నా జీవితంలో అలాంటివి ఊహించలేదు!
close

తాజా వార్తలు

Updated : 28/01/2020 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా జీవితంలో అలాంటివి ఊహించలేదు!

ఇప్పుడు అలా సినిమా తీసే దర్శకుడు రాజమౌళి ఒక్కడే!

అతను కండగలవాడు.. గుండె కలవాడు.. అందగాడు.. అంతేకాదు, చక్కటి నవ్వు.. మన్మథుడిలాంటి రూపంతో వెండితెరపైకి దూసుకొచ్చాడు. కరాటే ఫైట్స్‌తో పాటు, తన మార్కు నటననీ చూపిస్తూ హిట్లు, సూపర్‌హిట్లతో దూసుకుపోయాడు. సినీ తెర ప్రేమికుడు.. సినీ భక్తజనానికి శ్రీ వేంకటేశ్వరుడు ఆయనే రియల్‌ హీరో సుమన్‌.. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..!

సుమన్‌ తల్వార్‌.. ఇంటి పేరు అదేనా?

సుమన్‌: అవును. తల్వార్‌ అంటే మీరనుకుంటున్నట్లు కత్తే. (నవ్వులు) (మధ్యలో ఆలీ అందుకుని.. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకురమ్మని మాకు వేలల్లో మెయిల్స్‌ వచ్చాయి. ఎట్టకేలకు మిమ్మల్ని తీసుకొచ్చాం.)

సినీ ఇండస్ట్రీకి వచ్చి 42ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు! మీ జర్నీ గురించి చెబుతారా?

సుమన్‌: థ్యాంక్యూ. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. మా తల్లిదండ్రుల స్వస్థలం ఉడిపి సమీపంలోని మంగళూరు. వాళ్లు ఉద్యోగం కోసం చెన్నై వచ్చి అక్కడ స్థిరపడ్డారు. తమిళ సినిమాల ద్వారానే నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. అయితే, 1981లో నా మిత్రుడు భానుచందర్‌ బలవంతం మీద తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రంలో నటించా. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యా. ఆ తర్వాత తమిళ, కన్నడ, భోజ్‌పురి సహా 9 భాషల్లో నటించా. తెలుగులో హీరోగా 100 సినిమాలు చేశా. అన్ని భాషల్లో కలిపి దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించా. 

మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు?

సుమన్‌: వాళ్లకు సినిమా ఇండస్ట్రీతో అసలు సంబంధమే లేదు. నాన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌. అమ్మ స్కూల్‌ ప్రిన్సిపల్‌. నేను అనుకోకుండా నటుడిని అయ్యా. మా కుటుంబానికి చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధాలు లేవు. అలాంటి నేను నటుడిని అయి, ఈ స్థాయికి రావడం నిజంగా దేవుడు ఇచ్చిన అదృష్టం. అప్పుడు అవకాశాలు రావడం కూడా కష్టమే. వచ్చినా అన్నీ అధిగమించి నిలబడటం అంత కన్నా కష్టం. అలాంటి చిత్ర పరిశ్రమలో 42ఏళ్లు కొనసాగా. అందుకు నా తల్లిదండ్రులు, ఆ దేవుడు, నా దర్శక-నిర్మాతలు, అభిమానులకు పాదాభివందనాలు.

సినిమాల్లోకి రావడానికి మీ కుటుంబ నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందింది?

సుమన్‌: మా ఇంట్లో నేను ఒక్కడినే. దాంతో మా ఇంట్లో చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ సమయంలో మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. అలాంటి వాతావరణంలో పెరిగా. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వెళ్లేందుకు మా అమ్మ నన్ను బాగా ప్రోత్సహించారు. అస్సలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని కుటుంబం నుంచి వచ్చి నటుడిని కావడం... డెస్టినీ అంటే ఇదేనేమో. 

ఇండస్ట్రీకి వచ్చే ముందు నటనకు సంబంధించి ఏదైనా కోర్సు చేశారా?

