close

తాజా వార్తలు

Published : 03/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. ఎవరెవరికి సోకిందో?

హైదరాబాద్‌కు చెందిన కరోనా నిర్ధారిత యువకుడు గత రెండు వారాల్లో ఎవరెవర్ని కలిశాడనేది ఇప్పుడు అతి కీలకమైన అంశంగా మారింది. వైరస్‌ ప్రయోగశాలలో నిర్ధారణ కావడానికి 14 రోజుల ముందు నుంచే నిద్రాణంగా శరీరంలో ఉంటూ.. వ్యాప్తిచెందే అవకాశాలు ఉండడంతో.. వైద్యఆరోగ్యశాఖ ఇప్పుడీ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతోంది. మొత్తంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు 80 మందిపైగానే సన్నిహితంగా మెలిగినట్లుగా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. శుభ్రతే వైరస్‌కు చక్కటి మందు 

కరోనా వైరస్‌ మన గడపదాకా వచ్చిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమంటున్నారు. వైరస్‌ సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య సగటున 1% మాత్రమేననీ మృతుల్లోనూ 40% మందికిపైగా రోగ నిరోధకశక్తి తక్కువున్న 60 ఏళ్లకు పైబడిన వారని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. త్వరలో రుణ మాఫీ

రైతులకు హామీ ఇచ్చిన విధంగా త్వరలోనే రుణమాఫీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయనున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా... సీఎం దృఢ సంకల్పంతో రాష్ట్రంలో రుణమాఫీ చేయాలని నిర్ణయించారని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని తాజాగా ఆదేశించారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు విన్నవించాలి

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఇందులో చేరడానికి (ఇంప్లీడ్‌) తెలుగుదేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం పార్టీ సీనియర్‌ నేతలతో ఎన్టీఆర్‌భవన్‌లో సమావేశమై మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నోటీసు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేత తగదు

ప్రభుత్వం తన అధికారాలను ఏకపక్షంగా చెలాయిస్తామంటే కుదరదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానికి భంగం కలిగించేముందు వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్‌ కమిషనర్లకు కట్టబెడుతూ తీసుకువచ్చిన మున్సిపల్‌ చట్టంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హలో.. చెప్పమ్మా.. ఏంటీ సమస్య?

ఇంటర్‌ విద్యార్థులూ.. పరీక్షల ఒత్తిడితో సతమతమవుతున్నారా?.. ఆందోళన పెరుగుతోందా? ఆ సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే ఓ ఫోన్‌ చేస్తే చాలు.. నిపుణులైన సైకాలజిస్టులు మీకు ఫోన్‌లోనే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ సేవలను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇంటర్‌ బోర్డు సిద్ధమైంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్‌ చేసి పరిష్కారం పొందవచ్చు. 73372 25803 ఫోన్‌ నంబరులో సైకాలజిస్టు అందుబాటులో ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పీపీఏలపై ఏపీని గట్టిగా హెచ్చరించాం

‘దేశంలో ఒక కేసు తెరమీదకు వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్‌లో. అక్కడ విద్యుత్తు ఒప్పందాలను పునఃపరిశీలించాలనుకున్నారు. అయితే అలా చేయడానికి వీల్లేదని మేం స్పష్టం చేశాం. ఒప్పందాలు పవిత్రమైనవని, వాటిని తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిందేనన్న ఉద్దేశంతో ఉన్నాం. అదే విషయాన్ని మేం ఏపీ ప్రభుత్వానికి విస్పష్టంగా చెప్పాం. అవసరమైతే వాటిని అమలు చేయడానికి మా పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ ప్రయోగిస్తామని హెచ్చరించాం’ అని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మోదీ సామాజిక నిర్వేదం

ప్రధానమంత్రి నరేంద్రమోదీని, సామాజిక అనుసంధాన వేదికలను వేరుచేసి చూడగలమా? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు అయితే ఎవరైనా ‘సాధ్యం కాదు’ అని బదులిస్తారు. అలాంటివారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా నరేంద్రమోదీ సోమవారం సంచలన విషయాన్ని వెల్లడించారు. సామాజిక మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ‘‘ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ల్లోని నా ఖాతాలను విడిచిపెట్టాలని భావిస్తున్నాను’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. హస్తిన హింసపై రగడ

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. దిల్లీలో గతవారం చెలరేగిన ఘర్షణలు సోమవారం ఉభయ సభల్ని కుదిపేశాయి. లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఏకంగా కుస్తీకి దిగారు! ఒకరినొకరు తోసుకున్నారు. లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమవ్వగానే.. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లారు. అమిత్‌ షా రాజీనామాను డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ముంచుకొస్తున్న మరో ప్రమాదం..

రన్నింగ్‌ మ్యాన్‌.. బర్డ్‌ బాక్స్‌.. బ్లూవేల్‌ ఛాలెంజ్‌.. ఇప్పుడదే తరహాలో మరో ప్రమాదకరమైన ఆట సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. తలలు పగులగొట్టుకునే ‘స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌/ట్రిప్పింగ్‌ జంపింగ్‌’ వైరల్‌గా మారింది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్‌ దేశాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఆటకు ఇప్పుడిప్పుడే మన దేశంలోని యువత, ముఖ్యంగా చిన్నారులు ఆకర్షితులవుతున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.