close

తాజా వార్తలు

Updated : 24/02/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1.  న్యూజిలాండ్‌దే తొలి టెస్టు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టుకు న్యూజిలాండ్‌ చెక్‌పెట్టింది. తొలి టెస్టులో టీమ్‌ఇండియాను పది వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో బోణీ కొట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. సోమవారం నాలుగో రోజు 144/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా 191 పరుగులు చేసింది. దీంతో మరో తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 1.4 ఓవర్లలో కొట్టేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


2. అమెరికాలో వలసదారులకు కఠిన నిబంధన

వలసదారులపై మరో కఠిన నిబంధనాస్త్రాన్ని ప్రయోగించేందుకు ట్రంప్‌ సర్కారు సమాయత్తమైంది. అమెరికాలో శాశ్వత నివాస హోదా కోరే విదేశీయులెవరూ అక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా నిషేధం విధించనుంది. తమ దేశంలోని పన్ను చెల్లింపుదారులపై వలసదారులు అదనపు భారంగా మారకుండా నిరోధించేందుకుగాను సోమవారం నుంచి ఈ నూతన నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోసం దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వేలమంది భారతీయులపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాటిచ్చా.. వస్తున్నా

అగ్రరాజ్యాధిపతిని ఆత్మీయ ఆలింగనం చేసుకునేందుకు భారతావని సమాయత్తమయింది. విశిష్ట అతిథికి కలకాలం గుర్తుండిపోయేలా... లక్షల మంది ప్రజలతో ఘనస్వాగతం పలికేందుకు ‘ఇండియా రోడ్‌ షో’ ఎదురుచూస్తోంది. తొలిసారి సకుటుంబ సమేతంగా విచ్చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ను అహ్మదాబాద్‌ నగరం ‘నమస్తే ట్రంప్‌’ అంటూ స్వాగతిస్తోంది.  రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాల్లో స్ఫూర్తిని చాటిచెప్పేందుకు మోతెరా స్టేడియం సొబగులద్దుకుంది. తాజ్‌మహల్‌ పాలరాతి అందాలను ఆస్వాదించండంటూ ఆగ్రా నగరం ఆహ్వానం పలుకుతోంది. మనసువిప్పి మాట్లాడుకునేందుకు, ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు దిల్లీ నగరం వేదిక అవుతోంది. సోమ, మంగళవారాల్లో మనదేశంలో పర్యటిస్తున్న ట్రంప్‌ కుటుంబం, అమెరికా అధికారుల బృందానికి భారతీయ సమున్నత, వైవిధ్య భరిత సంస్కృతిని చాటేలా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్‌లో వారికి మోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


ట్రంప్‌ పర్యటన ప్రత్యేక కథనాలు...

ట్రంప్‌జీ.. అర్థమవుతోందా! ►అదో మినీ రాజప్రాసాదం!  ►శత్రు దుర్భేద్యం! ఎడిటోరియల్‌: కీలక  పర్యటన! ►ఎటుచూసినా మోదీ, ట్రంప్‌లే! ఓటుచాటు పర్యటన?


4. బంగారు, వెండి వన్నెలు.. 225 డిజైన్లలో బతుకమ్మ చీరలు

బతుకమ్మ చీరల తయారీకి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈసారి బంగారు, వెండి రంగు అంచులతో మరింత నాణ్యత, నవ్యతతో సిద్ధంచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 225 డిజైన్లతో సెప్టెంబరు ఆఖరుకల్లా కోటి చీరలు తయారు చేయనున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఈ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షించనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ సందర్భంగా.. 18 ఏళ్లు దాటిన పేద మహిళలకు ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చీరలను కానుకగా అందజేస్తోంది.   ఏటా దాదాపు కోటి మందికి ఇవి చేరుతున్నాయి. 2020 బతుకమ్మ పండగ చీరల తయారీపై ఇటీవల చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


5. ‘పొగ’కు పొగబెట్టాలని!

 దేశంలో పొగాకు వినియోగించేందుకు ప్రస్తుతం అనుమతిస్తున్న చట్టబద్ధ కనీస వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పొగాకు నియంత్రణకు అవసరమైన సూచనలు చేసేందుకు ఏర్పాటుచేసిన ఉప సంఘం ఇటీవలే సమావేశమై ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పుర ప్రభ.. కొత్త శోభ

అత్యుత్తమ పట్టణ జీవన ప్రమాణాలకు బలమైన పునాదే లక్ష్యంగా సోమవారం పట్టణ ప్రగతికి శ్రీకారం చుడుతున్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మెరుగైన పౌర సేవల కల్పన ద్వారా పట్టణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో ప్రజల భాగస్వామ్యం కీలకం కానుంది. మార్చి 4 వరకూ పది రోజులపాటు రాష్ట్రంలోని 128 పురపాలక సంఘాలు 13 నగరపాలక సంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లో వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్‌ల వారీగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేటి నుంచి జగనన్న వసతి దీవెన

నవరత్నాల్లో భాగంగా ‘జగనన్న వసతి దీవెన’ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా విద్యార్థుల భోజనం, వసతి సదుపాయాల కింద ఆర్థిక సహాయం అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.87 లక్షల మంది ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. పథకం అమలుకు ఏడాదికి రూ.2,278 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆంధ్రాలోనూ బాబ్జీ లీలలు!

రాష్ట్రంలో బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) విభాగం మందుల కొనుగోలు కుంభకోణంలో కీలక సూత్రధారి కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ లీలలు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించినట్లు తేలింది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు డొల్ల కంపెనీల పేరుతో అధిక ధరలకు ఔషధాలు సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టిన ఈ కుంభకోణంలో శ్రీహరిబాబు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ఐఎంఎస్‌లోనూ కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఇటీవల అక్కడి విజిలెన్స్‌ విభాగం నిగ్గు తేల్చింది. ఇందులోనూ శ్రీహరిబాబు పాత్ర ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అభ్యర్థుల ఖరారు నేడే

తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ (డీసీఎమ్మెస్‌)ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, డైరెక్టర్‌ పదవులకు అభ్యర్థులను ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ సోమవారం ఖరారు చేయనున్నారు. ఆయన ఆదివారం తమ నివాసంలో ఈ జాబితాపై కసరత్తు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల్లో 20 మంది డైరెక్టర్లు, డీసీఎమ్మెస్‌లలో 10 మంది డైరెక్టర్ల పదవులకు మంగళవారం నామినేషన్లను దాఖలు చేయాలి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


10. ‘హిట్‌’ అవుతుందనే నాని ఈ పేరు పెట్టాడు

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌...’ అనేది ఉపశీర్షిక. రుహానీశర్మ నాయిక. శైలేష్‌ కొలను దర్శకుడు. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాత. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై కథానాయకుడు నాని సమర్పిస్తున్నారు. ఈ నెల 28న విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. కె.రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘నాని నిర్మాతగా ‘అ!’ అంటూ మొదలు పెట్టాడు. రెండో సినిమాకే ‘హిట్‌’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకపోతే ఈ పేరు పెట్టుంటాడ’’న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.