close

తాజా వార్తలు

Published : 23/01/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. 3 రాజధానులకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ‘మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు పెద్దల సభలో చుక్కెదురయింది.  తన విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులనూ సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించడంతో అధికార వైకాపా సభ్యులు, మంత్రులు నిర్ఘాంతపోయారు. మరోవైపు తెదేపా సభ్యులు హర్షాతిరేకాలతో సభను హోరెత్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇదో బ్లాక్‌ డే

‘శాసనసభ, మండలికి ఈ రోజు బ్లాక్‌ డే. మండలి ఛైర్మన్‌ పార్టీకి లొంగిపోయి నిర్ణయం తీసుకున్నారు. బిల్లులను ప్రవేశపెట్టకుండా కావాలనే రూల్‌ 71ను తెరపైకి తీసుకొచ్చారు. బిల్లులకు ఆమోదమో, తిరస్కరణో తెలపకుండా సెలక్ట్‌ కమిటీకి పంపడం విరుద్ధం. ఎంతకాలం ఈ బిల్లులను ఆపగలరు. పది రోజులు ఆలస్యమవుతుంది అంతే...’ అంటూ రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండలి నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌లో వారు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. చంద్రబాబుపై పూలవర్షం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబుపై పూలవర్షం కురిపించారు. శాసనమండలి సభ అనంతరం బుధవారం ఆయన మందడం మీదుగా ఇంటికి వెళ్తుండగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జై అమరావతి, జైజై అమరావతి అని నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు. తన కారు నుంచే చంద్రబాబు విజయసంకేతాన్ని చూపించారు. కొద్దిసేపు ఆగి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. రాజధాని గ్రామస్థులు ఆయనకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అమరావతే శాశ్వత రాజధాని

అమరావతే ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజధాని మార్పును కేంద్రానికి చెప్పామని వైకాపా నాయకులు అంటున్నా... అందుకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదని చెప్పారు. బుధవారం దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహబాధ్యుడు సునీల్‌ దేవధర్‌, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రాజధానిపై వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక బెంచ్‌

ఏపీ రాజధాని అమరావతి, సీఆర్‌డీఏ అంశాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ వ్యాజ్యాలపై గురువారం విచారణ జరపనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఆర్టీసీకి సంక్రాంతి కాసుల పంట!

సంక్రాంతి పండగ తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట పండించింది. రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు పది రోజులపాటు 5,052 బస్సులను నడిపి రూ.139.34 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా రూ.121.30 కోట్ల ఆదాయమే వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మళ్లీ అందుబాటులోకి అప్రెంటిస్‌ విధానం

ఇంటర్‌మీడియట్‌ వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన అప్రెంటిస్‌షిప్‌ విధానం మళ్లీ అమల్లోకి వచ్చింది. దీనివల్ల వృత్తివిద్య కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఆసుపత్రులు ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తాయి. నెలకు రూ.7వేల చొప్పున విద్యార్థులకు చెల్లిస్తాయి. ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులను అప్రెంటిస్‌షిప్‌ కోసం ఎంపిక చేసేందుకు వచ్చే ఏప్రిల్‌ లేదా మే నెలలో రాష్ట్రంలో అయిదు నగరాల్లో మేళాలు జరపాలని నిర్ణయించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రోదసిలోకి హ్యూమనాయిడ్‌ రోబో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు తొలి సన్నాహకంగా మానవరహిత మిషన్‌ను ఈ ఏడాది డిసెంబరులో చేపట్టనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ‘వ్యోమమిత్ర’ అనే హ్యూమనాయిడ్‌ను రోదసిలోకి పంపించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరులో మానవసహిత అంతరిక్ష యాత్రను చేపడతామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కశ్మీర్‌పై మీ జోక్యం వద్దే వద్దు: భారత్‌

కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిమైనదని, దీంట్లో ఎవరి జోక్యమూ అవసరం లేదని భారత్‌ మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పింది. కోరుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో సాయం చేస్తానంటూ దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా భారత్‌ మరోసారి స్పందించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ట్రంప్‌.. మంగళవారం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు. కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి సాయం చేస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ప్రజాస్వామ్య సూచీలో దిగజారిన భారత్‌

ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్‌ స్థానం దిగజారింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2019లో పది స్థానాలను కోల్పోయింది. క్రమేణా పౌరహక్కులను అణచి వేయడమే ఇందుకు ప్రధాన కారణమని ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ జరిపిన ప్రపంచ వ్యాప్త సర్వేలో వెల్లడయింది. ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ ర్యాంకింగ్‌ విషయంలో 2019లో భారత్‌ 6.90 స్కోరు సంపాదించి 51వ స్థానంలో నిలిచింది. అదే 2018లో 7.23 స్కోరు పొందింది.. మొత్తం 165 స్వతంత్ర దేశాలు, రెండు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.