close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 12/02/2020 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్లాప్‌లు వచ్చినప్పుడు వాళ్లిద్దరూ అండగా ఉన్నారు!

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో తనంటే నాకు నచ్చదు

అల్లరి చేసే కొంటె కుర్రాడు.. అమాయకంగా కనిపించే అందాల కుర్రది.. ఒక సినిమాలో నటించారు. ఒక్కటైపోయి పెళ్లి చేసుకున్నారు. తమకంటూ ఒక ‘కొత్త బంగారులోకా’న్ని సృష్టించుకుని, ‘హ్యాపీడేస్‌’ను షేర్‌ చేసుకుంటున్నారు. వారే వరుణ్‌ సందేశ్‌, వితిక. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తమ ప్రేమ, పెళ్లి, బిగ్‌బాస్‌ షో.. ఇలా అనే విశేషాలను పంచుకున్నారు. 

మనం కలిసి మూడేళ్లు అవుతోందా?

వరుణ్‌ సందేశ్‌: అవును! మూడేళ్ల కిందట అమెరికాలో మా ఇంటికి వచ్చారు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఆ రోజు వితిక అప్పటికప్పుడు మంచి భోజనం చేసి పెట్టింది. ఎప్పటికీ మర్చిపోలేను)

మీ అసలు పేరు ఏంటి?

వితిక: కీర్తి. జాతకం ప్రకారం ‘వి’తో పెట్టాలని వితిక అని పెట్టారు. 

ఎవరిని ఎవరు చూస్తే చెమట పడుతుంది?

వరుణ్‌ సందేశ్‌: నాకు మామూలుగానే పడుతుంది. నేనంటే తను అస్సలు భయపడదు. నాకు కాస్త భయం. 

వితిక: ‘బిగ్‌బాస్‌’ అయిపోయి చాలా రోజులవుతోంది. ఆ మూడ్ నుంచి బయటకు రా. (నవ్వులు)

మీ మొదటి సినిమా ఏది?

వరుణ్‌ సందేశ్‌: ‘హ్యాపీడేస్‌’తో వెండితెరకు పరిచయం అయ్యా. ఆ తర్వాత ‘కొత్త బంగారులోకం’ మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ఎందుకు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది?

వరుణ్‌ సందేశ్‌: రెండు, మూడు సినిమాల తర్వాత నేను చేసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. నా నిర్ణయాలు సరిగా లేవు. వచ్చిన కొద్ది ఆఫర్లలో కూడా కొన్ని సెట్స్‌దాకా వెళ్లలేదు. ఈ సమయంలో ఏది చేసినా తప్పవుతుందేమోనని గ్యాప్‌ తీసుకున్నా. వితికతో పెళ్లి అయిన తర్వాత ‘నువ్వు చేస్తే మంచి సినిమా చెయ్‌. డబ్బులు తీసుకోకపోయినా పర్వాలేదు’ అని చెప్పింది. కొన్ని కథలు విన్నా, అవి చేస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనని తర్జనభర్జన పడ్డా. మధ్యలో ఎస్‌ఏపీ కోర్సు చేశా. సాఫ్ట్‌వేర్‌ రంగంవైపు వెళ్దామని అనుకున్నా. రెస్టారెంట్‌ ఓపెన్‌ చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టి మధ్యలో ఆపేశాం. ఇలా చాలా తికమకగా ఉండేది. అప్పుడు సుధాకర్‌ హీరోగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించా. 

మీ ప్రేమను పెద్దలు అంగీకరించారు కాబట్టి, పెళ్లి జరిగింది. ఒక వేళ పెద్దలు ఒప్పుకోకపోతే ఏం చేసేవాళ్లు?

వరుణ్‌ సందేశ్‌: నేను అసలు అలా ఆలోచించలేదు. పెళ్లికి ముందే వితిక తల్లిని కలిశాను. ఆమె నాతో బాగా మాట్లాడేవారు. మా తల్లిదండ్రులు వితికను కలవగానే తమ కోడలిగా ఫిక్స్‌ అయ్యారు. దీంతో మాకు పని మరింత సులభమైంది. 

