close

తాజా వార్తలు

Updated : 28/01/2020 09:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. గులాబీ పురాలు

తెలంగాణ పుర, నగర పాలక పీఠాల పరోక్ష ఎన్నికల్లో గులాబీ వ్యూహం గుబాళించింది. ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో సింహ భాగం స్థానాల్లో ఆధిక్యం సాధించిన తెరాస.. ఇతర చోట్లా పావులు కదిపి కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 120 పురపాలక సంఘాల్లో 118 మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో తెరాస 110, కాంగ్రెస్‌ నాలుగు, భాజపా రెండు, ఎంఐఎం రెండు దక్కించుకున్నాయి. తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన మేయర్‌ ఎన్నికల్లో అన్నింటిలోనూ తెరాస జెండా ఎగిరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈ ఫలితాలు అనితర సాధ్యం

తెలంగాణలో పురపాలక, నగరపాలక ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికల్లో తెరాస అపూర్వ, అనితర సాధ్యమైన ఫలితాలను సాధించిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌, భాజపాలది అపవిత్ర అవగాహన. రెండు పార్టీలూ విలువలను వీడి నిస్సిగ్గుగా వ్యవహరించాయన్నారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలుచేస్తామని, పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషిచేస్తామని, దేశానికే ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కొత్తగా 3 జిల్లాలు!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపై దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆంగ్ల మాధ్యమంపై ముందుకెళ్లొద్దు

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఆంగ్ల మాధ్యమంపై ‘స్టే’ ఉత్తర్వులు ఇస్తామని తేల్చి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘కేసీఆర్‌ను నమ్మితే జగన్‌ భవిష్యత్‌ చీకటే’

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స్నేహం వల్లే మండలిని రద్దు చేయడం వంటి వ్యవస్థల విధ్వంసానికి ఏపీ సీఎం జగన్‌ పూనుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పక్కరాష్ట్రంలో అస్థిర పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండదనే జగన్‌కు కేసీఆర్‌ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు. దిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌తో ఇదే రకంగా స్నేహం కొనసాగిస్తే.. జగన్‌తో పాటు ఏపీ భవిష్యత్‌ అంధకారమేనని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద కీలకాధారాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై పోలీస్‌ పరిశోధన కీలకదశకు చేరుకుంది. దిశను హత్యాచారం చేసిన నిందితులు మహ్మద్‌ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్‌ కుమార్‌ (పోలీసు ఎదురు కాల్పుల్లో చనిపోయారు)కు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సుమారు 40 సాక్ష్యాధారాలను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నివేదికను సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీటిని రెండురోజుల్లో పోలీసులకు అందజేయనున్నట్టు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఇంటర్లో గ్రేడింగ్‌ విధానం రద్దు

ఏపీ ఇంటర్మీడియట్‌లో గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసి, పాత విధానంలోనే మార్కులు ఇవ్వనున్నట్లు ఇంటరు విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. గ్రేడింగ్‌ విధానంతో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో ఈ ఏడాది నుంచి మార్కులే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బ్రిటన్‌ బంపర్‌ ఆఫర్‌

భారత్‌ సహా ప్రపంచం నలుమూలల్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను, నిపుణులను ఆకర్షించేందుకు బ్రిటన్‌ ‘అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌’ ప్రకటించింది. అగ్రశ్రేణి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, గణిత నిపుణులకు అపరిమితంగా, వేగవంతంగా వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. వారంతా తమ వద్దే స్థిరపడేలా తోడ్పడాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా వలస నిబంధనలను గురువారం నాటికి రూపొందించి, ఫిబ్రవరి 20 నుంచి అమలు చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌  × ఆస్ట్రేలియా

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ నాకౌట్‌ పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. 2013 నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఐదు సార్లు తలపడగా.. నాల్గింట్లో భారత్‌ నెగ్గింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దుర్భేద్యంగా ఉన్న భారత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 106 మందిని బలిగొన్న కరోనా వైరస్‌

చైనాలో కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 106కు చేరింది. సోమవారం బీజింగ్‌లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. సోమవారం ఒక్కరోజు 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4,000 దాటిపోయిందన్నారు. మరోవైపు ప్రపంచదేశాలకూ ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా జర్మనీ, శ్రీలంకలో తొలి కేసు నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.