close

తాజా వార్తలు

Published : 16/02/2020 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకప్పటి ఉగ్రవాదుల పుట్టలో మిగిలింది ముగ్గురే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదం అత్యధికంగా ఉండే నాలుగు జిల్లాల్లో ఆ ప్రాంతం ప్రత్యేకమైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది ఉగ్రవాదుల పుట్ట. అక్కడికి భద్రతా దళాలు వెళ్లాలన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అదే త్రాల్‌.. ! కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ల సమయంలో తరచూ వినిపించే పేరు. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రకార్యకలాపాలకు ఒకప్పుడు ఇదే కేంద్రం. 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు బలైన పుల్వామాలోని లోథిపోరా దీనికి అత్యంత సమీపంలోనే ఉంటుంది. పుల్వామ తర్వాత మన భ్రదతా దళాలు ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. ఫలితంగా ఒకప్పుడు ఉగ్రపుట్టగా పేరున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే ఉన్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి.

ఉగ్రతాచులుగా పేరున్న బుర్హాన్‌ వనీ, జకీర్‌ ముసా, సమీర్‌టైగర్‌లు త్రాల్‌ ప్రాంతానికి చెందినవారు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రతాదళాలు వీరిని మట్టుబెట్టాయి. పుల్వామా దాడి తర్వాత ఇక్కడి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. భద్రతా దళాలు దక్షిణ కశ్మీర్‌పై పూర్తిగా దృష్టిపెట్టాయి. 2019కి ముందు ఇక్కడ దాదాపు 30 మంది ఉగ్రవాదులు చురుగ్గా దాడులు నిర్వహించేవారు.  కానీ ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా పకడ్బంధీగా దాడులు నిర్వహిస్తుండటంతో వీరి సంఖ్య ఇప్పుడు మూడుకు పడిపోయింది.

మరోపక్క అవంతిపుర పోలీస్‌ డివిజన్‌లో మొత్తం 18 మంది ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. వీరంతా అభా, సంబూరు, పామ్‌పోరే ప్రాంతాల్లో నక్కినట్లు భావిస్తున్నారు. దీంతో త్రాల్‌ ప్రాంతంలో గతంతో పోలిస్తే ప్రశాంత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడికి కారణమైన జైషే అహ్మద్‌ సంస్థ  ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్‌ జుల్ఫీకర్‌ హసన్‌ ధ్రువీకరించారు. 

పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఖరీయాసీర్‌ను గత వారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. ఈ ఘటనతో జైషే అనుపానులను తుడిచిపెట్టినట్లైంది. 

మిగిలిన ప్రాంతాలపై దృష్టి..
త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టినా.. దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో మాత్రం ఉగ్రకదలికలు కొనసాగుతున్నాయి. దాదాపు 119 ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. వీరిలో 90శాతం మంది స్థానికులు కాగా.. మిగిలిన 10శాతం మంది మాత్రం విదేశీయులు. ఆర్టిక్‌ 370 రద్దు తర్వాత మొత్తం 14 మంది ఉగ్రవాదులను దళాలు మట్టుబెట్టాయి.

శాటిలైట్‌ ఫోన్లపై కన్ను..
తమ అనుపానులు దళాలకు తెలియకుండా ఉగ్రవాదులు శాటిలైట్‌ ఫోన్లను విరివిగా వాడేవారు. దీంతో బీఎస్ఎఫ్‌ అధికారులు దీనిని అడ్డుకొనే టెక్నాలజీ వినియోగించడం మొదలుపెట్టారు. ఫలితంగా ఉగ్రవాదుల శాటిలైట్‌ ఫోన్ల కదలికలపై దళాలకు కచ్చితమైన సమాచారం లభించడం మొదలైంది. దీంతో ఉగ్రవాద నిరోదక ఆపరేషన్లు వేగవంతమయ్యాయి. 

ఆ ఎనిమిది తాలూకాలే..

కశ్మీర్‌ లోయలో రైస్‌బౌల్‌గా పేరున్న పుల్వామాలో మొత్తం ఎనిమిది తాలూకాల్లో ఉగ్రవాదానికి భారీగా మద్దతు లభిస్తోంది. పుల్వామా, పామ్‌పొరా, రాజ్‌పొరా, కాకాపొరా, త్రాల్‌, షహోరా, అవంతిపురా, అరిపాల్‌ ప్రాంతాలు కరడుగట్టిన ఉగ్రవాద స్థావరాలుగా మారిపోయాయి. సైన్యం కూడా ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీంతో ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్లు తరచూ చోటుచేసుకుంటాయి. లష్కరే తోయిబా కశ్మీర్‌ చీఫ్‌ అబూ ఖాసీంను దళాలు ఇక్కడే మట్టుబెట్టాయి. అప్పట్లో అల్లరి మూకలు భారీ ఎత్తున భద్రతా దళాలపై దాడులకు దిగేవి.

పుల్వామా, అవంతిపురా పోలీస్‌ డివిజన్లు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా పుల్వామాలో ఉగ్రదాడులు, బ్యాంక్‌ దోపిడీలు, దళాల నుంచి ఆయుధాలు లాక్కొనే సంఘటనలు, సైనిక దళాల కాన్వాయ్‌లను, క్యాంపులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం రివాజు. ఇక్కడ సీఆర్‌పీఎఫ్‌పై భారీ దాడులు చోటుచేసుకొన్నాయి. అందుకే కమరాయ్‌ పొరా, కరీమాబాద్‌, సంబూరా, లెల్‌హార్‌, తహబ్‌, అగ్లార్‌, లిట్టర్‌, బమ్ను, కోయిల్‌ ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు భద్రతా దళాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ముఖ్యంగా స్థానికుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనతోనే ఇబ్బంది. ఉగ్రవాదులను భద్రతా దళాలు తేలిగ్గా ఎదుర్కొంటాయి. కానీ ఆ తర్వాత అల్లరి మూకల దాడుల కారణంగా అమాయాక ప్రజలు గాయాల పాలవుతుంటారు.

2016లో హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఈ ప్రాంతం నుంచి ఏడాదిలో దాదాపు 90 మంది ఉగ్రవాదులుగా మారినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల అంచనా. మరోపక్క విదేశీ ఉగ్రవాదులకు పుల్వామా జిల్లా అతిథ్య ప్రాంతం. సమీపంలోని బుద్గామ్‌ జిల్లాలోని పఖర్‌పొరా నుంచి వారు పుల్వామాలోకి ప్రవేశించి ఆశ్రయం పొందుతుంటారు. ఈ జిల్లాలో విస్తరించి ఉన్న యర్వాన్‌ అరణ్యాలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉపయోగపడతాయి. వీరికి దళాల కదలికలను ఎప్పటికప్పుడు అందజేయడానికి ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో కొరియర్లు ఉన్నారు.  దీంతోపాటు దళాలు వచ్చినప్పుడు ఉగ్రవాదులు తేలిగ్గా బుద్గామ్‌ లేదా అనంతనాగ్‌, షోపియన్‌ ప్రాంతాలకు పారిపోయేలా సాయం చేస్తారు. అందుకే ఇప్పుడు భారత్‌ భద్రతా దళాలు ఉగ్రవాదుల పుట్టగా పేరున్న పుల్వామాపై దృష్టిపెట్టాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.