సుమన్‌: అస్సలు చేయలేదు. అయితే, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. ఈ సంవత్సరంతో 50ఏళ్లు పూర్తవుతాయి. చిన్నప్పటి నుంచి నాకు మార్షల్‌ ఆర్ట్స్‌అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌ మాత్రమే ఉండేవి. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ వచ్చిన తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. దాంతో వాటిపై ఆసక్తి ఏర్పడింది. నేను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు కరాటే నేర్చుకున్నా. ఆ తర్వాత పార్ట్‌టైమ్‌ కరాటే ట్రైనర్‌గా పనిచేశా. సినిమాల్లో నటిస్తున్న రోజుల్లోనూ శిక్షణ ఇచ్చేవాడిని. నా రియల్‌ లైఫ్‌కి, రీల్‌ లైఫ్‌కి మార్షల్‌ ఆర్ట్సే బలం. అందరూ సుమన్‌ సాఫ్ట్‌ అనుకుంటారు. కానీ, కాదు. మా ఇంటి పేరులోనే తల్వార్‌ ఉంది కదా! ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తా.  

షూటింగ్‌లో మీ చేతుల్లో ఎవరైనా నిజంగా దెబ్బలు తిన్నారా?

సుమన్‌: నా తొలి సినిమాకు ధర్మలింగం అనే ఫైట్‌ మాస్టర్‌ పనిచేశారు. ‘ఇతని పేరు సుమన్‌. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌’ అని పరిచయం చేశారు. వాళ్లు ‘కరాటే తెలిసిన తొలి హీరోకు పనిచేయడం చాలా సంతోషమండీ. మంచి ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తాం’ అన్నారు. అయితే, సినిమా ఫైట్స్‌ ఎలా చేస్తారో నాకు పెద్దగా తెలియదు. దాంతో అనుకోకుండా నా ఫస్ట్‌ ఫైట్‌ సీన్‌లో ఒకరి ముఖంపై కొట్టాను. అంతే అతని ఎదుటి ఐదు పళ్లు ఊడిపోయాయి. ఆ తర్వాత తెలిసింది అవి కట్టుడు పళ్లని. (నవ్వులు) అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఫైట్స్‌ చేసేవాడిని. అయితే, ఫైట్‌సీన్లలో నాకు చాలా దెబ్బలు తగిలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అవన్నీ పెద్దగా పట్టించుకోను.

మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు మ్యూజిక్‌ కూడా నేర్చుకున్నారట!

సుమన్‌: అవునండీ! చిన్నప్పుడు మా అమ్మ నాకు గిటార్‌, వీణ నేర్పించారు. కాలేజ్‌కు వచ్చిన తర్వాత వాటిని ప్లే చేసే అవకాశం పెద్దగా రాలేదు. దాంతో మర్చిపోయా

మీ 100వ సినిమా ఏది?

సుమన్‌: ‘అయ్యప్ప కటాక్షం’. 99 సినిమాలు చేసిన తర్వాత పదేళ్లు విరామం వచ్చింది. 100వ సినిమా చేస్తే ఒక రికార్డుగా ఉంటుంది కదా అనుకున్నాను. ఆ విషయం గురించి మర్చిపోయాను. గత అక్టోబరులో భక్తిసినిమా చేయాలని నన్ను కలిశారు. అలా ‘అయ్యప్ప కటాక్షం’ సెట్స్‌పైకి వెళ్లింది. అయితే, అది నా 100వ సినిమా అని తెలియదు. ఎందుకంటే నాది ముఖ్య పాత్ర అని మాత్రమే చెప్పారు. సెట్‌కు వెళ్లిన తర్వాత ‘హీరో-హీరోయిన్‌ ఎవరు’ అని అడిగా. ‘వాళ్లెవరూ లేరు. మీదే మెయిన్‌రోల్‌. అన్ని పాటల్లోనూ మీరే ఉంటారు’ అన్నారు. అప్పుడు అది నా 100వ సినిమా అని లెక్కవేసుకున్నా. అయ్యప్పస్వామి కటాక్షం వల్ల అలా 100వ సినిమా పూర్తయింది. 

‘అన్నమయ్య’లో వేంకటేశ్వరస్వామిగా కనిపించారు కదా! మేకప్‌ వేసుకోవడానికి ఎంత సమయం పట్టేది?

సుమన్‌: దాదాపు 4గంటలు పట్టేది. ఉదయం 4 గంటలకు అన్నపూర్ణా స్టూడియోస్‌కు వెళితే, కిరీటం పెట్టుకుని సెట్‌లోకి వచ్చే సరికి ఉదయం 9గంటలు అయ్యేది. మళ్లీ మధ్యాహ్నం వరకూ కిరీటం తీసేవాడిని కాదు. మళ్లీ మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక గంట విశ్రాంతి తీసుకుని, గెటప్‌ వేసుకుంటే, పేకప్‌ చెప్పేవరకూ తీసేవాడిని కాదు. ఇలా 8 నెలల పాటు ఆ మేకప్‌ వేసుకున్నా. 

ఈ పాత్ర చెప్పగానే మీకు ఏమనిపించింది?

సుమన్‌: ఒకరోజు రాఘవేంద్రరావుగారు మా ఇంటికి వచ్చి ఈ వేషం గురించి చెప్పగానే ‘మీరు జోక్‌ చేస్తున్నారా’ అని అడిగా. ‘లేదు. మీరే చేయాలి’ అని అడిగారు. ‘నాకు అస్సలు అనుభవం లేదు. ఎప్పుడూ దేవుడి పాత్ర చేయలేదు’ అని అన్నా. ‘మీరు ఒప్పుకోండి. మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం’ అని చెప్పారు. నాకు ఒక రోజు టైమ్‌ కావాలని అడిగా. వాళ్లు ‘సరే’ అన్నారు. ఆ రోజు మా ఇంట్లో వాళ్లతో చర్చిస్తే, ‘ఒప్పుకోండి. రాఘవేంద్రరావుగారు అన్ని లెక్కలు వేసుకుని మిమ్మల్ని అడిగి ఉంటారు’ అని అన్నారు. ఆ రోజు రాత్రి కలలో నాకు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపించింది. దీంతో సినిమా చేయాలని అనుకున్నా. అయితే, మీసం లేకుండా ఎప్పుడూ నటించలేదు. ఎలా ఉంటానోనని అనుకున్నా. మీసంతో గెటప్‌ వేసుకుని చూసుకున్నాం. పర్వాలేదనిపించింది. దాంతో సినిమాకు ఒకే చెప్పా. వారం రోజుల్లో షూటింగ్‌ మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి మాంసాహారం మానేశా. ఫ్యామిలీ జీవితానికి దూరంగా ఉండేవాడిని. నేలమీద పడుకునేవాడిని. అదొక విభిన్న ప్రయాణం. 

‘అన్నమయ్య’ చేసిన తర్వాత చాలా మంది వచ్చి నా కాళ్లకు నమస్కారం చేసేవారు. నా జీవితంలో అలాంటిది ఊహించలేదు. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన వరం అది. ఆ సినిమా గురించి తెలిసి, రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మగారు రాష్ట్రపతి భవన్‌కు ప్రింట్‌ తెప్పించుకుని మరీ చూశారు. అంతేకాదు, వేంకటేశ్వరస్వామి పాత్ర చేసిన నన్ను కూడా పక్కన కూర్చొబెట్టుకుని ఆ సినిమా చూశారు. ఇంతకన్నా ఇంకేం కావాలి. బాలూగారు నాకు డబ్బింగ్‌ చెప్పారు. అది నాకు బాగా హెల్ప్‌ అయింది. 

దీని తర్వాత ‘రామదాసు’లో రాముడిగా కనిపించారు కదా!

సుమన్‌: అవును ‘అన్నమయ్య’ తర్వాత ‘రామదాసు’లో నన్ను అడిగారు. అప్పుడు కూడా వాళ్లు నన్ను అనుకోలేదట. వేరే వాళ్లతో చేయిద్దామనుకున్నారు. ఎవరూ సరిపోలేదు. దీంతో మళ్లీ నన్ను సంప్రదించారు. అలా రాముడిగానూ కనిపించే అవకాశం నాకు లభించింది. 

‘నేటి భారతం’ చూసి చాలా మంది పోలీస్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారట!

సుమన్‌: నేను కొన్ని కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అప్పట్లో ఆ సినిమా చూసి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్‌ అయిన వాళ్లు నా దగ్గరకు వచ్చి, ‘మొదటి నుంచీ మేం పోలీస్‌ అవ్వాలన్న ప్యాషన్‌ మాకు లేదండీ. కానీ, ‘నేటి భారతం’ చూసిన తర్వాత మీరిచ్చిన స్ఫూర్తితోనే ఈ ఉద్యోగానికి వచ్చాం’ అని చెప్పినప్పుడు నాకు సంతోషంగా అనిపించేది. 

