close

తాజా వార్తలు

Published : 25/01/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1.  వీడనున్న ఉత్కంఠ

తెలంగాణలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 134 కేంద్రాల్లో 2,559 టేబుళ్ల వద్ద సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. రాష్ట్రంలో 2,647 మంది వార్డు సభ్యులు, 324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మొత్తం 12,926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 

2. రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు

ఏపీ రాజధాని ప్రాంతం (సీఆర్‌డీఏ) పరిధిలో 2,500 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. విజయవాడ నగరం, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి పట్టణ ప్రాంతాలు, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన 39,559 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు ఆ భూమిని తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఎస్వీబీసీ ఎండీగా అదనపు ఈవో ధర్మారెడ్డి?

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ను ఎస్వీబీసీకి ఛైర్మన్‌గా నియమించారు. ఆయన ఇటీవల పదవి నుంచి వైదొలిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అయిదు సంస్థలతో భారీ ఒప్పందాలు: కేటీఆర్‌

‘‘సదస్సులో పిరమల్‌తో పాటు మరో నాలుగు సంస్థలతో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. పిరమల్‌ వివరాలను ఇప్పటికే వెల్లడించాను. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఫిబ్రవరిలో మిగిలిన నాలుగింటి వివరాలను తెలియజేస్తా. దీంతో పాటు ఇప్పటికే పరిశ్రమలను స్థాపించిన పలు సంస్థలు వాటిని విస్తరించడానికి నిర్ణయించాయి’’అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు విశేషాలను కేటీఆర్‌ ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కేటీఆర్‌ ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి 

5. భారత్‌కు అక్రమ వలసదారులు పెరిగారు

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించే అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) వెల్లడించింది. భారత్‌ అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కూడా దీనికి ఓ కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వైబి ఖురానీ మీడియాకు తెలిపారు. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటి వరకూ 268 మందిని పట్టుకున్నామని, వారిలో చాలామంది అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారేనని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. జేబులోకి మరింత డబ్బు!

రాబోయే బడ్జెట్‌లో కేంద్రం వేతనజీవులకు ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే తగ్గిన గిరాకీని పెంచేందు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. వేతనజీవుల జేబుల్లోకి మరింత డబ్బులొస్తే అది వినియోగాన్ని పెంచి, గిరాకీ చక్రాన్ని గిర్రున తిప్పుతుందన్న ఆశలు ఉన్నాయి. బడ్జెట్‌పై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

7. నియంతలను ఎదుర్కోవడానికి వర్సిటీ

ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ పాలన ధోరణి అంతకంతకూ పెరుగుతోందని... ప్రస్తుత, భావి నియంతల ఒత్తిళ్ల నుంచి పౌర సమాజాన్ని రక్షించేందుకు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టును చేపడుతున్నానని అమెరికా కుబేరుడు, దాత జార్జ్‌ సోరోస్‌ ప్రకటించారు. బోధన, పరిశోధనల నిమిత్తం ‘ఓపెన్‌ సొసైటీ యూనివర్సిటీ నెట్‌వర్క్‌ (ఓఎస్‌యూఎన్‌)ను స్థాపిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు వంద కోట్ల అమెరికా డాలర్లను (రూ.7,126.7 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. టర్కీలో భారీ భూకంపం : 14 మంది మృతి

టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. ఈ ఘటనలో సుమారు 14 మంది మృతి చెందారు. 500మందికి పైగా గాయాలపాలయ్యారు. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. తెలుగులోనూ అమెరికా జనగణన సమాచారం

అమెరికాలో జనగణన మొదలైంది. మనదేశంలో మాదిరిగానే అక్కడా పదేళ్లకోమారు పక్కాగా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రజలకు ఇచ్చే మార్గదర్శక సమాచారాన్ని 59 భాషల్లో రూపొందించారు. తెలుగుతోపాటు 7 భారతీయ భాషలకు చోటుకల్పించారు. 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమెరికాలో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. U19: కివీస్‌పై ఘన విజయం

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌ (4/30), అంకోలేకర్‌ (3/28) విజృంభించడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌ గ్రూప్‌-ఎ లో అగ్రస్థానం సాధించింది. భారత్‌ ఈ నెల 31న జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.