close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 26/02/2020 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మణిరత్నం సినిమాలో అవకాశం అలా పోయింది!

నేను చనిపోయానని పేపర్‌లో శ్రద్ధాంజలి వేశారు!

ఆమె కళ్లల్లో ఉందో మైకం.. అందాన్ని ఆరాధించే ప్రేక్షకులకు తనే లోకం.. ముత్యాలు పొదిగిన నవ్వుతో.. పాల మీగడలాంటి తనువుతో.. చక్కటి అభినయంతో.. తెలుగు తెరపై తళుక్కుమంది. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. ఆమె రేఖా వేదవ్యాస్‌. ఆనందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె కథానాయికగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరాదాగా కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకుంది. 

మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి?

రేఖ వేదవ్యాస్‌: రేఖ, అక్షర, జింకె మారె రేఖ(జింక పిల్ల). తెలుగులో తేజగారు తీసిన ‘చిత్రం’ కన్నడలో తీశారు. దాంతో అప్పటి నుంచి జింకె మారె రేఖ పేరు స్థిరపడిపోయింది.

మీ సొంతూరు ఏది?

రేఖ వేదవ్యాస్‌: ఉడుపి. అందం అనేది అక్కడి నేల, నీరు అన్నింటిలోనూ ఉంది(నవ్వులు)

ఈ మధ్యకాలంలో అసలు తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు ఎందుకని?

రేఖ వేదవ్యాస్‌: కర్ణాటకలో వరుస చిత్రాలు చేశాను. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నాను. 

ప్రస్తుతం ఏం చేస్తున్నారు.

రేఖ వేదవ్యాస్‌: మళ్లీ తెలుగు సినిమాలు చేద్దామని అనుకుంటున్నా. ప్రేక్షకులు, అభిమానులు ఇంతగా ప్రేమ చూపిస్తుంటే ఎందుకు వదులుకుని ఉండిపోవాలి? అనిపించింది. నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలనే విషయాన్ని దర్శక-రచయితలకే వదిలేస్తున్నా. 

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?

రేఖ వేదవ్యాస్‌: 2001లో ఇండస్ట్రీకి వచ్చా. అంతకుముందు రెండు, మూడేళ్లు మోడలింగ్‌ చేశా. అక్కడ ఒక ఫ్యాషన్‌ బ్రాండ్‌కు యాడ్‌ చేశా. దాని పోస్టర్లు అక్కడ పెట్టి ఉంటే, నా మొదటి చిత్రం నిర్మాత వాటిని చూసి నాకు అవకాశం ఇచ్చారు. సినిమాల్లో నటించాలా? వద్దా? అనుకున్నా. కానీ మన జీవితం ఎటువైపు వెళ్లాలనేది రాసి పెట్టి ఉంటుంది. అలా కన్నడలో ‘చిత్ర’ సినిమా చేశా. 

‘ఆనందం’ అవకాశం ఎలా వచ్చింది?

రేఖ వేదవ్యాస్‌: ‘చిత్రం’సినిమాకు రామోజీరావుగారు నిర్మాత. కన్నడలో కూడా ఆయనే నిర్మాత. ఆ సినిమా చేసేటప్పుడు రషెస్‌ చూసి ఆయనకు నచ్చి ‘ఆనందం’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత దాదాపు 10 చిత్రాల్లోనటించా. మరోవైపు కన్నడ, తమిళ్‌, హిందీ చిత్రాల్లో అవకాశాలు తలుపుతట్టాయి. హిందీలో ఆర్య బబ్బర్‌తో నటించా.

‘ఆనందం’ హిట్టయినా కూడా కేవలం 10 సినిమాల్లో నటించడం ఏంటి?

రేఖ వేదవ్యాస్‌: నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా చిన్న వయసు. మా కుటుంబంలో సినిమావాళ్లు లేరు. దీంతో సినిమాల ఎంపిక విషయంలో సరైన మార్గదర్శకత్వం లేకుండా పోయింది. పైగా నేను కన్నడ అమ్మాయిని కావడంతో అక్కడ అవకాశాలు రావడంతో అటువైపు వెళ్లిపోయా. అయినా పర్వాలేదు తెలుగులో మంచి సినిమాలే చేశా. ‘జాబిలి’,  ‘ఒకటో నెంబరు కుర్రాడు’, ‘దొంగోడు’లాంటి విజయవంతమైన చిత్రాలు నటించా.

