close

తాజా వార్తలు

Published : 07/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. బిహార్‌లో ఘోర ప్రమాదం: 11మంది మృతి

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముజఫర్‌పూర్‌ వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

2. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్‌సీఆర్‌)లపై విస్తృతంగా చర్చించి తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ఇప్పటికే తమ పార్టీ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. శుక్రవారం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నాలుగేళ్లలో పేదలకు 30 లక్షల ఇళ్లు

రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు స్థలాలు పొందనున్న పేదలతో పాటు, సొంత స్థలాలున్న వారికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై రూ.25వేల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడి ఏర్పాటుచేస్తామని, మిగతా వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. దత్తతకు రుజువులుండటం తప్పనిసరి: సుప్రీం

పిల్లల ధ్రువీకరణపత్రాల్లో పెంచినవారి పేర్లు రాసినంత మాత్రాన దత్తత తీసుకున్నట్లు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1956నాటి చట్టంలో చెప్పినట్లుగా హిందూమతానికి చెందిన పురుషుడు ఎవరైనా బిడ్డను దత్తత తీసుకొనేటప్పుడు అతని భార్య సమ్మతితోపాటు, దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించినట్లు రుజువులు చూపడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ రెండు షరతులు అనుసరించకపోతే దత్తత చెల్లదని జస్టిస్‌ లావునాగేశ్వరరావు, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మంచిచేస్తే ద్వేషమా?

హక్కుల కోసం మాట్లాడే విమర్శకులు.. కేంద్ర సర్కారు చేపట్టిన కీలకమైన నిర్ణయాలను మాత్రం తప్పు పడుతుంటారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మూస విధానాలను పక్కనపెట్టి సరైన పనులు చేస్తున్నవారంటే అలాంటి వారికి ద్వేషమని చెప్పారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ‘ఎకనామిక్‌ టైమ్స్‌- గ్లోబల్‌ బిజినెస్‌ సమిట్‌’లో ప్రధాని ప్రసంగించారు. 370 అధికరణం రద్దు, పౌరసత్వ చట్టాన్ని సవరించడం వంటి నిర్ణయాలను విమర్శిస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఐఐటీల్లో అమ్మాయిలకు 20% సీట్లు

ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించాలనే లక్ష్యమున్న అమ్మాయిలకు శుభవార్త. వారికి ఐఐటీల్లో 20 శాతం సీట్లు కేటాయించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి ఈ సీట్లు కేటాయిస్తారు. వారికి సీట్లు పెంచినందున ఇతరుల కోటాను తగ్గించారు. వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21) అమ్మాయిలకు సూమర్‌ న్యూమరరీ కోటా కింద వీటిని కేటాయిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఎంపీ, ఎమ్మెల్యేలపై 3,465 కేసుల పెండింగ్‌

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై గత డిసెంబరు నాటికి 3,465 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. రాజ్యసభలో తెరాస సభ్యుడు బండప్రకాశ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బండి కదలాలంటే లీటర్‌ పెట్రోలు ఉండాల్సిందే..!

దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)-6 పెట్రోలు, డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా విపణిలోకి తీసుకువచ్చింది. నూతన చమురుకు తగినట్లు ద్విచక్రవాహన తయారీదారులు బైక్‌ ఇంజిన్‌లలో మార్పులు చేశారు. దీనిప్రకారం వాహన ట్యాంకులో కనీసం ఒక లీటరు పెట్రోలు నిల్వ ఉండాలి. అందుకనుగుణంగా ఇంధనం లేకపోతే ట్యాంకు నుంచి పెట్రోలు పంపింగ్‌ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కొవిడ్‌-19పై నిర్లక్ష్యం వద్దు

మహమ్మారి కొవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యానికి ఏమాత్రం తావివ్వకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హితవు పలికింది. పలు దేశాలు తాజా సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘‘కరోనా వైరస్‌- ప్రభావం’’ రూ.25,00,000 కోట్లు

కొవిడ్‌- 19 (కరోనా వైరస్‌)తో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడనుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 77- 347 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,00,000 కోట్లు- 25,00,000 కోట్లు) మేర కోల్పోవాల్సి రావొచ్చని అంచనా వేసింది. గిరాకీలో క్షీణత, పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు తగ్గడం, వాణిజ్యం, సరఫరా అవరోధాలు, ఆరోగ్య సమస్యలు ఇలా పలు రూపాల్లో సమస్యలు చుట్టుముడతాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.