కేటీఆర్‌కు భాజపా భయం
close

తాజా వార్తలు

Updated : 13/01/2020 06:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌కు భాజపా భయం

తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే
తెరాస పురపాలనలో అధ్వాన రహదారులు, అస్తవ్యస్త డ్రైనేజీ
డాలస్‌, ఇస్తాంబుల్‌ చేస్తామన్న కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయ్‌
ఎన్నికల్లో సీఏఏ ప్రభావం ఉంటుంది
భాజపాను గెలిపిస్తే పట్టణాలు బాగుపడతాయ్‌
నిజామాబాద్‌, కరీంనగర్‌లలో పాగా వేస్తాం
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
ఈనాడు - హైదరాబాద్‌

పురపాలక, నగరపాలక ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తామని.. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లను కమలదళం కైవసం చేసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధీమా వ్యక్తంచేశారు. తెరాస హయాంలో మున్సిపాల్టీలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని.. అంతోఇంతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన జరిగిందంటే కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారానేనని.. పురపాలక సంఘాలవారీగా లెక్కలు సేకరించి త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో లక్ష్మణ్‌ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేటీఆర్‌కు భాజపా భయం పట్టుకుందని పేర్కొన్నారు. అడ్డదారిలో గెలుపొందేందుకు తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

కేటీఆర్‌కు భాజపా భయం పట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస పెద్దఎత్తున మద్యాన్ని, డబ్బును వెదజల్లేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. వీటిని కట్టడి చేయకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని.. కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడాలంటే ఓటర్లు భాజపాకు ఓటేయాలని ఆయన కోరారు.


కొన్నిచోట్ల భాజపాకు అభ్యర్థులే లేరంటున్నారు కదా..
90 శాతం స్థానాల్లో భాజపా నుంచి బరిలో ఉన్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో నామినేషన్లు వేయనిచోట పార్టీ సానుభూతిపరులైన స్వంతంత్రులకు మద్దతిస్తాం.

ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు..భాజపా అంచనాలు ఏమిటి ?
మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా సమస్యలు గుర్తించి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. గెలుపుగుర్రాలను బరిలో దింపుతున్నాం. తొలిసారి దాదాపు అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల తరహా ఫలితాలు సాధిస్తాం.

 

ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు..భాజపా అంచనాలేంటి?
మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా సమస్యలు గుర్తించి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. గెలుపుగుర్రాలను బరిలో దింపుతున్నాం. తొలిసారి దాదాపు అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల తరహా ఫలితాలు సాధిస్తాం.

సీఏఏపై ఇంత వ్యతిరేకత ఊహించారా? ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..
ఇతర దేశాల్లో వివక్షకు గురైనవారిని అక్కున చేర్చుకునేందుకు చిన్నపాటి సవరణ చేస్తే ముస్లింలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆకుపచ్చ జెండాలు ఎగరేసేవారు జాతీయజెండా పడుతుండటం.. మజ్లిస్‌ పార్టీ కార్యాలయం దారుసలాంలో జాతీయజెండా ఎగరేసి, జాతీయగీతాలాపన చేసే స్థితిని తీసుకువచ్చింది మోదీ, అమిత్‌షాలే. ఇది ఒకరకంగా భాజపాకు విజయమే. దేశభక్తులు, జాతీయవాదులు ఏకమవుతున్నారు. ఎన్నికల్లో సీఏఏ ప్రభావం ఉంటుంది.

కొన్ని మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌, భాజపా కుమ్మక్కయ్యాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై..
భాజపా కాంగ్రెస్‌తో కలుస్తుందని కేటీఆర్‌, తెరాసతో కలుస్తుందని ఉత్తమ్‌ అంటున్నారు. సిద్ధాంతపరంగా తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకగూటి పక్షులు. నిజామాబాద్‌ మేయర్‌గా, నారాయణపేట ఛైర్మన్‌గా గతంలో భాజపా నేతలున్నారు. అలాంటి బలమైన స్థానాల్లో తెరాస ఓడిపోతుందని కేటీఆర్‌ ముందస్తుగా సాకులు వెతుక్కుంటున్నారు. తెరాస ముసుగులో తెలంగాణలో మజ్లిస్‌ విస్తరణ ప్రయత్నాల్ని భగ్నం చేస్తాం.

భాజపాకు ఓటేందుకు వేయాలి?
రైతురుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతుబంధం వంటి పథకాలను తెరాస సర్కార్‌ అటకెక్కించింది. తెలంగాణను అప్పులపాలు చేసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది భాజపాతోనే సాధ్యం. 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 12 మంది తెరాసలోకి వెళ్లారు. తెరాస అభ్యర్థుల్ని గెలిపిస్తే కేసీఆర్‌ ఫాంహౌస్‌కు, ప్రగతిభవన్‌కు సేవకులుగా, బానిసలుగా మారతారు. పార్టీ మారకుండా ప్రజల పక్షాన ఉండేది భాజపా కార్యకర్తలే. పురపాలక సంఘాల వారీగా, రాష్ట్రస్థాయిలో ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తాం. భాజపాను గెలిపిస్తే పట్టణాలు బాగుపడతాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తీసుకువస్తాం.అందుకే భాజపాకు ఓటేయాలని ప్రచారం చేస్తాం.

జిల్లా, మండల పరిషత్‌ ఫలితాలే భాజపాకు వస్తాయన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై..
పీసీసీ అధ్యక్షుడివి ఉత్తరకుమార ప్రగల్భాలు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిన నేత భాజపా గురించి మాట్లాడటం విడ్డూరం. కాంగ్రెస్‌ నుంచి రాష్ట్రస్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా భాజపాలోకి వస్తారు. 


భాజపా ప్రచార అస్త్రాలేంటి?

నగరాలను డాలస్‌, ఇస్తాంబుల్‌, న్యూయార్క్‌ చేస్తానని మాట్లాడిన కేసీఆర్‌.. అక్కడ భూగర్భడ్రైనేజీలను కూడా వేయలేదు. అధ్వాన రహదారుల్ని బాగుచేయలేదు. డెంగీ జ్వరాలతో ఎంతోమంది మరణించారు. గత పురపాలక, నగరపాలక ఎన్నికల్లో గెలిపిస్తే తెరాస ఏం చేసింది? ఆ పార్టీ వైఫల్యాల్ని.. ముమ్మారు తలాక్‌, 370 అధికరణ రద్దు సహా కేంద్రంలో మోదీ సర్కారు సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అక్కడక్కడా మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్‌ పంపిణీ, ముద్ర లోన్లతో పట్టణ ప్రజలకు అంతోఇంతో జరిగిన సాయం మోదీ సర్కారు నిధులతోనే. నేను, కిషన్‌రెడ్డి, ఎంపీలు, మురళీధర్‌రావు..విస్తృతంగా ప్రచారం చేస్తాం. ఒకరిద్దరు కేంద్రం నుంచి ప్రచారానికి వచ్చే అవకాశముంది.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని