close

తాజా వార్తలు

Published : 31/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. ఏప్రిల్‌ 3 వరకు ఇవి కొనసాగుతాయి. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడతారు. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేడూ, రేపూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె

తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు శుక్ర, శనివారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ)తో జరిపిన తాజా చర్చలు విఫలమవడంతో సమ్మె విషయంలో ముందుకెళ్లాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించింది. వేతన సవరణ, పనిదినాల కుదింపు, మూల వేతనంలో ప్రత్యేక భత్యం విలీనం తదితర అంశాలపై ఐబీఏతో యూనియన్లు చర్చలు జరిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. చిన్నారులను బంధించి.. చివరికి హతమై..

యూపీలోని ఫరుఖాబాద్‌ జిల్లాలో 20 మంది చిన్నారులను బందీలుగా చేసుకున్న కలంకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్చి చంపారు. అనంతరం పిల్లలందర్ని పోలీసులు ఆ ఇంటి నుంచి సురక్షితంగా బయటకుతీసుకొచ్చారు. సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన కుమార్తె జన్మదిన వేడుకల పేరుతో గురువారం చుట్టుపక్కల ఇళ్ల నుంచి 20 మంది చిన్నారులను ఆహ్వానించి బందీ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘గిరి’ కొత్త బ్రాండ్‌ హానీట్విగ్స్‌

సాస్‌, కెచప్‌ల స్థానంలో పిల్లలు, పెద్దలకు సహజ సిద్ధమైన పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మార్కెట్‌లోకి హానీట్విగ్స్‌ (తేనె సాచెట్స్‌) తీసుకొచ్చింది. ఉదయం వేళల్లో టీ, బిస్కెట్‌, బ్రెడ్‌తో కలిపి తీసుకునేందుకు వీలుగా వీటిని రూపొందించింది. గిరి పేరిట ఈ ఉత్పత్తులను మంత్రి సత్యవతి రాఠోడ్‌, గిరిజన సంక్షేమాధికారులు మహేష్‌దత్‌ ఎక్కా, క్రిస్టీనా విడుదల చేశారని జీసీసీ జనరల్‌ మేనేజర్‌, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌ రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. భీమిలిలో భూచోళ్లు

ఏపీ పాలనా రాజధానిగా ప్రచారమవుతున్న విశాఖలోని భీమిలి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా  రూ.కోట్లలో పలుకుతోంది. అలాంటి చోట దేవాదాయశాఖకు చెందిన    విలువైన భూములను తక్కువ లైసెన్సు ఫీజుతో కొట్టేసేందుకు కొందరు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వార్త కో్సం క్లిక్‌ చేయండి 

6. శంకర్‌కు భూకేటాయింపుపై హైకోర్టు నోటీసులు

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో.. సినీ దర్శకుడు, నిర్మాత ఎన్‌.శంకర్‌కు ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఆయనకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ఏడాది జూన్‌ 21న సర్కారు జారీ చేసిన జీవో నం.75ను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాలకు చెందిన జె.శంకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. నేటి అర్ధరాత్రి వరకు రుసుం చెల్లించొచ్చు

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసే వారంతా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల్లోపు పరీక్ష రుసుం చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 30 అర్ధరాత్రి 12 గంటల వరకు మొదట గడువు విధించినా దానిని అభ్యర్థుల విజ్ఞప్తిపై శుక్రవారం వరకు పొడిగించామని ఆయన వెల్లడించారు.

8. లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్‌ స్పందన

పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘‘నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలులాంటివి ఏమీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది’’అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఏడాదంతా ఆధ్యాత్మిక పర్యాటకం

రామాయణంలో ప్రస్తావించిన ప్రముఖ ప్రదేశాలన్నింటిని ఒకేసారి సందర్శించేందుకు ‘రామాయణ యాత్ర’ పేరుతో ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ప్రత్యేక టూర్‌ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ‘భారత్‌దర్శన్‌’ పర్యాటక రైలు ఇప్పటివరకు ఏడాదిలో 2, 3 నెలలే తెలుగురాష్ట్రాల పర్యాటకులకు అందుబాటులో ఉండేది. ఇకపై ఈ జనవరిలో వచ్చిన రైలు ఏడాది అంతా తెలుగు పర్యాటకులను వరుస యాత్రలకు తీసుకెళ్లనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. క్లీన్‌స్వీప్‌పై గురి

మూడో టీ20లో దాదాపు మ్యాచ్‌ చేజారినట్లే అనుకున్న సమయంలో భారత్‌ పుంజుకున్న తీరు అనూహ్యం! ఈ విజయం టీమ్‌ఇండియాకు ఎంత ఉత్సాహాన్నిచ్చి ఉంటుందో.. కివీస్‌ ఎంతగా నిరాశలో నెట్టి ఉంటుందో చెప్పేదేముంది? ఇప్పుడిక సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే లక్ష్యంతో టీమ్‌ఇండియా ఉంటే.. మిగతా రెండు మ్యాచ్‌లైనా గెలిచి పరువు దక్కించుకోవాలని, వన్డే సిరీస్‌ ముంగిట ఆత్మవిశ్వాసం తెచ్చుకోవాలని భావిస్తోంది ఆతిథ్య జట్టు. రెండు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారమే వెల్లింగ్టన్‌లో జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.