close

తాజా వార్తలు

Published : 23/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కరోనా అంతానికి ఇది ఆరంభమే

దేశవ్యాప్తంగా ఆదివారం చేపట్టిన 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’.. కరోనాపై పోరులో తొలి అడుగు మాత్రమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లన్నైనా ఐక్యంగా ఎదుర్కోగలమన్న సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు చాటారని ఆయన చెప్పారు. ‘‘ఆదివారం నాటి జనతా కర్ఫ్యూ రాత్రి 9 గంటలతో ముగిసిపోయింది. దీనర్థం.. ఇక మనం వేడుకలు మొదలుపెట్టవచ్చని కాదు. ఈ స్వీయ కర్ఫ్యూ విజయవంతమైందని మనం ఇప్పుడే భావించకూడదు. ఎందుకంటే ఇది కరోనాపై సాగించే సుదీర్ఘ పోరుకు ఆరంభం మాత్రమే’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. దిగ్బంధం ఎందుకు?

ఇప్పుడు ప్రపంచం లాక్‌డౌన్‌ దిశగా వెళుతోంది. సరిహద్దుల్ని మూసేసుకుంటూ ఏ దేశానికాదేశం, ఏ ప్రాంతానికా ప్రాంతం రక్షణాత్మక చర్యలకు దిగుతున్నాయి. అసలు లాక్‌డౌన్‌ అంటే ఏమిటి..? ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జన సంచారాన్ని నియంత్రించడమే లాక్‌డౌన్‌. మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాకుండా.. ‘సామాజిక దూరాన్ని’ పకడ్బందీగా అమలు చేసేందుకు ఒక ప్రాంతాన్నిమూసివేసి, అష్ట దిగ్బంధనం చేయడమే లాక్‌డౌన్‌ లక్ష్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మహా సంగ్రామమే!

చాపకింద నీరులా దేశమంతటా పాకుతున్న కరోనాపై అంతిమ పోరుకు భారత్‌ సిద్ధమైందా? అంతకంతకూ విస్తరిస్తున్న ఈ వైరస్‌ కోరలను పీకేసేందుకు కఠిన నిర్ణయాలను తీసుకోనుందా? ఆదివారం దేశవ్యాప్తంగా సాగిన ‘జనతా కర్ఫ్యూ’ ద్వారా సుదీర్ఘ నిర్బంధానికి రంగం సిద్ధం చేసిందా? ప్రభుత్వ వర్గాల నుంచి దీనికి ‘ఔననే’ సమాధానం వస్తోంది. ఈ నెల 31 వరకూ 144 సెక్షన్‌ తరహా నిషేధాజ్ఞలను విధించి సామాజిక దూరాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేసి, మహమ్మారిని తరిమికొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏపీలో కరోనా రెండో దశ

కరోనా వైరస్‌ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోనే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలిసారి మరో వ్యక్తికి వైరస్‌ సోకింది. దీన్ని రెండోదశగా పేర్కొంటారు. మక్కా, మదీనా సందర్శనకు వెళ్లిన వృద్ధుడు (65) ఈనెల 12న విశాఖపట్నం వచ్చారు. ఈయన కుటుంబంలో ఒక మహిళ (49) కరోనా లక్షణాలతో ఈనెల 20న ఆస్పత్రిలో చేరగా ఆదివారం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా ధ్రువీకరించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఆరుకు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘హోం క్వారంటైన్‌ ముద్ర’తో ప్రయాణం

హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఇద్దరు.. రైల్లో ప్రయాణిస్తుండడంతో అధికారులు దింపేశారు. కాకినాడకు చెందిన ఓ మహిళ దుబాయి నుంచి వచ్చారు. ఆమెకు శంషాబాద్‌ విమానాశ్రయంలో హోం క్వారంటైన్‌ ముద్ర వేసి పంపారు. ఈ నేపథ్యంలో ఆమె సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని భావనగర్‌ నుంచి కాకినాడ వెళుతున్న రైల్లో ఆదివారం ఉదయం 9.30కి ఎక్కారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి నైజీరియాలోని లాగోస్‌ నుంచి ఈ నెల 20న ముంబయికి చేరుకున్నారు. 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని అతడి చేతిపై అక్కడి అధికారులు ‘హోం క్వారంటైన్‌’ ముద్ర వేశారు. అయినా అతడు హైదరాబాద్‌కు వచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కరోనా నిర్బంధాలతో పెరిగిన గాలి నాణ్యత

కరోనాకు అడ్డుకట్ట వేయడానికి అనేక దేశాలు నిర్బంధాన్ని, ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీనివల్ల వైరస్‌ జోరుకు కళ్లెం పడటంతోపాటు మరో ప్రయోజనమూ కలుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. నిర్బంధాలు అమలవుతున్న దేశాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతోందని చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఎన్‌పీఆర్‌, జన గణన వాయిదా!

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న తరుణంలో జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), మొదటి విడత జన గణన వాయిదా పడే అవకాశముంది. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ విషయమై ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గేవరకు ఎన్‌పీఆర్‌, జన గణన మొదలు పెట్టకపోవచ్చని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జాతీయ జనాభా పట్టిక, జన గణన ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జరగాల్సి ఉంది.

8. చౌకలో కరోనా పరీక్ష

కరోనా వైరస్‌ను చౌకలో గుర్తించే ఒక విధానాన్ని దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనివల్ల ఎక్కువ మంది ఈ పరీక్షను చేయించుకోగలుగుతారని వారు చెప్పారు. ప్రస్తుతం ఈ విధానాన్ని పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)లో క్లినికల్‌ నమూనాలపై పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షకు ‘ప్రోబ్‌-ఫ్రీ డిటెక్షన్‌ అసే’ అని పేరు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు చాలవు:డబ్ల్యూహెచ్‌ఓ

అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు వైరస్‌ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడం దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రోహిత్‌ ఫొటో లేదు.. కోపమొచ్చింది!

తాజాగా ఐసీసీ ట్విటర్‌ పేజీలో కింది బ్యాట్స్‌మెన్‌లో ఎవరు పుల్‌షాట్‌ను చాలా బాగా ఆడతారంటూ ఒక పోల్‌ పెట్టి.. వివ్‌ రిచర్డ్స్‌,   రికీ పాంటింగ్‌, హెర్ష్‌లె గిబ్స్‌, విరాట్‌ కోహ్లిల ఫొటోలు ఇచ్చారు. దీనిపై రోహిత్‌ ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇందులో ఒకరు మిస్సయినట్లున్నారే.. అంటూ ట్వీట్‌ చేశాడు. చాలామంది నెటిజన్లు రోహిత్‌కు మద్దతుగా ట్వీట్లు వేశారు. కోహ్లి కన్నా రోహిత్‌ పుల్‌ షాట్‌ బాగా ఆడగలడని.. అతణ్ని విస్మరించి ఐసీసీ తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో ఐసీసీ.. రోహిత్‌ పుల్‌ షాట్లతో కూడిన ఓ వీడియో పెట్టి, ‘ఫెయిర్‌ ప్లే, రోహిత్‌’ అనే వ్యాఖ్యను జోడించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.