close

తాజా వార్తలు

Updated : 03/03/2020 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ సమయంలో వణుకు పుట్టింది!!

వారం రోజుల పాటు బయటకు రాలేదు

ఎన్నో ఆంక్షలు విధించారు

‘వుహాన్‌’ నుంచి క్షేమంగా శ్రీకాకుళం చేరుకున్న సూరజ్‌

‘కరోనా’ వైరస్‌... ఈ పేరు వింటేనే గుండెలు వణికిపోతున్నాయి... హైదరాబాద్‌లోనూ ఒక వ్యక్తి కరోనా బారిన పడటంతో... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ అప్రమత్తమవుతున్నారు!! వైద్యాధికారులకు అత్యవసర ఆదేశాలు అందుతున్నాయి! విమానాశ్రయాల్లో ప్రయాణికులను పూర్తిగా పరిశీలించి పంపిస్తున్నారు!! ఇప్పుడే ఇలా ఉంటే... కరోనా వైరస్‌ విజృంభించిన ప్రాంతంలో కొన్ని రోజుల పాటు ఉండి... ప్రతి రోజూ గడగడలాడిన యువకుడు సూరజ్‌ ఎట్టకేలకు చైనా నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ భయంకరమైన క్షణాలను కుటుంబీకులకు వివరించాడు. తనతో పాటు వెళ్లిన శిక్షణ బృందం ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను వివరించాడు. అవి...అతని మాటల్లోనే...

గతేడాది ఆగష్టులో చైనాలోని ‘వుహాన్‌’ ప్రాంతానికి 56 మందితో కూడిన బృందాన్ని మాకు ఉద్యోగాలిచ్చిన కంపెనీ పంపించింది. అక్కడ ఒక చరవాణి తయారీ కంపెనీలో శిక్షణ పొందేందుకు మమ్మల్ని పంపించారు. ఈ ఏడాది జనవరిలో ‘కరోనా’ వైరస్‌పై చైనాలో అలజడి ఆరంభమయింది. మేం పనిచేస్తున్న కంపెనీలో విధుల్లో ఉన్నప్పుడే సమాచారం తెలియజేశారు. కంపెనీ యాజమాన్యం అందరిని పిలిచింది. జనవరి 23వ తేదీ నుంచి ఎవరూ కంపెనీకి రావొద్దని స్పష్టం చేసింది. దీంతో అందరం భయభ్రాంతులకు గురయ్యాం. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న అక్కడి ప్రభుత్వం ఎవరిని బయటకు పంపలేదు. మమ్మల్నందరినీ కంపెనీలో కేటాయించిన ఓ గదిలోనే ఉండాలని, భోజనానికి కూడా బయటకు రావొద్దని స్పష్టం చేసింది. అంతా మేమే చూసుకుంటామని చెప్పింది. అలా...ప్రతిరోజూ మూడుపూటలు ఆహారాన్ని పంపించేవారు. బయట ఏం జరుగుతుందో తెలిసేది కాదు.

24 గంటలూ అలాగే పూర్తిగా ‘మాస్క్‌’ ధరించిన వ్యక్తులే భోజనం తీసుకువచ్చేవారు. మేము కూడా 24 గంటలూ మాస్క్‌లను ధరించే ఉండేవాళ్లం. రోజాంతా సమయం కష్టంగా గడిచేది. బయటవారు ఎవరు వచ్చినా మాట్లాడటానికి కూడా ఒప్పుకునేవారు కాదు. ల్యాప్‌టాప్‌, చరవాణిలో వార్తలు, సినిమాలు వీక్షించి గడిపేవాళ్లం. సుమారు వారం రోజులపాటు ఇలా గడిపాం. ఇండియాకు వచ్చేద్దామనుకుంటే విమానాల రాకపోకలపై నిషేధాజ్ఞలు తెలిసి హడలిపోయాం. తల్లిదండ్రులకు వీడియోకాల్‌ ద్వారా యోగక్షేమాలను తెలియజేసే వాళ్లం. చరవాణిలో ఫొటో తీసి అప్పటి పరిస్థితి పంపించేవాళ్లం. భారత ప్రభుత్వ చొరవతో జనవరి 31వ తేదీన ప్రత్యేక విమానంలో మమ్మల్ని దిల్లీకి పంపారు. కరోనా వైరస్‌ ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుంచి వచ్చిన వారందరికీ దిల్లీ, హరియాణాల్లోని ఆర్మీ క్యాంప్‌ వైద్యశాలల్లో 18 రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేశారు. అనంతరం విశాఖపట్నానికి ప్రత్యేక విమానంలో పంపారు. అక్కడ బంధువుల ఇంట్లో ఉండి సోమవారం శ్రీకాకుళంలోని మా నివాసానికి చేరుకున్నా.

సూరజ్‌కు మిఠాయి తినిపిస్తున్న కుటుంబీకులు

* వుహాన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయం చూసుకుని చైనా రాజధాని బీజింగ్‌ వెళ్లి పలు ప్రాంతాలు చూద్దామనుకున్నాం. ఇంతలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఆ ఆశ తీరలేదు. కానీ భయంకరమైన వైరస్‌ నుంచి మాత్రం మేం బయటపడ్డాం అని సూరజ్‌ వివరించాడు.

* సోమవారం గుజరాతీపేటలో తన నివాసానికి చేరుకున్న సూరజ్‌కు అతని తల్లిదండ్రులు వెంకటరమణ, లక్ష్మీలతో పాటు కుటుంబీకులు రామలింగం, రామాకుమారిలు మిఠాయిలు తినిపించారు.

న్యూస్‌టుడే - అరసవల్లి


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని