close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/02/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇళ్లే గుళ్లు!

ఎవరింటికైనా చుట్టపుచూపుగా వెళ్తే పండో, స్వీటో తీసుకెళ్తాం... నిజామాబాద్‌లోని బ్రహ్మపురి వాసుల దగ్గరికెళ్తే మాత్రం కొబ్బరికాయలు, పూజాసామగ్రి సైతం తీసుకెళ్లాల్సిందే... ఎందుకంటే అక్కడ ప్రతి ఇల్లూ ఒక గుడే!
ఆ ఇంటి ప్రాంగణంలోకి ఎవరైనా చెప్పులతో వెళితే ‘ఏం బాబు గుళ్లోకి పాదరక్షలతో రాకూడదని తెలియదా?’ అని ఓ బామ్మ గద్దిస్తారు. లోపలివైపు పరిశీలనగా చూస్తే కలశంతో ఉన్న గోపురం కనిపిస్తుంది. రాజద్వారం లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఇంకాస్త లోపలికెళ్తే అంతరాలయం, దాని చుట్టూ రాతి స్తంభాలతో ప్రదక్షిణ ప్రాకారం, గర్భగుడి, అందులో దేవతల విగ్రహాలు, ఉత్సవ మూర్తులుంటాయి. ధూపదీపాలు, పూజాపాత్రలు కనిపిస్తాయి. ఓహో.. అది దేవాలయమే అని రూఢీ చేసుకుంటుండగానే ముసలాయన, పెద్దావిడ, నడివయస్కులు, యువతి, పిల్లలు... అంతా కనిపిస్తారు. వంటలు, స్నానాలు, ఆటపాటలూ.. అన్నీ అక్కడే చేస్తారు. ఇంతకీ అది గుడా? ఇల్లా? అని కొత్తగా వెళ్లినవారు అయోమయంలో పడాల్సిందే. నిజానికి అది గుడిలాంటి ఇల్లు.
శతాబ్దాల చరిత్ర..
నిజామాబాద్‌లోని పురాతన ప్రదేశం బ్రహ్మపురి. రెండు కి.మీ.ల పరిధిలో ఉండే ఇక్కడ ఇళ్లలోనే పెద్దపెద్ద ఆలయాలో, ఇంటిముందే చిన్న మందిరాలో ఉంటాయి. ఇలా ఆ ప్రాంతంలో సుమారు 200 దాకా ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. ఇవన్నీ వందల ఏళ్ల క్రితం నుంచి ఉన్నవే. వాటిలోని విగ్రహాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వారసత్వంగా వచ్చిన ఈ ఆచారాన్ని నేటి తరం తూచా తప్పకుండా పాటిస్తోంది. నియమ, నిష్ఠలతో ఆలయంలో చేసినట్లే పూజలు, ఉత్సవాలూ చేస్తారు. వీధుల్లో అయితే పెద్దపెద్ద పురాతన దేవాలయాలూ దర్శించుకోవచ్చు. ఈ సంప్రదాయం, ఆచారం కొన్ని శతాబ్దాల నుంచి ఇక్కడ ఉందని స్థానికులు చెబుతారు. ఈ ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టూబొట్టు, భాషలూ కనిపిస్తాయి. ఒకప్పుడు మరాఠాల ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు ప్రభావం ఎక్కువ. ధర్మ సంరక్షణ కోసం ఆయన అనేక ఆలయాలను నిర్మించారు. శిథిలమైన వాటిని పునరుద్ధరించారు. కొత్త పూజా విధానాలను ఏర్పరిచారు. హనుమంతుడి విగ్రహాలు ప్రతిష్ఠించి వ్యాయామశాలలు, ఆత్మరక్షణ విద్యలను నేర్పించే శిక్షణ కేంద్రాలు నెలకొల్పారు. హనుమాన్‌ మందిరాలు వందదాకా ఉంటాయి. అలా ఇళ్లలో గుళ్లు కట్టుకోవడం, విగ్రహాలను పూజించడం ఆనవాయితీగా వచ్చిందని స్థానికులు చెబుతారు.

-అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.