వితిక: పెళ్లి గురించి కూడా చెప్పలేదు. కేవలం మా రిలేషన్‌ గురించి చర్చ జరుగుతుండగానే పెళ్లి చేసేద్దామని పెద్ద వాళ్లు అనుకున్నారు. 

వరుణ్‌ సందేశ్‌: మొదట్లో మాకూ పెళ్లి చేసుకోవాలని లేదు. తను ప్రపోజ్‌ చేయడంతో నాకు నచ్చి సరేనన్నా. ‘మనం పెళ్లి చేసుకుంటేనే ఈ రిలేషన్‌షిప్‌ను కొనసాగిద్దాం’ అని అనడంతో అందుకు నేను కూడా ఒప్పుకొన్నా.

మీరు అమెరికన్‌ సిటిజన్‌ కదా! మొదట్లో తెలుగు అస్సలు వచ్చేది కాదు కదా?

వరుణ్‌ సందేశ్‌: అవును! ‘బిగ్‌బాస్‌’కు వెళ్లొచ్చిన తర్వాత రాహుల్‌, శివజ్యోతిల పరిచయంతో తెలంగాణ యాస కూడా మాట్లాడుతున్నా. 

మీ స్వస్థలం ఏది?

వరుణ్‌ సందేశ్‌: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు దగ్గర బల్లిపాడు. వితికది భీమవరం.

మీరిద్దరూ తొలిసారి ఎక్కడ కలిశారు?

వితిక: ‘పడ్డానండీ ప్రేమలో మరి’ అని ఓ సినిమా చేశాం. అక్కడ వరుణ్‌ను కలిశా.

వరుణ్‌ సందేశ్‌: ఆ సినిమాలో తనని ఎత్తుకుని పరిగెత్తాలి. అనుకోకుండా ఒక గుంతలో పడి నా కాలు జారిపోయింది. అంతే పైనుంచి తనని కిందకు వదిలేశా. వితిక నడుముకు బాగా దెబ్బ తగిలింది. దాంతో షూటింగ్‌ పేకప్‌ చెప్పేశారు. ‘అయ్యో నా వల్ల తనకి దెబ్బ తగిలింది’ అని బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు తొలిసారి తన నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేసి మాట్లాడా.

రియల్‌ లైఫ్‌లో ఎవరి డామినేషన్‌ ఎక్కువగా ఉంటుంది?

వరుణ్‌ సందేశ్‌: మీకు తెలుసు కదా! తనే నా బాస్‌. బిగ్‌బాస్‌(నవ్వులు) 

మీ తండ్రి ఏం చేస్తారు?

వరుణ్‌ సందేశ్‌: ఆయన ఐటీ కంపెనీలో పనిచేస్తారు. అమ్మ గృహిణి. చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తారు. నా 9వ సంవత్సరం నుంచి న్యూజెర్సీలోనే ఉండేవాడిని. ఇటీవల మా తల్లిదండ్రులు డాలస్‌కు మారారు.

వితిక: నాకు తండ్రి లేరు. అంతా మా అమ్మే. ఇప్పుడు మా అమ్మ మాతోనే ఉంటారు. 

నీ భార్యతో కంటే ప్లేస్టేషన్‌తోనే ఎక్కువగా గడుపుతావట!

వరుణ్‌ సందేశ్‌: వీడియో గేమ్స్‌ బాగా ఆడతా. అయితే, బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చిన తర్వాత అసలు టచ్‌ చేయలేదు. ‘కొత్త గేమ్‌ వచ్చింది. తీసుకుందామా’ అని అడిగితే, అలా ఒక లుక్‌ ఇచ్చింది. దాంతో వద్దులే అని చెప్పేశా. 

పిల్లలు పుట్టిన తర్వాత కదా గేమ్స్‌ కొనిపెట్టమని అడుగుతారు. మరి నువ్వేంటి ఇప్పుడే అడుగుతున్నావ్‌?

వరుణ్‌ సందేశ్‌: పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనకి ఎప్పటికీ నేను పిల్లాడినే (నవ్వులు)

ఇప్పటికీ మీ ఆవిడే నీకు భోజనం తినిపిస్తుందట!