‘నేను పెళ్లంటూ చేసుకుంటే తెలుగమ్మాయినే చేసుకుంటాను’ అని అప్పట్లో అన్నారు. ఎందుకని?

సుమన్‌: ‘తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తాను. ఎందుకంటే తమిళంలో నేను చాలా బిజీగా ఉన్నా’ అని భానుచందర్‌కు చెప్పి ‘ఇద్దరు కిలాడీలు’ చేశా. ఈ సినిమా మధ్యలో ఆగిపోవడంతో ‘తరంగిణి’  చేశా. అది ఏడాది పాటు ఆడింది. దీంతో నాకు వరుసగా తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. తమిళ్‌ కన్నా ఎక్కువగా తెలుగులోనే పేరొచ్చింది. ఆ సమయంలో ‘మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు’ అని విలేకరులు అడిగితే, ‘తెలుగు చిత్ర పరిశ్రమ వల్లే నాకు ఇంత పేరొచ్చింది. తెలుగు వాళ్లు నన్ను వాళ్ల సొంతవాడిగా చూసుకున్నారు. అందుకోసం ఒక తెలుగమ్మాయినే పెళ్లి చేసుకుంటా’ అని చెప్పా. ఆ మాటకు కట్టుబడి తెలుగమ్మాయినే పెళ్లి చేసుకున్నా. నా భార్య తాతగారు డి.వి.నరసరాజుగారు. వాళ్లమ్మాయి ప్రొడక్షన్‌కు సంబంధించిన విషయాలు నాతో మాట్లాడటానికి వచ్చి, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అయ్యాం. ఆ తర్వాత పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే!

మీకు ఎంతమంది పిల్లలు?

సుమన్‌: ఒక పాప. తను ఎమ్మెస్సీ హ్యుమన్‌ జెనిటిక్స్‌ పూర్తి చేసింది. 

మీ అభిమానులకు సంబంధించి మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా?

సుమన్‌: నా తొలి సినిమా నుంచే చాలా మంది నన్ను అభిమానించడం మొదలుపెట్టారు. తమ కుటుంబంలో ఒకడిగా భావించేవారు. వాళ్ల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నన్ను పిలిచేవారు. తిరుపతిలో నాగరాజు నాయుడు అనే అభిమాని ఉన్నాడు. తన పెళ్లికి రావాల్సిందిగా కార్డు ఇచ్చి ‘మీరు పెళ్లికి రాకపోతే నేను తాళి కట్టను’ అని చెప్పి వెళ్లాడు.  ఏదో జోక్‌ చేస్తున్నాడనుకొని ‘సర్లే వస్తా’నని నేను బెంగళూరులో షూటింగ్‌ వెళ్లిపోయా. మధ్యాహ్నం వాళ్ల ఫాదర్‌ ఫోన్‌ చేసి, ‘బయలుదేరారా?’ అని అడిగారు. ‘ఎందుకు’ అని అడిగితే, ‘సాయంత్రం మా అబ్బాయి పెళ్లి ఉంది. మీరు రాకపోతే తాళి కట్టను.. అని అంటున్నాడు’ అని చెప్పేసరికి ఆశ్చర్యపోయా. అప్పటికప్పుడు కాంటెస్సా కారు వేసుకుని పెళ్లికి వెళ్లా. నేను తాళి ఇస్తే కానీ, అతను ఆ అమ్మాయి మెడలో కట్టలేదు.(నవ్వులు) అంతగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. సినిమా హిట్టయినప్పుడు కాదు, ఫట్టయినప్పుడు కూడా నా వెంటే ఉన్నారు.

ఇన్ని మంచి పాత్రలు చేసిన మీరు ‘శివాజీ’లో విలన్‌గా ఎందుకు చేయాల్సి వచ్చింది?

