close

తాజా వార్తలు

Published : 08/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో సహకరించని కారణంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేడే మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌

2020 మహిళల టీ20 ప్రపంచకప్‌ పతాక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆదివారమే తుది పోరు. ఓటమే లేకుండా ఫైనల్‌ చేరిన భారత జట్టు.. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన చేతిలో కంగుతిన్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలతో తుది పోరుకు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రూ.1.56 లక్షల కోట్ల పైనే

సొంత ఆదాయాలపై పూర్తి ధీమాతో తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరాని (2020-21)కి భారీ బడ్జెట్న్‌ు ప్రతిపాదిస్తోంది. ప్రాధాన్య పథకాలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్‌ కంటే 15-16 శాతం పెంచి తీసుకురావాలని నిర్ణయించింది. రూ.1.56 లక్షల కోట్ల నుంచి రూ.1.59 లక్షల కోట్ల మధ్య బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో శనివారం రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశం బడ్జెట్‌ను ఆమోదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కేసీఆర్‌ ఉన్నంత కాలం రైతుబంధు బీమా, ఉచిత కరెంటు కొనసాగిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 2021 జూన్‌ నాటికి 530 టీఎంసీల నీటిని తీసుకుని సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే రోహిణికార్తె నాటికి నారుపోసి, సకాలంలో రైతులు నాట్లు వేసే పరిస్థితులు వస్తాయని తెలిపారు. కేసీఆర్‌ ఉన్నంతకాలం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, బీమా అమలవుతాయన్నారు. శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తొమ్మిది నెలలు మొద్దునిద్ర.. ఇప్పుడు హడావుడా?

ఏపీ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికల్ని ప్రహసనంగా మార్చేసిందని, రౌడీయిజం, దౌర్జన్యం, మద్యం, డబ్బుతో గెలవాలనుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తొమ్మిది నెలలు మొద్దునిద్ర పోయిన ప్రభుత్వం, చివరి నిమిషంలో హడావుడిగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 24%కు కుదించిన ప్రభుత్వం.. తీరా రిజర్వేషన్లు ఖరారు చేసేసరికి, అదికూడా దక్కకుండా చేసిందని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. లాభదాయక జాబితా నుంచి 29 కార్పొరేషన్ల తొలగింపు

తెలంగాణలోని 29 ప్రభుత్వ రంగ సంస్థ(కార్పొరేషన్‌)ల ఛైర్మన్‌ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి మినహాయించేందుకు(వేతనాలు, పింఛన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపు) ఉద్దేశించిన బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం శాసన సభలో ప్రవేశపెట్టారు. లోకాయుక్త, ఉపలోకాయుక్త చట్టసవరణ బిల్లును సైతం ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పోలవరం కాంట్రాక్టుల్లో ఉల్లంఘనల్లేవ్‌

పోలవరం కాంట్రాక్టుల్లో ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని, అన్ని పనులూ సంబంధిత అధీకృత సంస్థ అనుమతులు తీసుకున్న తర్వాతే మొదలుపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు వర్తమానం అందించినట్లు కేంద్ర జలవనరులశాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరుగుతున్నట్లు పెంటపాటి పుల్లారావు రాసిన లేఖను పీఎంవో జల్‌శక్తి మంత్రిత్వశాఖకు పంపి వివరణ కోరంది. ఈ మేరకు నివేదిక సమర్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. విదేశాల నుంచి వస్తే... 14 రోజులు ఇంట్లోనే

కరోనా (కొవిడ్‌-19) నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాధి లక్షణాలు లేకున్నా, 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాత పరీక్షలు చేశాకే వారు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకినా 14 రోజుల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘యాజమాన్య’ ఫీజులు రెట్టింపు

ఏపీలో బీటెక్‌, ఎంటెక్‌ యాజమాన్య కోటాలో రుసుముల మోత మోగనుంది. ఈ కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు రుసుములు భారం కానున్నాయి. కన్వీనర్‌ కోటా రుసుములను తగ్గించేందుకు ప్రయత్నించిన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (హెచ్‌ఈఆర్‌ఎంసీ) యాజమాన్య కోటాలో రెట్టింపు వసూలు చేసుకునే అవకాశాన్ని కళాశాలలకు కల్పించినట్లు తెలిసింది. కొత్త బోధన రుసుముల నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ముగ్గురు సౌదీ రాకుమారుల నిర్బంధం!

సౌదీ రాజకుమారుడు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అధికారాన్ని సంపూర్ణంగా హస్తగతం చేసుకునే క్రమంలో తాజాగా రాజకుటుంబానికి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులను నిర్బంధించారు. రాజద్రోహం ఆరోపణలతో ముగ్గురు రాజకుమారులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. సౌదీ రాజు సల్మాన్‌ సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌-సౌద్‌, చక్రవర్తి సన్నిహిత బంధువు ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ నయేఫ్‌, ఆయన తమ్ముడు ప్రిన్స్‌ నవాఫ్‌ బిన్‌ నయేఫ్‌లను శుక్రవారం తెల్లవారు జామున వారి నివాసాల నుంచి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.