వరుణ్‌ సందేశ్‌: నిజం చెప్పాలంటే తనే నా జీవితం. నన్ను ఒక పిల్లాడిలా చూసుకుంటుంది. తన సపోర్ట్‌ లేకపోతే ఇక్కడ ఉండేవాడిని కాదు. బయట ఉంటే అటూ ఇటూ తిరుగుతాం. కానీ ‘బిగ్‌బాస్‌’లో 90 రోజుల పాటు తను నాతోనే ఉంది. దాంతో మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది.

నీ భార్య కోసం ప్రత్యేకంగా పాటలు పాడతారట!

వరుణ్‌ సందేశ్‌: అప్పుడప్పుడూ పాడుతూ ఉంటా. నాగార్జున గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. ‘నేను నేనుగా లేని నిన్న మొన్నలా.. లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా..’ పాట తనకోసం పాడుతూ ఉంటా.

భార్యాభర్తలుగా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు. 

వితిక: తనకి వందకు వంద మార్కులు వేస్తా! అయితే నటుడిగా అయితే 80 మార్కులు ఇస్తా. 

వరుణ్‌ సందేశ్‌: నేను తనకైతే వందకు నూట పది మార్కులు వేస్తా(నవ్వులు) 

మీరు మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?

వితిక: తమిళ, కన్నడ, తెలుగు కలిపి ఆరు సినిమాలు చేశా.

వరుణ్‌ సందేశ్‌: దాదాపు 20కు పైగా చేశా. 

‘మరో చరిత్ర’ అనే టైటిల్‌ పెట్టుకుని ‘నేను ఈ సినిమా చేయడం కరెక్టా’ అనిపించలేదా? 

వరుణ్‌ సందేశ్‌: అది మంచి స్క్రిప్ట్‌. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, దిల్‌రాజుగారు కూడా భాగస్వాములు అయ్యారు. మ్యూజిక్‌ విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. అయితే, మనం అనుకున్నట్లు అన్నీ జరగవు కదా! ‘కుర్రాడు’ కూడా రీమేక్‌. తమిళంలో పెద్ద హిట్‌. ఎందుకో ఇక్కడ ఆడలేదు.

కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడమా? లేక ‘కథ మానాన్న గారికి చెప్పండి. ఆయన ఓకే అంటే సినిమా చేస్తా’ అని కొందరితో చెప్పినట్లు విన్నాం. నిజమేనా?

వరుణ్‌ సందేశ్‌: అవును! ‘హ్యాపీడేస్‌’ విడుదలైనప్పుడు నాకు 18 ఏళ్లు. అప్పుడు నాకు జడ్జిమెంట్‌ తెలియదు. దాంతో మా నాన్నగారు కథలు వినేవారు. అయితే, ఆయనకు కూడా వీటిపై పూర్తి అవగాహన లేదు. అలా మేం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పి, చాలా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. సక్సెస్‌ విలువేంటో కూడా నాకు తెలియదు. ఆ రెండు సినిమాలు హిట్టయిన తర్వాత ఏం నేర్చుకున్నానో కూడా తెలియదు. నేను అపజయాలు ఎదుర్కొన్న తర్వాత ఎన్నో నేర్చుకున్నా. మనతో ఎవరున్నారు? ఎవరు తప్పించుకున్నారు? ఇవన్నీ తెలిశాయి. ప్రతి రంగంలో జయాపజయాలు ఉంటాయి. రెండింటినీ పాజిటివ్‌గానే చూశా. 

ఇండస్ట్రీలో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలకు లైఫ్‌ ఎక్కువగా, క్లాస్‌ హీరోలకు తక్కువగా ఉంటుందని అంటారు. నీ అభిప్రాయం ఏంటి?

వరుణ్‌ సందేశ్‌: క్లాస్‌, మాస్‌ అని కాకుండా ఒక మంచి సినిమా తీస్తే 100శాతం అందరూ చూస్తారు. 

‘భీమిలి కబడ్డీ జట్టు’ కథ మొదట నీ దగ్గరకు వచ్చిందట!

వరుణ్‌ సందేశ్‌: నాకు అసలు గుర్తు లేదు. అలా ‘100% లవ్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి రెండు మూడు సినిమాలు పోయాయి. మనకు రాసి పెట్టి లేదు అంతే. 

వరుణ్‌ నటించిన సినిమాల్లో నీకు బెస్ట్‌ అనిపించిన సినిమా ఏంటి?

