close

తాజా వార్తలు

Published : 06/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. సారలమ్మ.. వచ్చెనమ్మా

మేడారం మహా జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అర్ధ రాత్రి 12.25 గంటల సమయానికి చిన్నమ్మ గద్దెపై కొలువుదీరారు. ఉదయం నుంచి భక్తులు ఎత్తు బెల్లాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటూ ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. గురువారం సమ్మక్కను తీసుకొచ్చే ముఖ్య తంతు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కోచ్‌ ఫ్యాక్టరీ లేదు.. కొత్త ప్రాజెక్టులూ లేవు

అసలే రైల్వే నెట్‌వర్క్‌ తక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపుల్లో ఏ మాత్రం ప్రాధాన్యం లభించలేదు. కొత్త లైన్ల జోలికి వెళ్లలేదు.. నూతన రైళ్లు, సర్వేల ఊసే లేదు.. చిరకాల డిమాండైన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరుకూ కేంద్రం ముందుకు రాలేదు. భారీ ప్రాజెక్టులేవీ ఇవ్వకుండా.. పాత వాటికే గతంలో కంటే కొన్ని నిధుల్ని అధికంగా విదిల్చారు. జోన్లవారీగా కేటాయింపుల వివరాలతో ‘పింక్‌ బుక్‌’ను రైల్వే శాఖ బుధవారం విడుదల చేసింది. పూర్తిగా తెలంగాణ పరిధిలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు రాకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఈ ఏడాది విశాఖ జోన్‌ అసాధ్యమే!

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సరళిని చూస్తే రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఈ ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లనూ ఎక్కడా పేర్కొనలేదు. జోన్లవారీగా కేటాయింపుల వివరాలతో ‘పింక్‌ బుక్‌’ను రైల్వే శాఖ బుధవారం విడుదల చేసింది. ఏపీ రాజధాని అమరావతి అనుసంధాన రైల్వే ప్రాజెక్టుకు తాజా కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి నిధులూ కేటాయించలేదని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘హాజీపూర్‌’ కేసులో తుది తీర్పు నేడే

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ‘హాజీపూర్‌’ కేసులో నేడు తుది తీర్పు వెల్లడి కానుంది. ఇరవై ఏళ్లు కూడా నిండని ముగ్గురు అమ్మాయిలను అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి కిడ్నాప్‌, అత్యాచారం, హత్య చేయడంపై గతేడాది ఏప్రిల్‌లో మూడు కేసులు నమోదైన విషయం విదితమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల

తెలుగు మాధ్యమం కావాలని కోరితే మండలానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని/ కొనసాగిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది. విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ఆ పాఠశాల దూరంగా ఉంటే విద్యార్థులకు ఉచిత రవాణా కల్పిస్తామని తెలిపింది. ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా మాధ్యమ (లింగ్విస్టిక్‌ మైనార్టీ) పాఠశాలలను కొనసాగిస్తామని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం అమరావతి నుంచి విశాఖకు

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో కేటాయించిన భూములకు అటవీశాఖ రెండోదశ అనుమతులు రాలేదన్న కారణంతో విశాఖలో ప్రత్యామ్నాయ భూములు కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వినియోగదారుల్ని ఇబ్బంది పెడితే సహించం

వినియోగదారుడిని ఇబ్బంది పెడితే సహించేది లేదని ఫోరం-2 మరోసారి స్పష్టం చేసింది. వినియోగదారుడికి ఊరట కలిగించేలా తీర్పులను వెలువరించింది. ప్రకటనల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వినియోగదారుడిని మోసం చేసినందుకు పరిహారంగా రూ.20 వేలు చెల్లించాలని ఎయిర్‌టెల్‌ సంస్థను ఫోరం-2 ఆదేశించింది. వినియోగదారుడు కొనుగోలు చేసిన పుస్తకంపై ధర ముద్రించని పెంగ్విన్‌ బుక్స్‌ ఇండియా, గోప్సన్స్‌ సంస్థలపై హైదరాబాద్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రూ.65,544 కోట్లతో ‘మహా’ ఓడరేవు

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటుకు విముఖత చూపిన కేంద్ర ప్రభుత్వం... మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ (జేఎన్‌పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్‌ వద్ద దీని నిర్మాణం చేపడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఏడాది బాలుడికి రూ. 7 కోట్ల లాటరీ

భారత్‌కు చెందిన ఏడాది వయసున్న బాలుడు లాటరీ టికెట్‌లో జాక్‌పాట్‌ కొట్టేశాడు. యూఏఈలో ఆ బాలుడి పేరు మీద తండ్రి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ 1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) గెలుచుకుంది. భారత్‌కు చెందిన రమీస్‌ రహ్మాన్‌ దుబాయ్‌కి చెందిన లాటరీ టికెట్‌లను ఏడాదిగా కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు మహ్మద్‌ సలాహ్‌షా పేరు మీద టికెట్‌ కొన్నాడు. మంగళవారం తీసిన నెలవారీ డ్రాలో రహ్మాన్‌ టికెట్‌ 1 మిలియన్‌ డాలర్లను గెలుచుకున్నట్లు గల్ఫ్‌ న్యూస్‌ పత్రిక వెల్లడించింది.

10. కోహ్లి @ 1690 కోట్లు

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్‌ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. ద డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్‌ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ (రూ.163 కోట్లు) కన్నా కోహ్లి బ్రాండ్‌ విలువ పది రెట్లు ఎక్కువ. రూ.743 కోట్లతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ రెండో స్థానంలో ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.