మీరెంత మంది సిస్టర్స్‌.. బ్రదర్స్‌..?

రేఖ వేదవ్యాస్‌: నేను ఒక్కదాన్నే. నాన్న లేరు. అమ్మ గృహిణి. 

కేవలం నటించడమేనా? ఇంకా ఏదైనా చేస్తారా?

రేఖ వేదవ్యాస్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్‌ వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఒకే పని చేయడం లేదు. నాలో ఏం టాలెంట్‌ ఉందా? అని ఇప్పుడు వెతకడం మొదలు పెట్టాలి. 

ముంబయి ఎందుకు వెళ్లారు?

రేఖ వేదవ్యాస్‌: నా కెరీర్‌ అక్కడే మొదలైంది. ప్రారంభంలో కొన్ని యాడ్స్‌ చేశా. మ్యూజిక్‌ సీడీలు చేశా. పైగా ఆ నగరంలో మనకు కాస్త ప్రైవసీ ఉంటుంది. ఎందుకంటే బెంగళూరులో ఉండగా బయటకు వెళ్లడానికి కాస్త ఇబ్బంది ఉండేది. ముంబయిలో ఆ ఇబ్బంది లేదు.

ఏ హీరో అంటే ఇష్టం?

రేఖ వేదవ్యాస్‌: షారుఖ్‌ఖాన్‌. 

‘మన్మథుడు’లో అతిథి పాత్ర కావాలనే చేశారా?

రేఖ వేదవ్యాస్‌: అవును. ఆ విషయం ముందే చెప్పారు. కేవలం నాగార్జునగారి కోసమే అందులో నటించా. అప్పుడు ఆయన నాకు ఒక మాటిచ్చారు. ‘ఈ సినిమాలో అతిథి పాత్ర మాత్రమే. తర్వాత మనిద్దరం కలిసి ఫుల్‌ మూవీ చేద్దాం’ అన్నారు. ఇప్పటివరకూ ఆ ప్రామిస్‌ను నెలబెట్టుకోలేదు. నాగార్జున గారూ.. ఎప్పుడు పిలుస్తారు సర్‌.(నవ్వులు)

అన్ని భాషల్లో కలిపి దాదాపు 40 సినిమాలు చేశారు. ఫైనాన్షియల్‌గా పర్వాలేదా?

రేఖ వేదవ్యాస్‌: ముకేశ్‌ అంబానీ అంత అయితే కాదు. ఆ స్థాయికి వచ్చినప్పుడు నేనే చెబుతా(నవ్వులు) 

ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పారా?

రేఖ వేదవ్యాస్‌: చాలా మంది చెప్పారు. కానీ, ఎవరూ నచ్చలేదు. 

రాఘవేంద్రరావుతో పనిచేయడం ఎలా అనిపించింది?

రేఖ వేదవ్యాస్‌: ఆయనతో పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చాలా బాగా చూసుకునేవారు. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఒక ఫన్నీ ఘటన జరిగింది.‘నెమలి కన్నోడా..’ పాటను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించారు. తిరిగి వచ్చేసిన తర్వాత ‘ఈ పాటలో నా స్టైల్‌ ఏదో మిస్సయింది. ఎందుకు చేయలేకపోయాం’ అని రాఘవేంద్రరావుగారు అన్నారు. ఆ వెంటనే ప్రసాద్‌ ల్యాబ్స్‌లో మాకు ఆ పాటకు సంబంధించిన డ్రెస్‌లు వేసి కొబ్బరి చెట్లతో బ్యాగ్రౌండ్‌ వచ్చేలా సీన్‌ తీశారు. 

ఒక సినిమా షూటింగ్‌ సమయంలో ఫ్లైట్‌ విషయంలో మోసం చేశారట!

రేఖ వేదవ్యాస్‌: అవును! అప్పట్లో ఎక్కడ ఏయే ప్రదేశాలు ఉన్నాయో పెద్దగా తెలియదు. వైజాగ్‌ ఎక్కడుందో కూడా తెలియదు. ‘రేపు షూటింగ్‌ కోసం వైజాగ్‌ వెళ్తున్నాం. అక్కడ ఎయిర్‌పోర్ట్‌ లేదు’ అని చెప్పి నన్ను రైల్లో పంపారు. ఆ తర్వాతి రోజు కెమెరామెన్‌ వస్తే, ‘మీరు ఎలా వచ్చారు’ అని అడిగా. ‘నేను విమానంలో వచ్చా’ అని చెప్పారు. అప్పుడు అర్థమైంది నన్ను ఫూల్‌ను చేయడానికి రైల్లో పంపారని. వైజాగ్‌లో షూటింగ్‌ చాలా బాగా అనిపించింది. 

