close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/02/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుండెల్లోకి.. గుడి వైభవం!

విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఆ గొప్పలు చెప్పి మురిసిపోయే వాళ్ల గురించి తెలుసు! కానీ... స్వదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్న వారి గురించి విన్నారా? దశాబ్దాల క్రితమే లండన్‌ వెళ్లి స్థిరపడ్డారామె. అన్నీఉన్నా మన దేశ సంస్కృతీ వైభవాన్ని తర్వాత తరాలకు తెలియజెప్పాలన్న కోరిక ఆమెను నిలవనీయలేదు... అందుకే పిల్లలకు సైతం అర్థమయ్యేలా మన చరిత్ర, భారతీయ నిర్మాణశైలి గురించి వీడియోలుగా అందిస్తున్నారు. ఆమే హన్మకొండకు చెందిన హేమ ఎల్లాప్రగడ...

హేమ భర్త ప్రమోద్‌ ఐటీ రంగంలో స్థిరపడ్డారు. వీళ్లకి ముగ్గురు పిల్లలు. చీకూ చింతా లేని జీవితం... అంతా సాపీఫగా సాగిపోతున్నా.. ఏదో తెలియని వెలితి. మాతృభూమిపై ఉన్న మమకారంతో ఏదైనా చేయాలనుకున్నారు హేమ. మన సంస్కృతి, చరిత్ర గొప్పదనాన్ని చిట్టి బుర్రల్లో గట్టిగా నాటే లక్ష్యంతో అడుగు ముందుకు వేశారు. అప్పుడే కదా... మన ఆచారాలు, సంప్రదాయాలు పదికాలాలపాటు పదిలంగా ఉంటాయని ఆలోచించారు హేమ ఎల్లాప్రగడ.బ్రిటన్‌లోని మిడ్లాండ్స్‌లో స్థిరపడ్డారామె.

కళ్లకు కట్టేలా...

చరిత్ర అంటేనే బోర్‌ కొడుందని అంటారు చాలామందిపిల్లలు. చరిత్రను ఓ పాఠంలా కాకుండా.. పిల్లలతో మాట్లాడుతూ వాటికి సంబంధించిన బొమ్మలను చూపిస్తూ చిట్టిపొట్టి కథలుగా చెబితే? అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు హేమ. తండ్రి కాకతీయ విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన స్ఫూర్తితోనే హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ హిస్టరీ చేశారు. 1998లో పెళ్లయ్యాక లండన్‌ వెళ్లారు. అక్కడే యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌లో ఎంఏ హిస్టరీ పూర్తి చేశారు. అనంతరం కూచిపూడి నృత్యం కూడా నేర్చుకున్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ తెలుగు వారి సంఖ్య తక్కువేంకాదు. వారిలో రెండో తరం పిల్లలు మన సంప్రదాయాలకు క్రమంగా దూరమవుతున్నారని హేమకు అనిపించింది. ఈ క్రమంలోనే ‘ఉటో’ (యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌)ను స్థాపించారు.

కాకతీయ కట్టడాల నిర్మాణశైలి, విజయనగర రాజుల వైభవం, చాళుక్య, చోళ రాజుల కట్టడాలు.. ఇలా అనేక సామ్రాజ్యాల వైభవాలని, అలనాటి నిర్మాణ రహస్యాలని యూట్యూబ్‌ వీడియోలుగా రూపొందించి పిల్లల కోసం ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు హేమ. పది నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో... ఆమే స్వయంగా ఆంగ్లంలో వివరణ ఇస్తారు. వీళ్ల పిల్లలే సందేహాలు అడుగుతుంటారు. భారత్‌కు వచ్చిన ప్రతిసారీ ఆమె ఏదో ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్లి అక్కడి కట్టడాలను ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. చరిత్రను అధ్యయనం చేసి వీడియోను రూపొందిస్తున్నారు.

ఉటో అంటూ...

హేమ తన స్నేహితులతో కలిసి స్థాపించిన ఉటో సంస్థ ద్వారా అనేక కార్యకలాపాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏటా పరివార్‌ శిబిరం ఏర్పాటుచేసి రామాయణం, మహాభారతాలను పిల్లలకు చెబుతూ వారికి నచ్చిన పాత్రలను నాటక రూపంలో రూపొందిస్తున్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని చెబుతూ పిల్లలతో పజిల్స్‌ చేయిస్తున్నారు. తెలుగులోని శ్లోకాలను, పద్యాలను నేర్పిస్తున్నారు. బ్రిటన్‌లో మనవాళ్లకోసం తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మన భారతీయ సనాతన సంస్కృతి గొప్పదనాన్ని పిల్లలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందంటారు హేమ.

చరిత్ర విద్యార్థిగా తనకున్న అనుభవం కూడా జోడించి చక్కని విశ్లేషణలు చేస్తున్నారు. గ్రీస్‌లోని ప్రఖ్యాత పాంథియన్‌లో ఉన్న దానికన్నా మన ఎల్లోరాలోని కైలాస్‌నాథ్‌ దేవాలయంలో నిర్మించిన కాంటీలీవర్‌ అతిపెద్దదట. ఇక కాకతీయులు ట్యాంక్‌ టెంపుల్‌ టౌన్‌ విధానంలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు హేమ. ఇప్పుడు మరో అడుగుముందుకేసి ఇక మన దేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాల గొప్పదనం, శిల్ప వైవిధ్యం లాంటిపై వీడియోలను రూపొందిస్తున్నారు.

- జి.పాండురంగ శర్మ, ఈనాడు, వరంగల్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.