వితిక: ‘ప్రియతమా.. నీవచట కుశలమా’. స్టోరీ చాలా బాగుంటుంది. కానీ, ఆడియెన్స్‌కు చేరలేకపోయింది. మంచి ప్రేమ కథ.

వరుణ్‌లో నీకు నచ్చని, నచ్చిన అంశం ఏంటి?

వితిక: నన్ను బాగా ఇరిటేట్‌ చేస్తాడు. అది నాకు అస్సలు నచ్చదు. ఇక తను చాలా అమాయకుడు. అన్నీ నమ్మేస్తాడు. మేం కలిసిన కొత్తలో పాల ప్యాకెట్‌ తీసుకురమ్మని రూ.100 ఇచ్చాడు. రూ.20 ప్యాకెట్‌ కోసం రూ.100 ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. తను వంద రూపాయలు అనుకున్నాడట. 

వరుణ్‌కు ఒడిశాకు సంబంధం ఏంటి?

వరుణ్‌ సందేశ్‌: నేను పుట్టింది ఒడిశాలో. అమ్మమ్మ, తాతయ్య ఒడిశాలో ఉండేవారు. తాతయ్య కాలేజ్‌ ప్రొఫెసర్‌. నేను అక్కడే పుట్టా. 1989 జులైలో నేను పుట్టినప్పుడు విపరీతంగా వర్షాలు పడ్డాయి. అందుకే నా పేరు వరుణ్‌ సందేశ్‌ అని పెట్టారు. వరుణ దేవుడు పంపిన సందేశం అన్న అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారు. నెలరోజులు పిల్లాడిగా ఉండగా హైదరాబాద్‌ వచ్చేశాం. మళ్లీ నేను వెళ్లలేదు. 

కిరణ్‌రావ్‌ ఫోన్‌ చేశారట!

వరుణ్‌ సందేశ్‌: ‘హ్యాపీడేస్‌’ తర్వాత ఆమీర్‌ఖాన్‌గారి భార్య కిరణ్‌రావ్‌ ఫోన్‌ చేసి ‘దోభీఘాట్‌’ సినిమా చేయాలని అడిగారు. నాకు హిందీ పెద్దగా రాదని చెప్పా. అయినా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. 

ఇప్పుడు కథ చెబితే ఎవరు వింటారు?

వితిక: నేను ఎందుకు వింటాను (నవ్వులు) నాకు అస్సలు సంబంధం లేదు. ఒక సినిమా హిట్‌.. ఫ్లాప్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో ఉంటుంది. చేసే ముందు మనకు నచ్చాలి కదా! ఆ చిన్న సలహా తప్ప నేను పెద్దగా కలగజేసుకోను. 

‘మిస్టర్‌ పెళ్లాం’లో రాజేందప్రసాద్‌ కొడుకుగా నిన్ను అనుకున్నారా?
వరుణ్‌ సందేశ్‌: అవును! అప్పుడు చేయాల్సింది. అంతా ఫైనలైజ్‌ అయిపోయింది. అదే సమయంలో మా నాన్నగారికి యూఎస్‌లో జాబ్‌ వచ్చింది. దాంతో ఫ్యామిలీ అంతా వెళ్లాల్సి వచ్చింది. 

హీరో సిద్ధార్థ్‌కు రీప్లేస్‌మెంట్‌ వరుణ్‌ అని టాక్‌ ఉండేది నిజమేనా?

వరుణ్‌ సందేశ్‌: అయ్యో.. ఆయన నాకన్నా వయసులోనూ, నటనలోనూ పెద్దవాడు. నాకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్లు ఉన్నాయి.

వరుణ్‌ సందేశ్‌ తల్లిదండ్రులు నీతో ఎలా ఉంటారు?

వితిక: నాకు తండ్రిలేరు. నాకు ఐదేళ్లు ఉండగానే మా తల్లిదండ్రులు విడిపోయారు. కొన్ని సందర్భాల్లో ‘నాన్న ఉంటే బాగుండేదేమో’ అనిపించేది. వరుణ్‌ను కలిసిన తర్వాత ఆ బాధ పోయింది. మా మావయ్యగారు నన్ను సొంత కూతురికన్నా ఎక్కువగా చూసుకుంటారు. మా అత్తగారు చాలా బాగా చూసుకుంటారు.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నీ కెరీర్‌ను ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నావు?