ఈ మధ్యలో శ్రీనువైట్లను, ఆకాశ్‌లను కలిశారా?

రేఖ వేదవ్యాస్‌: లేదు. ఏదైనా అవార్డు ఫంక్షన్ల సమయంలో మాత్రమే కలుస్తాం. ఆకాశ్‌తో మాట్లాడి చాలా రోజులైంది. 

రక్తంతో ఎవరైనా ప్రేమ లేఖలు రాశారా?

రేఖ వేదవ్యాస్‌: కన్నడలో నా తొలి చిత్రానికే మంచి పేరొచ్చింది. ఏకంగా 175 రోజులు ఆడింది. అందులో చాలా గ్లామర్‌గా కనిపిస్తా.  ఒక రోజు షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే, రక్తంతో రాసిన లెటర్‌ కనిపించింది. నాకు చాలా భయం వేసింది. 

ఉలవచారు ఎలా తినాలో ఎస్వీ కృష్ణారెడ్డిగారు నేర్పించారట!

రేఖ వేదవ్యాస్‌: ఎస్వీ కృష్ణారెడ్డిగారికి మంచి ప్రొడక్షన్‌ హౌస్‌ ఉండేది.  నేను పూర్తి వెజిటేరియన్‌ని. ఆయన సినిమా షూటింగ్‌ సందర్భంగా ఉలవచారును చూపించి ‘ఇదేంటి’ అని అడిగా. ‘వెజిటేరియన్‌ తినేవాళ్లకు మంచి ప్రొటీన్‌ ఫుడ్‌. పెరుగులో ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది’ అని చెప్పారు. నిజంగా చాలా బాగుంది. 

మధ్యలో మీరు పేరు ఎందుకు మార్చుకున్నారు?
రేఖ వేదవ్యాస్‌: అవును అక్షర అని మార్చుకున్నా. జాతకాలు నమ్ముతాను. కానీ, అందుకోసం మార్చుకోలేదు. ఒక రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానని వార్తలు వచ్చాయి. చాలామంది అది నిజమనుకుని పేపర్లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘రేఖ పేరుతో అలా వార్త వచ్చింది కదా! మార్చుకుంటే బాగుంటుంది’ అని చెప్పారు. అప్పుడు అక్షర అని మార్చుకున్నా. అయితే ఆ పేరు సెట్‌ కాలేదు. ఇప్పుడు రేఖనే.

సినిమా ఇండస్ట్రీకి రావడం వల్లే మిస్‌ ఇండియా పోయిందనే బాధపడ్డారట!

రేఖ వేదవ్యాస్‌: అందరూ మిస్‌ ఇండియా వెళ్లి సినిమాకు వస్తారు. కానీ, నేను డైరెక్ట్‌గా సినిమాకు వచ్చా. 

చాలా మంది రేఖ ఇండియన్‌ కాదు.. ఫారెన్‌ నుంచి వచ్చిందనుకుంటారు నిజమేనా?

రేఖ వేదవ్యాస్‌: విదేశాల్లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అలా జరిగేది. కొన్నిసార్లు మన యూనిట్‌ వాళ్లే నన్ను గుర్తుపట్టేవారు కాదు.

తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు?

రేఖ వేదవ్యాస్‌: నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. అందుకే నాకు చిరంజీవిగారంటే ఇష్టం. ఆయనతో ఒక మర్చిపోలేని సంఘటన ఉంది. మేము ‘ఒకటో నెంబరు కుర్రాడు’ పాటల షూటింగ్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లాం. అప్పుడు ఆయన ‘ఇంద్ర’పాటలు పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో నా మొబైల్‌ ఛార్జర్‌ అక్కడ పనిచేయలేదు. దీంతో ఆయన తన మొబైల్‌ ఛార్జింగ్‌ అడాప్టర్‌ నాకు ఇచ్చారు. అది చాలా రోజులు నా దగ్గర ఉంది.

