close

తాజా వార్తలు

Published : 18/01/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల నివాళులు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు నివాళులర్పించారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ విజయం

భారత్‌ అదరగొట్టింది. తొలి వన్డేలో పేలవంగా ఆడిన కోహ్లి బృందం తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (96), కేఎల్‌ రాహుల్‌ (80), కోహ్లి (78) చెలరేగడంతో మొదట భారత్‌ 6 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ఓ దశ వరకు గట్టిగా పోటీలో నిలిచిన ఆస్ట్రేలియా.. చివరికి 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కేబినెట్‌ భేటీ 18న.. కాదు 20నే

ఏపీ మంత్రిమండలి సమావేశం నిర్వహణ తేదీపై పూటకొక నిర్ణయం వెలువడింది. సోమవారం 20వ తేదీన నిర్వహిస్తామని మూడు రోజుల కిందటే నిర్ణయించి తదనుగుణంగా మంత్రులను, శాఖల అధికారులను ప్రభుత్వం ముందే అప్రమత్తం చేసింది. ఇంతలోనే శనివారం మధ్యాహ్నం మూడింటికి సమావేశం ఉంటుందంటూ శుక్రవారం మధ్యాహ్నం సమాచారం అందజేసింది. శుక్రవారం రాత్రికల్లా ఈ నిర్ణయమూ మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు యథాతథంగా నిర్వహిస్తామని తిరిగి వర్తమానం పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఎందుకు జరిగింది?

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్‌కు సుప్రీంకోర్టు తాజాగా విధివిధానాలను నిర్దేశించింది. ఆ కమిషన్‌ విచారణలో వేటిని పరిగణనలోకి తీసుకోవాలి, ఏఏ అంశాలు నిగ్గుతేల్చాలి అనేది నిర్దేశించింది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే అధికారులను బాధ్యులుగా చేయాలని ఆదేశాలిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. అమరావతి నగరం స్వయం సమృద్ధి ప్రాజెక్టే

ఏపీ రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే రూ.లక్ష కోట్ల విలువైన రాజధాని నగర నిర్మాణం చేపట్టే అవకాశం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నా దాన్ని వదులుకుంటున్నాం. సొంత కాళ్లపై నిలబడే స్వయం సమృద్ధి ప్రాజెక్టును కాలదన్నుకుంటున్నట్లుగా ఉంది ఈ వైఖరి. పైగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర ప్రగతికి విఘాతం కలిగించేలా రాజధాని తరలింపు మాటలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం, దానికయ్యే ఖర్చును సమకూర్చుకునే విధానం, సిద్ధమైన ప్రణాళికలు, అమలులో ఉన్న కార్యాచరణ తదితర అంశాలపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

6. నిర్భయ హంతకులకు మరణశిక్ష ఫిబ్రవరి 1న

సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష అమలు తేదీలో మార్పు జరిగింది. వీరిని ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీయాలంటూ స్థానిక అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోడా డెత్‌ వారెంట్లు జారీ చేశారు. ముకేశ్‌ సింగ్‌ అనే దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో శుక్రవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. మరణశిక్ష అమలులో జాప్యంపై జడ్జి అసంతృప్తి వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. జమ్మూ-కశ్మీర్‌కు అభివృద్ధి సందేశాన్ని తీసుకెళ్లండి

జమ్మూ- కశ్మీర్‌లో పర్యటించే కేంద్ర మంత్రుల బృందం సభ్యులు.. అభివృద్ధి సందేశాన్ని తీసుకెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 36 మంది కేంద్ర మంత్రులు శనివారం నుంచి ఈ నెల 24 వరకూ ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటిస్తారు. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సరికొత్త వివాదం సాయి జన్మభూమి

మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ‘సాయి జన్మభూమి’ వివాదం మొదలయింది. సద్గురు సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన ‘పాథ్రీ’ అని స్థానికులు భావిస్తూ 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తరువాతే సాయి జన్మభూమి అంశంపై తెరపైకి వచ్చిందంటూ భాజపా విమర్శిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సాయం పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి

ఉగ్రవాదులు, నక్సలైట్ల హింసలోను, మత ఘర్షణల్లో చనిపోయిన పౌరుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. సరిహద్దుల్లో కాల్పులు, భారత భూభాగంలో మందుపాతరల పేలుడులో చనిపోయినవారి కుటుంబ సభ్యులకూ సదరు పథకం వర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఉల్క ఢీ కొట్టడంతోనే డైనోసార్ల అంతం!

డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు ఎక్కువ మంది పరిశోధకులు చెప్పే సమాధానం.. భారత్‌లోని దక్కన్‌ ట్రాప్‌లలో చోటుచేసుకున్న అగ్నిపర్వత విస్ఫోటాలు. అయితే, ఈ వాదన సరికాదంటున్నారు అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన భారీ ఉల్క ఒకటి భూమిని ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని వారు తేల్చారు. దాదాపు 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.