close

తాజా వార్తలు

Updated : 21/03/2020 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆదమరిస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయ్‌: ఐరాస

న్యూయర్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కొవిడ్‌-19ను అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో దాదాపు లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కేవలం సంఘీభావం తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని వివిధ దేశాలు కలిసి ముందుకు సాగాలని సూచించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే  దాదాపు 10వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. దీని నుంచి తక్షణమే బయటపడాలంటే ప్రపంచదేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రతిదేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే..ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగాలేని దేశాలను కూడా ఆదుకోవాలని అభిప్రాయపడింది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా జీ20 దేశాలు ముందుండాలని సూచించింది. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు కేవలం తమదేశ పౌరుల ఆరోగ్యాన్ని రక్షించేందుకే పరిమితం కాకూడదని తెలిపింది. ఆఫ్రికాలాంటి పేద దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలపై దృష్టిపెట్టాలని జీ20 దేశాలకు దిశానిర్దేశం చేసింది. అతి త్వరలోనే కరోనా వైరస్‌ వారి దేశాలను కూడా తాకుతుందని, ‘మీరు ఆయా దేశాలకు సాయం చేయకపోతే ఈ వైరస్‌ విపత్తుతో దారుణమైన పర్యవసానాలు ఎదుర్కొంటారు’ అని ఆందోళన వ్యక్తం చేసింది. దీని కారణంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని..ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో చేస్తున్న ప్రయత్నాలను అన్నిదేశాలు పాటించాలని ప్రభుత్వాలను అభ్యర్థించింది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలుతున్న ఆర్థికవ్యవస్థలపై కూడా దృష్టిసారించాలని తెలిపింది. అంతేకాకుండా, అల్ప ఆదాయం పొందే వారిని, చిన్న, మధ్య తరహా వ్యాపారులను కూడా ఈ సమయంలో ఆదుకోవాలని సూచించింది. సామాజిక, ఉద్యోగ భద్రత, వేతనాలను ఇవ్వడం, ఇన్సూరెన్స్‌ వంటివాటితో వీరిని ఆదుకునే ప్రయత్నం చేయాలి.  అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాలను ఆదుకునేందుకు ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది. ఇలాంటి ఆపత్కర సమయంలో స్వదేశీ వస్తు రక్షణ విధానంలో పలు దేశాలు వెనక్కి తగ్గాలని సూచించింది. వివిధ దేశాల మధ్య ఉన్న వ్యాపార అడ్డంకులను, విభేధాలను పక్కనబెట్టి నూతన సప్లైచైన్‌ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.