close

తాజా వార్తలు

Published : 02/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కర్ణాటకలో ప్రధాని పర్యటన నేడు

ప్రధాని మోదీ గురువారం నుంచి కర్ణాటకలో రెండు రోజులపాటు పర్యటిస్తారు. ప్రధాని తుమకూరులో కిసాన్‌ సమ్మాన్‌లో పాల్గొని కృషి కర్మణ్‌ పురస్కారాలు ప్రదానం చేస్తారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి సమాధిని సందర్శిస్తారు. శుక్రవారం బెంగళూరులో జాతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు.

2. నేటి నుంచి పల్లె ప్రగతి

తెలంగాణలో 2020లో ప్రగతి పరవళ్లు తొక్కుతుందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు వెల్లడించినట్లు తెలిసింది. ఆర్థిక మాంద్యాన్ని నివారించేందుకు ముందుజాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. గురువారం నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోందని, రబీ పంటల సాగుకు డోకా లేదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నయాసాల్‌ కిక్కు!

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో రూ.378 కోట్ల విక్రయాలు జరిగాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబరు 30, 31 తేదీల్లో రెండు రోజుల్లోనే రూ.378 కోట్ల సరకు అమ్మారు. బీరు, మద్యం కలిపి రాష్ట్రంలోని మందుబాబులు రెండు రోజుల్లోనే 83.43 లక్షల లీటర్లు ఖాళీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సంక్షేమంలో ఏరివేత!

ఏపీలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 21.58 లక్షల మందికిపైగా అనర్హులున్నారని  వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే తేల్చింది. మొత్తం అనర్హుల్లో అత్యధికంగా 14.25 లక్షల మందికిపైగా రేషన్‌కార్డుదారులున్నారు. తర్వాతి స్థానాలు పింఛన్లు, ఆరోగ్యశ్రీవి. నవంబరు 20 నుంచి డిసెంబరు 20 దాకా రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిగింది. 11 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు ఇతర ముఖ్యమైన పథకాల లబ్ధిదారుల అర్హతనూ పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. భూమి లెక్క తప్పింది!

ఏపీలో భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో భారీగా తప్పులు దొర్లాయి. సాధారణ రికార్డుల్లో ఉన్న వివరాలను 2012లో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో భూములు, వాటి విస్తీర్ణం, యజమానులు, ఇతర వివరాలను రెవెన్యూశాఖ అంతర్గతంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని 17,601 గ్రామాలకుగాను... ఇప్పటివరకు 15,940 గ్రామాల్లోని దస్త్రాల పరిశీలన పూర్తి చేశారు. కొన్ని వివరాలు నమోదు చేయనట్లు, కొన్ని తప్పులుగా పేర్కొన్నట్టు ఈ పరిశీలనలో గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఎన్టీపీసీ కొత్త కానుక!

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్తును కానుకగా ఇవ్వడానికి ఎన్టీపీసీ ముందుకొచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా 900 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు రాష్ట్ర ట్రాన్స్‌కో ఎన్టీపీసీతో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుంది. యూనిట్‌ రూ. 6- రూ. 10 మధ్య ధర ఉన్న విద్యుత్తును ఎన్టీపీసీ రూ. 2.89కే తెలంగాణకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. దశాబ్ది బుజ్జాయిలు 3.92 లక్షలు!

కొత్త సంవత్సరం, దశాబ్ది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది చిన్నారులు జన్మించారని ఐరాస బాలల నిధి (యునిసెఫ్‌) అంచనా వేసింది. ఇందులో సగం జననాలు 8 దేశాల్లోనే ఉంటాయని తెలిపింది. అత్యధికంగా 17% మంది భారత్‌లోనే పుట్టారని వెల్లడించింది. నూతన సంవత్సరం రోజు జన్మించిన చిన్నారులను ఉద్దేశించి ఏటా జనవరిలో యూనిసెఫ్‌ ఉత్సవాలు నిర్వహిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. చట్టాలను అమలు పరచటం రాజ్యాంగవిధి

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేరళ శాసనసభ చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ అన్నారు. పార్లమెంటు ఆమోదించిన ఏ చట్టానైనా అమలు చేయటం రాష్ట్రాల రాజ్యాంగ విధి అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేయకూడదు అని నిర్ణయించుకునే ముందు న్యాయ సలహా తీసుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ క్విజ్‌ పోటీలు

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇతర రాష్ట్రాల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ వేదికగా క్విజ్‌ కార్యక్రమం ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల్లోని సంగీతం, నాటకం, వంటలు, భాష, చరిత్ర, పర్యాటక ప్రదేశాల పట్ల అవగాహనను పెంచడమే లక్ష్యంగా ఈ క్విజ్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జూన్‌ 30 వరకు https://quiz.mygov.in/quiz/ebsb/  లింక్‌ ద్వారా క్విజ్ పోటీల్లో పాల్గొనవచ్చని కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది.

10. ఎవరైనా ఎన్‌సీఏకు వెళ్లాల్సిందే

గాయం నుంచి కోలుకోవడానికి ప్రతి ఆటగాడూ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాల్సిందేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఎన్‌సీఏలో సౌకర్యాలను వాడుకోవడానికి భారత బౌలర్లు కాస్త సందేహిస్తుండడంపై అడిగినప్పుడు.. ‘‘నేను రాహుల్‌ ద్రవిడ్‌ను కలిశాను. ఎన్‌సీఏలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాం. బౌలర్లు ఎన్‌సీఏకు వెళ్లాల్సిందే. ఎవరైనా వాళ్లకు చికిత్స చేయాలనుకుంటే ఎన్‌సీఏకు వెళ్లాలి’’ అని గంగూలీ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.