close

తాజా వార్తలు

Published : 17/02/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెన్నులకో ఆసుపత్రి

ఇప్పుడంతా యూజ్‌ అండ్‌ త్రో యుగం.
సంవత్సరం వాడాక... ఫోన్‌ను మార్చేస్తాం.
పెన్నుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. రాయడం ఆగి పోగానే... పడేస్తాం.
రీఫిల్‌ మార్చుకోవడం, ఇంక్‌ పోయించుకోవడం, ముక్క పాడైతే బాగు చేసుకొని మరీ రాసుకోవడం... లాంటి ప్రక్రియలే నేటి తరానికి తెలియవు. అయితే శ్రీకాకుళంలో అలా కాదు... పాడైపోయిన పెన్నులను విసిరేయరు. ఎందుకంటే అక్కడ దెబ్బతిన్న పెన్నులను బాగుచేసే ఆసుపత్రి ఒకటుంది. ఆ ఆసుపత్రికి వెళ్లి పెన్నుకు చికిత్స చేయించుకొని తిరిగి వాడతారు.

పెన్‌ అంటే కొందరికి రాసే ఉపకరణం మాత్రమే. చాలామందికి అదో తీయని జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను ఎవరూ చెరిపేసుకోలేరు కదా! అలాంటి వారికోసం శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో ఉందో వినూత్న ఆసుపత్రి. పేర్ల వీధికి చెందిన పొట్లూరి రాజారావు, ఆనందరావు సోదరులు. 1970ల్లో వివిధ దుకాణాల నుంచి రూ.12కి పది పెన్నులను కొని బయట విక్రయించేవారు. అప్పట్లో ఇంక్‌ పెన్నులను ఎక్కువగా వినియోగించేవారు. అవి పాడైపోతే మరమ్మతులు చేసేవారు ఎవరూ లేకపోవడంతో వారే దీనికి పూనుకున్నారు. ఒక స్నేహితుడి సూచనల మేరకు 1976లో పెన్‌ ఆసుపత్రిగా దీనికి నామకరణం చేశారు. దీన్ని ప్రస్తుతానికి రాజారావు రెండో కుమారుడు నాగరాజు నిర్వహిస్తున్నారు. ఈ దుకాణంలో ఇంకు, జెల్‌, బాల్‌ పాయింట్‌ పెన్నులకు మరమ్మతులు చేస్తారు. దీని కోసం ఆకురాయి, ప్లేయిర్‌, సానబెట్టే రాయి, నీళ్లు, బ్లేడు, ఇంకులను ఉపయోగిస్తారు. మరమ్మతులతో పాటు అనేక రకాల పెన్నులూ విక్రయిస్తారు. కొంతమందికి విదేశాల నుంచి ఖరీదైన పెన్నులను బహుమతిగా పంపిస్తుంటారు. వాటిల్లో ఇంకు అయిపోయాక.. అందులో రీఫిల్‌ వేయించుకోవాలంటే చాలా ఖరీదు. అటువంటి వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఉదాహరణకు వాటర్‌మెన్‌ బ్రాండ్‌లో ఓ పెన్ను ఖరీదు రూ.5500.  దీని రీఫిల్‌ రూ.2000పైనే. మధ్య తరగతి వారు వీటికి రీఫిల్‌ వేయించుకోవాలంటే కుదరని పని. ఈ తరహా పెన్నులకు సరిపోయే రీఫిల్‌ను తక్కువ ధరకే అమర్చుతారు. మరమ్మతులకు అవసరమయ్యే సామగ్రికి అయిన వ్యయాన్ని మాత్రమే ఇక్కడ వసూలు చేస్తారు. సర్వీసు ఛార్జీ అస్సలు తీసుకోరు. దుకాణానికి ఉన్న ప్రాధాన్యం కాపాడుకునేందుకే డబ్బు తీసుకోవడం లేదని చెబుతుంటారు నాగరాజు.

- మాలోతు సురేశ్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని