close

తాజా వార్తలు

Published : 11/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. యూపీలో ఘోర ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందినట్టు సమాచారం. ఫరుఖాబాద్‌ నుంచి 45 మంది ప్రయాణికులతో జైపుర్‌ బయల్దేరిన ఏసీ బస్సు... చిలోయి వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ధాటికి మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. పోలీసులు 21 మందిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అయితే 20 మందికిపైగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రైతుల దీక్షలను అడ్డుకున్న పోలీసులు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమల్లో ఉందని, దీక్షలకు అనుమతి లేదని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో గ్రామస్థులు టెంట్‌ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేడు అమరావతికి మహిళా కమిషన్‌ బృందం

జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల నిజ నిర్ధారణ బృందం శనివారం తుళ్లూరుతో పాటు అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పర్యటించనుంది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడులు చేశారంటూ, దానికి సంబంధించిన వీడియోలను పలువురు ఇటీవల రేఖాశర్మకు ట్వీట్‌ చేశారు. వాటి ఆధారంగా సుమోటోగా విచారణ ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్‌..నిజ నిర్ధారణ బృందాన్ని పంపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పౌర చట్టాన్ని అంగీకరించం

పౌరసత్వ సవరణ చట్టాన్ని అంగీకరించేది లేదని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ స్పష్టం చేశారు. పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీ మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో  ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజానీకం పౌరసత్వ సవరణ చట్టాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదుల కోటా నుంచి నలుగురు నియమితులయ్యారు. ఆర్‌.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్‌, దొనాడి రమేశ్‌, నైనాల జయసూర్యల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా నియమితులైనవారితో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 16,207 సచివాలయ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటనలు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి. గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.  ఉద్యోగాల కోసం ఈనెల 11 (శనివారం) నుంచి 31లోగా అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం gramasachivalayam.ap.gov.in, vswa.ap.gov.in, wardsachivalayam.ap.gov.in    వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు  సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఇష్టానుసారం 144 సెక్షన్‌ ప్రయోగం కుదరదు

ప్రజా ఉద్యమాలను, భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు తరచూ 144 సెక్షన్‌ ప్రయోగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీచేసింది. అత్యవసరంగా ప్రమాదం ఉంటే తప్ప ఈ సెక్షన్‌ ప్రయోగించడానికి వీల్లేదని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న కారణంతో వాటిని అణచివేయడానికి దీన్ని తరచూ ప్రయోగించడం అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని పేర్కొన్నారు. బాధితులు సవాల్‌ చేయడానికి వీలుగా అన్ని నిషేధాజ్ఞల ఉత్తర్వులను బహిర్గతం చేయాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. జేఎన్‌యూలో దాడి వీరి పనే!

కొద్ది రోజులుగా రగులుతున్న ‘జేఎన్‌యూలో దాడి అంశం’ శుక్రవారం కొత్త మలుపు తీసుకొంది. వర్సిటీలో దాడికి పాల్పడ్డారంటూ 9 మంది చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ చిత్రం కూడా ఇందులో ఉండటం గమనార్హం. నిందితుల్లో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలకు, ఇద్దరు సంప్రదాయవాద సంఘాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధం

ఇరాన్‌పై గరంగరంగా ఉన్న అమెరికా ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టడమే లక్ష్యంగా మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇరాన్‌తో జౌళి, నిర్మాణ, ఉత్పత్తి, గనుల రంగాల్లో ఎవరూ సంబంధాలు ఏర్పరుచుకోకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో శుక్రవారం తెలిపారు. ఉక్కు, ఇనుము తదితర రంగాలకు సంబంధించి విడిగా ఆంక్షలు విధిస్తామని చెప్పారు.

10. చితక్కొట్టి.. సిరీస్‌ పట్టి..

టీమ్‌ఇండియాకు ఎదురే లేదు. గత ఏడాది వరుస సిరీస్‌ విజయాల జోరును కొనసాగిస్తూ.. కొత్త ఏడాదిని కూడా ఘనంగా మొదలుపెట్టింది. లంకతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. శుక్రవారం పుణెలో జరిగిన మూడో టీ20లో అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కోహ్లీసేన.. 78 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.