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోతేనే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని మర్చిపోకూడదు.శారీరక వ్యాయామం మానసికంగా కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా మెరుగ్గా నేర్చుకోవటం సాధ్యమవుతుంది.


చురుగ్గా ఉండే వేళ...

3. రోజు మొత్తంలో మీ మెదడు చురుగ్గా ఏ సమయంలో ఉంటుందో దాన్ని కొత్త విషయాలు నేర్చుకోవటానికీ, పునశ్చరణకూ కేటాయించుకోవాలి. సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులు ఉదయపు వేళల్లోనే సమర్థంగా నేర్చుకోగలుగుతారు. అయితే ఏకధాటిగా చదవటం, విడవకుండా ఆన్‌లైన్‌ పాఠాలు చూడటం కాకుండా.. స్వల్ప విరామాలు ఇవ్వాలి.


ఏది... ఎప్పుడు?

4. ప్రతి వారం/ప్రతి రోజూ ఏం నేర్చుకోవాలి అనే నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోవాలి. ఆ గడువులోగానే దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. మనం సరైన దారిలో వెళ్తున్నదీ లేనిదీ తెలియటానికి ఈ లక్ష్యాలు సహాయం చేస్తాయి. అంతే కాదు- వాటిని చేరుకున్నకొద్దీ ఆ విజయానందం మరింత నేర్చుకునేలా ప్రేరణను అందిస్తుంది.


రివిజన్‌ గ్రూపులు

5. సహాధ్యాయులూ, సీనియర్లతో ఫోన్‌, వాట్సాప్‌ లాంటి సాధనాల ద్వారా అనుసంధానమవ్వటం కొనసాగించవచ్ఛు క్లాస్‌మేట్లు ప్రిపరేషన్‌, అభ్యాసం విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం మంచి ఫలితాన్నిస్తుంది. టెలిగ్రామ్‌, వాట్సాప్‌లలో రివిజన్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఒకరి ప్రతిభనొకరు పరీక్షించుకోవటం లాంటివి చేసుకోవచ్ఛు.


సులువు దారులు

6. ఒక క్లిష్టమైన సబ్జెక్టును చదివి, నోట్సు రాసుకోవటం కంటే సంబంధిత వీడియోలను చూడటం వల్ల తక్కువ సమయంలోనే సులువుగా అవగాహన ఏర్పడుతుంది. సబ్జెక్టును అర్థం చేసుకోవటంలో ఇలాంటి చిట్కాలను ఉపయోగించుకోవచ్ఛు అలాగే నేేర్చుకోవాల్సింది పెద్దదయితే వివిధ టైమ్‌ స్లాట్లుగా విభజించి తగిన విరామాలతో దాన్ని అభ్యసించటం సులభం.


సందేహాలొస్తే..

7. సబ్జెక్టులకు సంబంధించి ఇప్పుడు విద్యార్థులకు ఏవైనా సందేహాలు వస్తే అధ్యాపకులను నేరుగా కలిసే అవకాశం లేదు. వారిని ఫోను/ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా విద్యార్థులు జిజ్ఞాసతో అడిగితే అధ్యాపకులు సంతోషంగా వారికి సహకరిస్తారు. వెబ్‌సైట్ల డిస్కషన్‌ ఫోరమ్స్‌లో సందేహాలు అడిగి తీర్చుకునే మార్గం కానీ పరిశీలించవచ్ఛు.

వీటికి జవాబులు గ్రహిస్తే సరైన దిశలో ప్రిపరేషన్‌ సాగుతున్నదీ లేనిదీ బోధపడుతుంది.

సమయం వృథా కాకుండా గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం చేసుకోటానికి ఈ ఏడు చిట్కాలు ఉపయోగపడతాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.