సుమన్‌: 1982 తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగుకు వచ్చేశా. తెలుగు ఇండస్ట్రీ గ్లామర్‌ ఫీల్డ్‌. కానీ, మణిరత్నం, శంకర్‌లు వచ్చిన తర్వాత తమిళంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సినిమాలు తీశారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ భారీగా ఖర్చు పెట్టి తీయడం మొదలు పెట్టారు. తమిళ సినిమా ద్వారా నేను చిత్ర పరిశ్రమకు పరిచయం అయినా, మంచి చిత్రం మాత్రం చేయలేదు. టాప్‌ డైరెక్టర్ల సినిమాల్లో ఒక్కసారైనా నటిస్తే అక్కడి వారికి మరింత చేరువ కావచ్చని అనుకునేవాడిని. అప్పుడు నాకు ‘శివాజీ’ ఆఫర్‌ వచ్చింది. కానీ, అప్పటికే విలన్‌గా చాలా మందిని అనుకున్నారు. అమితాబ్‌, నానా పటేకర్‌, మోహన్‌లాల్‌ చాలా మంది పేర్లు పరిశీలించారు. చివరకు నాకు ఫోన్‌ చేశారు. వెళ్లి కథ విన్న తర్వాత ‘నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. సినిమా చేస్తా’ అని చెప్పా. చాలా గ్యాప్‌ తర్వాత మా అన్న రజనీకాంత్‌తో నటించడం చాలా సంతోషం అనిపించింది. ఇదే విషయాన్ని రజనీగారికి చెబుదామని ఫోన్‌ చేశా. ‘సుమన్‌ నీ ఫీలింగ్‌ ఏంటి?’ అని అడిగారు. ‘మీతో, అందులోనూ ఈ సంస్థలో నటించడం చాలా సంతోషంగా ఉంది’అని చెప్పా. ‘సుమన్‌.. నువ్వు ఇప్పుడు చాలా మంచి పని చేస్తున్నావు. ఈ సినిమా తర్వాత నీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. నాకన్నా కూడా నీకు ఎక్కువ పేరొస్తుంది’ అన్నారు. అలాగే ఆ సినిమాలో నా పాత్ర డామినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. ఉత్తమ విలన్‌గా అవార్డు కూడా వచ్చింది. 

తెలుగులో విలన్‌గా అవకాశాలు రాలేదా?

సుమన్‌: వచ్చాయి. కానీ, నాకు సరిపోయే పాత్ర ఉండాలి కదా! ‘శివాజీ’లో రజనీకాంత్‌గారి పాత్రకు దీటుగా నా పాత్ర ఉంటుంది. అదే సమయంలో నేచురల్‌గా ఉండేందుకు నేను విగ్గు కూడా పెట్టుకోలేదు. ఆ సినిమాలో హీరోకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు అలా సినిమాలు తీసే దర్శకులు రాజమౌళి ఒక్కరే. మొదటి నుంచి విలన్‌ డామినేట్‌ చేస్తే, చివర్లో హీరోది పైచేయి అవుతుంది. ఇది హాలీవుడ్‌ ఫార్ములా. ఎప్పుడైనా సక్సెస్‌ అవుతుంది.

శనివారం గురించి మీకూ, రజనీకాంత్‌కు చర్చ జరిగిందట!

సుమన్‌: ‘శివాజీ’ సినిమా మొదటి రోజు శనివారం షూటింగ్‌ జరిగింది. ‘మధ్యాహ్నం భోజనం కలిసి చేద్దాం’ అని రజనీ అన్నారు. ప్రొడక్షన్‌ వాళ్లు క్యారియర్‌ పంపితే దాన్ని తీసుకుని ఆయన వద్దకు వెళ్లా. అన్నీ నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలే. శనివారం కావడంతో నేను తిననని చెప్పా. ‘ఎందుకు’ అని అడిగారు. ‘నేను వేంకటేశ్వరస్వామి పాత్ర చేశా కదా! సెంటిమెంట్‌. అందుకే శనివారం నాన్‌వెజ్‌ తినను’ అని చెప్పా. ‘శనివారం నాన్‌వెజ్‌ తినవద్దని  వేంకటేశ్వరస్వామి నీకు ఫోన్‌ చేసి చెప్పాడా? నేను ఒక్కడినే తింటూ ఉంటే, నువ్వు చూస్తూ ఊరుకోలేవు కదా! నువ్వు కూడా తిను. మనసు వెజిటేరియన్‌గా ఉండాలి. ఇంకొకరికి హాని చేయకూడదు.. నువ్వు అందరికీ మంచి చెయ్‌. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్‌వెజ్‌ తింటూనే ఉన్నావు కదా! నీ బ్లడ్‌లోనే నాన్‌ వెజిటేరియన్‌ ఉంది. మంచి మనసుతో ఉంటే, భగవంతుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు’ అని అన్నారు. అప్పటి నుంచి అవన్నీ మానేశా. ఎప్పుడైనా గుడికి వెళ్లినా, పండగల సమయంలో మాత్రం నాన్‌వెజ్‌ తినను. 

