close

తాజా వార్తలు

Published : 05/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఐటీ ఉద్యోగుల్లో కలకలం

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో ఒక మహిళకు కరోనా లక్షణాలు బయటపడ్డాయన్న ప్రచారంతో ఐటీ కారిడార్‌లో కలకలం నెలకొంది. ప్రాజెక్టుపై ఇటలీ వెళ్లివచ్చిన ఆమె వైరస్‌ బారిన పడిందని తెలియడంతో గందరగోళం ఏర్పడింది.  కొవిడ్‌ వైరస్‌ ఉన్నట్లు ఖరారు కాలేదని, వైద్యపరీక్షల ఫలితాలు వచ్చే వరకు అవాస్తవాలు, వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ రెండు ఐటీ కంపెనీలు రసాయనిక శుద్ధీకరణ పనులు చేపట్టాయి. గురువారం నుంచి ఆ సంస్థల కార్యకలాపాలు కొనసాగుతాయని ఐటీశాఖ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. తప్పుడు ప్రచారంపై నిఘా: డీజీపీ

తెలంగాణలో సాధారణ ప్రజల జీవనానికి భంగం కలిగించేలా కరోనా వైరస్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో వదంతులను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. కొవిడ్‌ 19 నివారణకు వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత వైరస్‌ వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం నిర్వహించే వ్యక్తులపై ఇప్పటికే నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలోనూ సమాచారాన్ని పోస్ట్‌ చేశారు. 

3. రాహుల్‌ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి

బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అన్ని వర్గాలకూ సానుకూల బడ్జెట్‌

తెలంగాణలో 2020-21 వార్షిక బడ్జెట్‌ అన్ని వర్గాలకు పూర్తి సానుకూలంగా, పూర్తి వాస్తవికంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసైకు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి జరిగే బడ్జెట్‌ సమావేశాలకు ఆమెను ఆహ్వానించారు. మంత్రిమండలి ఆమోదం పొందిన గవర్నర్‌ ప్రసంగం ప్రతిని అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఏపీలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయం

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)పై ఏపీ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీఆర్‌లో కొత్తగా చేర్చిన తల్లిదండ్రుల పుట్టిన తేదీ, ప్రదేశం, మాతృభాష వంటి ప్రశ్నలు రాష్ట్రంలో మైనారిటీ వర్గాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని పేర్కొంది. అందువల్ల 2010 నాటి ప్రశ్నావళికే పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునేవరకు రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ ప్రక్రియను పక్కన పెట్టాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హోలీ సంబరాలకు దూరంగా రాష్ట్రపతి, ప్రధాని

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను గడగడలాడిస్తున్న కరోనా ప్రభావం హోలీ పండగపై పడింది. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది హోలీ సంబరాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు బుధవారం ప్రకటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులూ ఈ జాబితాలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. గ్రామాలపై... స్వచ్ఛ గురి

దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు మరింత స్వచ్ఛ రూపు సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) రెండో దశను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణ ప్రభావవంతంగా కొనసాగేలా ఇందులో దృష్టిసారించనున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మలం, మురుగునీరు, జీవ విచ్ఛిన్నశీల వ్యర్థాల నిర్వహణపై 2వ దశలో ప్రధానంగా దృష్టిసారిస్తామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చులివే!

భారత ప్రధాని నరేంద్రమోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన విదేశీ పర్యటనల ఖర్చుల వివరాల్ని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. గత ఐదేళ్లలో ఆయన పర్యటనలకు దాదాపు రూ.446.52 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రి స్పందిస్తూ.. గత ఐదేళ్లలో మోదీ విదేశీ పర్యటనలకు రూ.446.52 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అఫ్గాన్‌లో మళ్లీ హింస

అఫ్గానిస్థాన్‌లో మళ్లీ యుద్ధం మొదలయింది. అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందంతో శాంతి నెలకొంటుందని ప్రపంచమంతా ఆశించగా, పాత రోజులే మళ్లీ వచ్చాయి. తాలిబన్లు 20 మంది అఫ్గాన్‌ సైనికులు, పోలీసులను కాల్చి చంపడం; దీనికి ప్రతిగా తాలిబన్‌ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బదులు  తీర్చే  వేళాయె..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఓటమే లేకుండా గ్రూప్‌ దశను ముగించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. గురువారం సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది. గత టోర్నీలో సరిగ్గా సెమీస్‌లోనే తమ ఆశలకు గండి కొట్టిన ఇంగ్లాండ్‌తో మళ్లీ అమీతుమీ తేల్చుకోబోతోంది భారత్‌. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్‌ కూడా శుక్రవారమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.