వరుణ్‌ సందేశ్‌: నా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు చూశా. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు షాపులో ట్రాలీలు నెట్టే పనిచేసేవాడిని. క్యాషియర్‌గానూ చేశాను. ఆ తర్వాత ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారులోకం’ సినిమాలతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నా గ్రాఫ్‌ పడిపోయింది. అలాంటి సందర్భాల్లోనూ ఇద్దరు వ్యక్తులు నాతో ఉన్నారు. ‘డి ఫర్‌ దోపిడీ’ అనే సినిమా చేస్తే దిల్‌రాజుగారు వచ్చి దాన్ని తీసుకుని డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మరొక వ్యక్తి ‘అల్లరి’ నరేష్‌. తను ఇచ్చిన సపోర్ట్‌ మర్చిపోలేను.

అనుకున్న సినిమా ఆగిపోతే తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేసేవారట!

వరుణ్‌ సందేశ్‌: అవునండీ! ఆ నిర్ణయం మా నాన్నగారిది. చాలా సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేశారు. 

మీ ఇంట్లో మీరు ఒక్కరేనా?

వరుణ్‌ సందేశ్‌: నాకు ఒక చెల్లెలు ఉంది. తను మెడిసన్‌ చదువుతోంది. వాళ్లు ఫ్లోరిడాలో ఉంటారు. 

మీ కుటుంబంలో మీరు ఎంతమంది?

వితిక: అమ్మా.. నాకు ఒక చెల్లి. 

ఒకరినొకరు ఒక కూరగాయతో పోల్చమంటే దేనితో పోలుస్తారు?

వితిక: పచ్చి మామిడి కాయ

వరుణ్‌ సందేశ్‌: ఎర్ర మిరపకాయి. చాలా ఫైర్‌ ఉంటుంది.

మీ ఆయన్ను చూసి అవాక్కయిన విషయం ఏంటి?

వితిక: పరిచయం అయిన కొత్తలో మీద చేయి వేసి మాట్లాడితే దూరంగా జరిగిపోయేవాడు. 

నువ్వు కోపంలో ఉంటే వరుణ్‌ ఏమని కూల్‌ చేస్తాడు?

వితిక: ‘సారీ అమ్మా..’ అంటాడు.

వరుణ్‌ సందేశ్‌: మొదట సారీ చెబుతా. తర్వాత ప్లీజ్‌ క్షమించు అంటా.. ఇక చివరికి కాళ్లు పట్టుకుంటా. 

నీకు పెళ్లయిపోయిన తర్వాత ప్రపోజల్స్‌ ఏవైనా వచ్చాయా?

వరుణ్‌ సందేశ్‌: ఎలా వస్తాయి? పెళ్లయిన విషయం అందరికీ తెలుసి పోయింది కదా! 

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో మీకు నచ్చని, నచ్చిన వ్యక్తి?

వితిక: శివజ్యోతి. అందరూ ఇష్టమే కానీ, ఒక సమయంలో తను నాకు నచ్చలేదు. నాకు బాగా నచ్చిన వ్యక్తి పునర్నవి.

వరుణ్‌ సందేశ్‌: నాకు రాహుల్‌ బాగా క్లోజ్‌ అయ్యాడు. బయట కూడా మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం.

వితికతో పెళ్లి కాకుండా ఉంటే ఏ హీరోయిన్‌ను పెళ్లి చేసుకునేవాడివి? 

వరుణ్‌ సందేశ్‌: నాకు దీపిక పదుకొణె అంటే చాలా ఇష్టం. తెలుగులో ఇలియానా ఇష్టం. ‘ఏమైందీ ఈ వేళ’ అనే సినిమాకు అవార్డు వస్తే, ఇలియానా చేతుల మీదుగా తీసుకున్నా. నేను చాలా చాలా హ్యపీ ఫీలయ్యా.

వితిక చేసే వంట్లో ఏదంటే బాగా ఇష్టం?

వరుణ్‌ సందేశ్‌: అన్నీ బాగానే చేస్తుంది. మజ్జిగ పులుసు చాలా బాగా చేస్తుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.