‘సితార’ కోసం క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నారట!

సుమన్‌: ఏడిద నాగేశ్వరరావుగారి బ్యానర్‌లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ‘సితార’తో ఆ అవకాశం వచ్చింది. అందులో నాది క్లాస్‌ పాత్ర. రాజమండ్రిలో షూటింగ్‌ అయిపోయిన తర్వాత వెంకటగిరి ప్యాలెస్‌లో షూటింగ్‌ మొదలు పెట్టారు. ‘రేపు క్లాసికల్‌ డ్యాన్స్‌ సీన్లు ఉంటాయి. సిద్ధంగా ఉండండి’ అని చెప్పారు. నేను షాకయ్యా. ఎందుకంటే నాకు అస్సలు క్లాసికల్‌ డ్యాన్స్‌ తెలియదు. ఈ విషయాన్ని ఏడిద నాగేశ్వరరరావుగారికి చెబితే, ఆయన డ్యాన్స్‌ అసిస్టెంట్‌ను పెట్టి మరీ నాకు క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్పించారు. 

‘అల్లుడు’ సినిమాల సీజన్ మీతోనే మొదలైంది అనుకుంటా!

సుమన్‌: అవును. చాలా సినిమాలు తీశాం. అందుకు శరత్‌గారికి ధన్యవాదాలు చెప్పాలి. ‘బావ బావమరిది’ చిత్రంలో నటనకు నాకు అవార్డు కూడా వచ్చింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కాట్రగడ్డ ప్రసాద్‌గారు, దర్శకుడు బీఎల్వీ ప్రసాద్‌గార్లకు ధన్యవాదాలు. రెండు, మూడు సినిమాలు స్టూడియోల్లో తీసి, బయట తీసినట్లు మ్యాచ్‌ చేశారు. 

రక్తంతో రాసిన ప్రేమలేఖలు వచ్చాయా?

సుమన్‌: చాలా వచ్చాయి. నన్ను పెళ్లి చేసుకుంటానని రైలెక్కి మద్రాసు కూడా వచ్చేవారు. వాళ్లకు నచ్చజెప్పి, మళ్లీ పంపడం మా మేనేజర్‌కు పెద్ద పనిగా ఉండేది. 

మీరూ భానుచందర్‌ నేపాల్‌ వెళ్తే, అక్కడ మీకు అనుకోని పరిస్థతి ఎదురైందట!

సుమన్‌: 1979లో ఒక సినిమా షూటింగ్‌ కోసం నేపాల్‌ వెళ్లాం. భానుచందర్‌ అమ్మాయిలను పొగుడుతూ వారితో సరదాగా ఉండేవాడు. అక్కడ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా చేస్తున్న అమ్మాయిని చూసి ‘ఆ అమ్మాయిని డేట్‌కు పిలుస్తా’ అని అన్నాడు. దగ్గరకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించే లోపు ‘భాను భయ్యా.. షూటింగ్‌ ఎక్కడ.. నేను కూడా వస్తా’ అని అంది. అంతే, మనవాడు పూర్తిగా నీరసపడిపోయాడు. ఆ తర్వాత సరదాగా నేను కూడా అడుగుదామనుకుని వెళ్లి ‘రేపు షూటింగ్‌ లేదు. బయటకు వెళ్దామా’ అని అడిగా. ‘సుమన్‌ భయ్యా. నాకు చాలా పని ఉంది. రాలేను’ అంది. దీంతో ఇద్దరం ఒక్కటే నవ్వులు. ఇంకో విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లయిపోయింది.

చాలామంది కుటుంబంతో సహా ఫంక్షన్స్‌కు వస్తారు. మీరెందుకు తీసుకురారు?

సుమన్‌: చిత్ర పరిశ్రమలోని వారి పెళ్లిళ్లకు కలిసే వెళ్తాం. కానీ, బయట కార్యక్రమాలకు వారు వచ్చేందుకు ఇష్టపడరు. అంతే తప్ప వేరే కారణాలు లేవు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని