close

తాజా వార్తలు

Published : 03/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. పాలన ప్రక్షాళన

పరిపాలన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్‌ అధికారులు, జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది అధికారులకు స్థాన చలనం కలిగింది. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం కదిలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. వెనుకబడిన కులాలకు భవనాలు

తెలంగాణ రాష్ట్రంలోని 79 వెనుకబడిన కులాల కోసం భూమిని కేటాయించి, అందులో సంబంధిత సంఘాల భవనాలను నిర్మించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పెరిక కులసంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులుగా ఎదగాలంటే ఏ కులం అక్కర్లేదని, ప్రజల మనసు గెలవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. త్వరలో పోలీసు కొలువుల భర్తీ!

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసుశాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11వేల పోస్టులున్నాయి. తొలి దశలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై ఈ నెల మూడో వారం తర్వాత స్పష్టత రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశాఖలో సర్కారుకు భూముల పంట!

బిల్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కింద ప్రభుత్వ భూముల వివరాల సేకరణ కొనసాగుతోంది. పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ నగరం చుట్టుపక్కల సుమారు 4వేల ఎకరాల విలువైన సర్కారు భూములున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర జిల్లాల్లో కంటే విశాఖలోనే విలువైన భూములు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మిర్చి రైతుకు కరోనా దెబ్బ

కరోనా వైరస్‌ మిరప రైతుల్ని వణికిస్తోంది. చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో.. వారం వ్యవధిలోనే ధరలు క్వింటాలుకు రూ.4వేల వరకు పడిపోయాయి. నెలన్నర క్రితంతో పోలిస్తే మొత్తంగా రూ.8వేల వరకు తగ్గింది. వాతావరణ సమస్యలు, తెగుళ్ల కారణంగా మూడింట రెండొంతులు తాలు కాయ రావడంతో ఇప్పటికే తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగం పాలిట ఈ వైరస్‌ పిడుగుపాటులా పరిణమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దారికాచిన మృత్యువు

తెలంగాణలోని పలు రహదారులపై ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్‌ స్పాట్స్‌) సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రమాద మృతుల సంఖ్యా పెరుగుతోంది. అలాంటిచోట్ల దిద్దుబాటు చర్యలు మాత్రం ఉండడంలేదు. తాజాగా పోలీసులు గుర్తించిన 485 ప్రమాదకర ప్రాంతాల్లో రహదారులు-భవనాల శాఖ పరిధిలోనివి 314గా గుర్తించారు. మిగిలిన 171 ప్రాంతాల్లో జాతీయ రహదారుల సంస్థ పరిధిలో ఉన్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాలకు దిద్దుబాటు చర్యలు ఎప్పుడు చేపడతారన్నది అధికారులకే తెలియాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారు

‘నిర్భయ’ హత్యాచారం కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న నలుగురు దోషులకు ఇక ఏమాత్రం సమయం ఇవ్వరాదని కేంద్రం దిల్లీ హైకోర్టును కోరింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల సంయుక్త అభ్యర్థనపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. మరణ శిక్ష అమలును నలుగురు దోషులూ బాగా ఆలోచించి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. వారు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని, న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్నారని అన్నారు. వాదనల అనంతరం కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఖర్చు చేయండహో..

‘దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి.. అందుకోసం పన్ను శ్లాబులు కాస్త తగ్గించి, వారి దగ్గర ఖర్చు చేసే మొత్తం పెంచాలి..’ ఇదీ నిర్మలా సీతారామన్‌ కొత్త బడ్జెట్‌ నుంచి చాలామంది కోరుకున్నది.. కానీ, ఆర్థిక మంత్రి మరోలా వ్యవహరించారు. ‘ప్రజలు పొదుపు చేయడం మానేసి, ఖర్చు చేస్తే సరిపోతుంది’ అనే కొత్త సూత్రానికి నాంది పలికారు. ఆదాయాన్ని జమ చేస్తూ కాలం వెళ్లదీసే సగటు వేతన జీవికి ఇక నుంచి వచ్చినదంతా ఖర్చు చేసినా ఏమవుతుందిలే అనే  ఒక భావన వచ్చే ప్రమాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మిడతల దండయాత్ర

ప్రపంచాన్ని కరోనా తర్వాత అంతగా బంబేలెత్తిస్తున్నది మిడతలదాడి. ప్రస్తుతం మిడతల దాడికి ఆఫ్రికా విలవిలలాడుతోంది. ఇది 25 ఏళ్లలో కనీవినీ ఎరుగని దాడి అని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) తెలిపింది. ఇప్పటికే భారత్‌లో రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌లో 3.5 లక్షల హెక్టార్లలో పంటను ఈ కీటకాలు నాశనం చేశాయి. భారత ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో వాటి కట్టడికి చర్యలు చేపట్టింది. 1993 తర్వాత ఇంత భారీ స్థాయిలో మన దేశంపై మిడతలు దాడి చేయడం ఇదే మొదటిసారి. యెమన్‌, సోమాలియా, సూడాన్‌ల నుంచి పాకిస్థాన్‌ గుండా ఇవి భారత్‌కు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. టాంజానియాలో  తొక్కిసలాట: 20మంది మృతి

టాంజానియాలోని ఉత్తర ప్రాంతంలో జరిగిన ఇవలాంజికల్‌ చర్చి బహిరంగ ప్రార్థన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. ప్రముఖ మత ప్రచారకుడు బొనిఫేస్‌  ప్రార్థన కార్యక్రమంలో భాగంగా పవిత్ర తైలాన్ని నేలపై పోశారు. ఈ తైలాన్ని తాకితే రోగాలు మటుమాయం అవుతాయని విశ్వసించే భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.