మీరు చనిపోయారన్న వార్తలను ఎవరు సృష్టించారు?

రేఖ వేదవ్యాస్‌: తెలియదు. అప్పట్లో రేఖ అనే టీవీ ఆర్టిస్ట్‌ చనిపోయారు. అది నేను అనుకుని టెలివిజన్‌ ఛానళ్ల వాళ్లు నా ఫొటో వేశారు. 

మీకు దర్శకత్వం చేయాలని ఉందా?

రేఖ వేదవ్యాస్‌: అంత టాలెంట్‌ ఉందో లేదో తెలియదు. మొదట ఎవరి దగ్గరైనా పనిచేసి ఆ తర్వాత చేస్తా.

ఇంగ్లిష్‌ సినిమాలో కూడా నటించారు కదా!

రేఖ వేదవ్యాస్‌: అవును. అది కూడా రామోజీరావు గారిదే. ఆయన బ్యానర్‌లో నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్‌ బహుశా నేనే కావచ్చు. ఆనందం 200రోజుల ఫంక్షన్‌ సందర్భంగా అక్కడకు వచ్చిన హాలీవుడ్‌ డైరెక్టర్‌ నాకు అవకాశం ఇచ్చారు. రెండు రోజులు షూటింగ్‌ జరిగింది. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.

మీ ఫ్రెండ్స్‌  మిమ్మల్ని డీడీ1 అని పిలుస్తారట!

రేఖ వేదవ్యాస్‌: అవును! డీడీ1 అంటే డెలికేట్‌ డార్లింగ్‌ నెం.1. ఉదాహరణకు 10మంది స్నేహితులం కూర్చుని ఉంటే, దోమలన్నీ నన్నే కుడతాయి. ఎవర్నీ కుట్టవు. ఏది జరిగినా నాకే ఎఫెక్ట్‌ అవుతుంది.

తెలుగబ్బాయిని ప్రేమించారట!

రేఖ వేదవ్యాస్‌:  ఆ అబ్బాయి ఎవరో చెబితే  వెళ్లి కలిసి ప్రేమించుకుంటాం. 

ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటి?

రేఖ వేదవ్యాస్‌: 2020 ప్రపంచం మారిపోయింది. యాక్టింగ్‌ అంటే నాకు పిచ్చి. అది నా ప్యాషన్‌. అది తప్ప నాకు ఏదీ తెలియదు. 

తమిళంలో ఎక్కువ సినిమాలు చేయలేదే?

రేఖ వేదవ్యాస్‌: కన్నడలో బిజీగా ఉండటంతో డేట్స్‌ సర్దుబాటు చేయలేక సినిమాలు చేయలేదు. ఒకానొక సందర్భంలో మణిరత్నంగారి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో నన్ను సరిగా ఎవరూ గైడ్‌ చేయలేదు. అది చేసి ఉంటే తమిళంలో బాగా బిజీగా అయ్యేదాన్నేమో. కానీ, కన్నడలో అందరు పెద్ద హీరోలతో చేశా. 

ఇప్పుడు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

రేఖ వేదవ్యాస్‌: ఎలాంటి పాత్రలైనా చేస్తా. ఎవరితోనైనా చేస్తా. 

తెలుగులో మిస్సయిన సినిమాలు ఎవైనా ఉన్నాయా?

రేఖ వేదవ్యాస్‌: ‘కలుసుకోవాలని..’ మిస్సయింది. నా స్థానంలో గజాలా వచ్చి చేరింది. మంచి ప్రాజెక్టులు పోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఛాన్స్‌లు వదులుకోవాలని లేదు. వెబ్‌సిరీస్‌ల్లోనైనా నటిస్తా. 

పెళ్లికాని సల్మాన్‌ఖాన్‌ను చూస్తే నీకేమనిపిస్తుంది?

రేఖ వేదవ్యాస్‌: చాలా హాట్‌గా ఉన్నాడనిపిస్తుంది. 

ఉలవచారు ఏయే పదార్థాలతో చేస్తారు?

రేఖ వేదవ్యాస్‌: ఉలవలు, చింతపండు, ఉప్పు (నవ్వులు)

ఎవరినైనా కుక్కలతో పోల్చమంటే ఎవరిని పోలుస్తావు?

రేఖ వేదవ్యాస్‌: ఎవరినీ పోల్చను.  మనుషులకంటే కూడా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.