close

తాజా వార్తలు

Published : 20/01/2020 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ సాధ్యమే

కానీ ఎంత సమయం పడుతుందో చెప్పలేం..
పెద్దఎత్తున ప్రైవేటు పెట్టుబడులు రావాలి
 ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌
ఈనాడు - హైదరాబాద్‌

భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరటం  సాధ్యమేనని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అన్నారు. కానీ అందుకు ఎంత సమయం పడుతుందనేది ఖచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ఎంత త్వరగా ఆ లక్ష్యాన్ని చేరతామనేది పెట్టుబడుల సమీకరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం వంటి వివిధ అంశాల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై శనివారం ఇక్కడ ఫిక్కీ సారథ]్యంలో ఏర్పాటైన చర్చాగోష్ఠిలో రజనీశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అనుకున్న స్ధాయిలో ఆర్థికాభివృద్ధి సాధించటానికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం ఎంతో ముఖ్యమని, కేవలం ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యాన్ని త్వరగా చేరుకోలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యం అనూహ్యంగా విస్తరిస్తోందని, దీన్ని అందిపుచ్చుకోని వ్యాపార సంస్థలు పోటీలో వెనుకబడిపోతాయని హెచ్చరించారు. బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ తెస్తున్న మార్పులను ఉదహరించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా బ్యాంకులు తమ వ్యయాలను తగ్గించుకొని ఆమేరకు తక్కువ వడ్డీరేట్లకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు చేయూత
జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల  (ఎంఎస్‌ఎంఈ) కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగినందున వాటికి బ్యాంకుల అధికంగా రుణాలు ఇచ్చే సానుకూలత పెరిగిందని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ సంస్థలకు బ్యాంకింగ్‌ సేవల విషయంలో ఎస్‌బీఐ పూర్తిగా చేయూతనిస్తుందని అన్నారు. ఐబీసీ- ఎన్‌సీఎల్‌టీ వ్యవస్థ ఏర్పాటుతో రానిబాకీల సమస్యను త్వరగా పరిష్కరించుకునే అవకాశం వచ్చిందని, బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఇదొక సానుకూలాంశమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం సరైన దిశగా తీసుకున్న నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. భిన్నత్వం లేకుండా.... ఒకే తరహా సేవలు అందించడానికి ఇన్ని బ్యాంకులు ఎందుకు...? కనీసం కొన్నింటిని విలీనం చేస్తే సమర్థత పెరుగుతుంది, పరిపాలనా వ్యయాలు కూడా తగ్గుతాయి- అన్నారాయన. అందుకే ప్రభుత్వం బ్యాంకుల విలీన నిర్ణయానికి మొగ్గు చూపిందన్నారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం... కుటుంబ వ్యవహారం లాంటిది కాబట్టి సులువుగా సాగిందని, ఇతర బ్యాంకుల విషయంలో ఇలా ఉండకపోవచ్చని అన్నారు.

సంస్థాగత సంస్కరణలు అవసరం
దేశాన్ని ఆర్థిక మందగమనం నుంచి బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు సంగీతారెడ్డి అన్నారు. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏడాది క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదన్నారు. మూలధన సమీకరణ పూర్తిగా క్షీణించినట్లు, వినియోగం తగ్గిపోయిందని అన్నారు. దీనికి పరిష్కారంగా సంస్థాగత సంస్కరణలు చేపట్టటంతో పాటు, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగాన్ని పెంపొందించటానికి ఆర్థిక వ్యవస్థలోకి రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకూ నిధులను తక్షణం తేవాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విషయంలో దేశంలోని అతిపెద్ద బ్యాంకుగా ఎస్‌బీఐ చొరవ తీసుకోవాలని, ఫిక్కీ తరఫున ఈ విషయంలో ఎస్‌బీఐతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఫిక్కీ తెలంగాణా రాష్ట్ర కౌన్సిల్‌ ఛైర్మన్‌ టి.మురళీధరన్‌, సహ-ఛైర్మన్‌ మురళీ కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.